చిన్న షేర్లు చితికిపోయాయ్‌
close

తాజా వార్తలు

Updated : 11/04/2020 03:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్న షేర్లు చితికిపోయాయ్‌

మార్చిలో 30% వరకు పతనం

దిల్లీ: కొవిడ్‌-19 ప్రభావం నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లో కుదేలవడంతో చిన్న తరహా కంపెనీల షేర్లు చితికిపోయాయి. గత నెలలో 30 శాతం వరకు ఇవి నష్టపోయాయి. మధ్య తరహా కంపెనీల షేర్లూ ఇంచుమించు ఇదే స్థాయిలో పడిపోయాయి. మార్చి ఒక్క నెలలోనే బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 27.60 శాతం, స్మాల్‌ క్యాప్‌ సూచీ 29.90 శాతం మేర పతనమయ్యాయి. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 24 శాతం నష్టపోవడం గమనార్హం. ‘కొవిడ్‌-19 వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోవచ్చన్న అంచనాల మధ్య గత నెలలో ప్రపంచ మార్కెట్లు డీలా పడ్డాయి. ఆ సెగ భారత ఈక్విటీ మార్కెట్లకూ తగలడంతో సూచీలు గణనీయంగా దిద్దుబాటుకు లోనయ్యాయ’ని మోతీలాల్‌ ఓశ్వాల్‌ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. జనవరి 20న 42,273.87 పాయింట్ల వద్ద జీవన కాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ మార్చి 24న 25,638.90 పాయింట్లకు దిగివచ్చింది. అంటే రెండు నెలల వ్యవధిలోనే ఇంచుమించు 17000 పాయింట్లను కోల్పోయిందన్నమాట. అంతేకాకుండా మార్చిలో అత్యధిక ఒక రోజు నష్టాన్ని కూడా సెన్సెక్స్‌, నిఫ్టీలు మూటకట్టుకున్నాయి. ఇదే ప్రభావం అటు చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లపైనా పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సెన్సెక్స్‌ 10,094.12 (24.46%) పాయింట్లు నష్టపోగా.. స్మాల్‌ క్యాప్‌ సూచీ 24.85%, మిడ్‌ క్యాప్‌ సూచీ 24% మేర డీలాపడ్డాయి.
మన మార్కెట్లు పనిచేయలేదు..
గుడ్‌ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లు పనిచేయలేదు. విదేశీ మారకపు మార్కెట్లను కూడా మూసిఉంచారు.
రాణించిన ప్రపంచ మార్కెట్లు
అమెరికా మార్కెట్లు ముందు రోజు రాత్రి సానుకూలంగా ముగియడంతో ఆ ప్రభావం శుక్రవారం ప్రపంచ మార్కెట్లపై కనిపించింది. నిక్కీ (జపాన్‌) 0.79%, హాంగ్‌సెంగ్‌ (హాంకాంగ్‌) 1.38%, కోస్పి (దక్షిణ కొరియా) 1.33%, స్ట్రెయిట్‌ టైమ్స్‌ (సింగపూర్‌) 1.26% చొప్పున పెరిగాయి. షాంఘై (చైనా) మాత్రమే 1.04% నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో డాక్స్‌, ఎఫ్‌టీఎస్‌ఈ సూచీలు కూడా 3.5- 4% మేర లాభపడ్డాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని