
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 1 PM
1. ట్రంప్ ఆంక్షల్ని ఎత్తేశారు.. బైడెన్ కుదరదన్నారు!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రెజిల్ సహా పలు ఐరోపా దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ మేరకు సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆయా దేశాల్లో వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా, ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్ని మాత్రం మార్చలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. లక్షద్వీప్‌నూ తాకిన కరోనా మహమ్మారి
దేశంలో కరోనా ఊసు లేని ప్రాంతమేదైనా ఉందంటే.. ఇప్పటివరకు లక్షద్వీప్ అని టక్కున చెప్పేవాళ్లం. కానీ ఇకపై ఆ అవకాశం లేకుండా పోయింది. ఏడాది కాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు ఈ దీవులకీ పాకింది. సోమవారం అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. భారత రిజర్వ్ బెటాలియన్‌కు చెందిన ఓ వ్యక్తి జనవరి 3న కోచి నుంచి కవరత్తి వచ్చారు. ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురవడంతో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* భారత్: గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు
3. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... నిన్న మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమా .. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపడతానని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అరుణాచల్‌లో చైనా హల్చల్
పొరుగు దేశ భూభాగాల ఆక్రమణ పర్వాన్ని చైనా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకంగా ఒక గ్రామాన్ని కూడా డ్రాగన్ నిర్మించినట్లు తాజాగా వెల్లడైంది. ఈ క్రమంలో 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఆ గ్రామంలో 101 ఇళ్లు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది భారత్‌కు ఆందోళనకర అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ సుభాన్‌సిరి జిల్లాలో సారి చు నది ఒడ్డున ఈ గ్రామం వెలిసింది. ఈ ప్రాంతంపై భారత్, చైనాల మధ్య వివాదం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* అక్కడ చైనా గ్రామం.. వివరణ కోరిన చిదంబరం
5. ‘గని’గా వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ అదుర్స్!
మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్రానికి ‘గని’అనే టైటిల్ ఖరారు చేశారు. వరుణ్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. బాక్సింగ్ రింగ్‌లో తీక్షణమైన చూపులతో పంచ్ కొడుతున్న వరుణ్ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా, రెనైసెన్స్ పిక్చర్స్ పతాకంపై సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఇక్కడికి చేరుకున్న సీఎం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేసిన హైకోర్టు
కిలారి రాజేష్, మరికొందరిపై నమోదైన కేసులను ఏపీ హైకోర్టు కొట్టేసింది. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ పోలీసులు కేసులు నమోదు చేయగా... వాటిని కొట్టివేయాలంటూ కిలారి రాజేష్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసులను కొట్టివేసింది. భూములు అమ్మిన వారెవరూ ఫిర్యాదులు చేయలేదని, ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ట్యాంక్‌బండ్‌పై రియల్ హీరో
ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ హైదరాబాద్ ట్యాంక్ బండ్‌ను సందర్శించారు. ట్యాంక్ బండ్‌పై ప్రమాదవశాత్తు మరణించి, ఆత్మహత్యలు చేసుకున్న వారి మృతదేహాలను వెలికితీస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిన శవాల శివను కలిసి సోనూ సూద్ అభినందించారు. ప్రజలు వివిధ రూపాల్లో అందజేసిన నగదుతో శివ ఇటీవల ఓ అంబులెన్స్‌ను కొనుగోలు చేసి ‘సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్’ అని పేరు పెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. క్యాన్సర్‌పై యోధురాలు డా. శాంత కన్నుమూత
ప్రముఖ ఆంకాలజిస్ట్, క్యాన్సర్‌పై రణభేరి మోగించిన శాస్త్రజ్ఞురాలు, పద్మవిభూషణ్ డాక్టర్ వి.శాంత కన్నుమూశారు. తన జీవితంలో సుదీర్ఘకాలం క్యాన్సర్ రోగుల సంరక్షణ కోసం కృషిచేసిన 93ఏళ్ల శాంత.. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఛాతిలో నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. భారత్ అద్భుత విజయం
టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి