సీఎం ఇంటి ఎదుట ధర్నా..  సుఖ్‌బీర్‌ అరెస్టు
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 04:07 IST

సీఎం ఇంటి ఎదుట ధర్నా..  సుఖ్‌బీర్‌ అరెస్టు

చండీగఢ్‌: పంజాబ్‌లో కరోనా టీకాల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వ్యాక్సిన్లను కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రైవేటు ఆస్పత్రులకు ఎక్కువ ధరకు విక్రయించేందుకు కారణమైన ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌సింగ్‌ సిద్ధును మంత్రి వర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్‌  డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ నేతృత్వంలో ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నివాసం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. పార్టీ జెండాలతో వేలాది మంది కార్యకర్తలు గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జస్వీర్‌ సింగ్‌ గర్హి కూడా పాల్గొన్నారు. ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

వ్యాక్సిన్ల కొనుగోలు, పంపిణీ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయాలని సుఖ్‌బీర్‌ డిమాండ్‌ చేశారు. గత కొన్ని రోజులుగా పంజాబ్‌లో వ్యాక్సిన్‌ వ్యవహారం చర్చనీయంగా మారింది. వచ్చే  ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష శిరోమణి అకాళీదల్ ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరకు ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకుంటోందని ప్రతిపక్ష అకాళీదళ్ ఆరోపిస్తోంది. కేంద్రం నుంచి రూ. 400కు కొన్న వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1060కి అమ్ముతోందని, తిరిగి వాళ్లు ప్రజలకు రూ. 1560కి వ్యాక్సిన్‌ వేస్తున్నారని గతంలో సుఖ్‌బీర్‌ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో వ్యాక్సిన్ల వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని పంజాబ్‌ను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ సరఫరాను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో ఉన్న వ్యాక్సిన్లను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కోరింది. దీంతో ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య మంత్రిని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ సీఎం ఇంటి ఎదుట ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని