close

తాజా వార్తలు

Published : 14/07/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సైంటిస్ట్‌ కొలువు వదిలి వైరస్‌పై యుద్ధం!

‘గో కరోనా’ నినాదాన్ని ఇంతకుముందే ‘మైక్రో గో’ మంత్రంతో ఆచరిస్తోందామె. తాజాగా చేతులకు వైరస్‌ అంటకుండా ఉండే ‘హ్యాండ్‌ హైజనిక్‌ డివైజ్‌’ అస్త్రాన్ని దేశానికి కానుకగా అందించింది. విదేశంలో ఉన్నత విద్యనభ్యసించి.. బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో శాస్త్రవేత్త ఉద్యోగాన్ని వదిలేసి, అంకుర పరిశ్రమను ప్రారంభించింది రచనా దావె. ‘మైక్రో స్వచ్ఛత’ విధానంతో కరోనాపై పోరాటం చేస్తున్న ఆమెను వసుంధర పలకరించింది..

కోల్‌కతాకు చెందిన గుజరాతీయుల కుటుంబం రచనది. తండ్రి నరేంద్ర దావె ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగి. తల్లి జయశ్రీ గృహిణి. ఈ ఇద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి రచన. చిన్నప్పటి నుంచి వైద్యురాలు కావాలని కలలు కనేది. ప్రవేశ పరీక్షలో ర్యాంకు రాకపోవడంతో మైక్రోబయాలజీలో డిగ్రీ చేసింది. పీజీ చదివింది. తర్వాత అమెరికా వెళ్లి పీహెచ్‌డీ చేసింది. చదువు పూర్తయిన వెంటనే తమిళనాడు కల్పాక్కంలోని బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించింది.

మూడేళ్లు పరిశోధనలు..
పరిశోధనలంటే ఇష్టం రచనకు. ప్రతిష్ఠాత్మకసంస్థలో అందుకు తగిన ఉద్యోగమే వచ్చిందామెకు. లక్షకుపైగా జీతం. లక్ష్యానికి తగ్గ ఉద్యోగం. అదే సంస్థలో పనిచేసే డాక్టర్‌ హెరేన్‌ జోషితో పరిచయం.. తర్వాత పరిణయం.. జీవితం అంతా సాఫీగా సాగిపోయింది. అయినా.. రచన మనసులో ఏదో వెలితి. ఇంకేదో సాధించాలనే తపన. సొంతంగా అంకుర పరిశ్రమను నెలకొల్పుతానంది. అమ్మానాన్నలు వద్దన్నారు. ఇంత మంచి ఉద్యోగాన్ని వదులుకోవడం సరికాదన్నారు. ప్రధాని, రాష్ట్రపతి వంటి గొప్ప వ్యక్తులను నేరుగా కలిసే అవకాశం కాదనుకొని.. మళ్లీ మొదటి నుంచి ప్రయాణం అవసరమా అని వారించారు. ‘మా ఆయన నాకు అండగా నిలిచారు. నా మనసుకు నచ్చిన పని చేయమని ప్రోత్సహించారు. ఆయన మద్దతుతో ఎనిమిదేళ్ల ఉద్యోగ ప్రయాణానికి స్వస్తి పలికి.. 2016లో చిన్న ల్యాబ్‌ ప్రారంభించాను. అనారోగ్యాలతో పట్టిపీడించే వైరస్‌లకు చెక్‌ పెట్టాలని పరిశోధనలు మొదలుపెట్టాను. రోగాలకు దారి చూపే వైరస్‌లను దూరంగా పొమ్మనే అర్థం వచ్చేలా మా సంస్థకు ‘మైక్రో గో’ అని పేరు పెట్టాను. మూడేళ్ల పరిశోధనల తర్వాత ఏడాది కిందట మార్కెట్‌లోకి అడుగుపెట్టాం’ అని చెబుతోంది రచన.

వ్యర్థజలాలకు పునరుజ్జీవం..
నీటి పునర్వినియోగంపై పలు పరిశోధనలు చేసింది రచన. వ్యర్థ జలాలను మంచి నీటిగా మార్చే యంత్రాల్లో వాడే ఉత్పత్తిని కనిపెట్టింది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌ ఇలా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లోని రైల్వే స్టేషన్లలోని యంత్రాల్లో ఈ ఉత్పత్తిని వినియోగిస్తున్నారు. మరోవైపు వినియోగదారులకు స్వచ్ఛమైన కాయగూరలు, పండ్లు అందించే దిశగా మరో ఉత్పత్తిని తీసుకొచ్చింది. రైతుల నుంచి కూరగాయలు రవాణా చేస్తున్నప్పుడు ‘మైక్రో గో’ ప్రొడక్ట్‌తో కలిపి ప్యాకింగ్‌ చేస్తారు. ఇలా చేయడం వల్ల అవి పదిహేను రోజుల పాటు పాడవ్వకుండా తాజాగా ఉంటాయి. రసాయన రహితమైన ప్రొడక్ట్‌ కావడంతో కూరగాయలు కలుషితమయ్యే సమస్యే ఉండదు అంటుంది రచన.

ఆరుస్థాయిల్లో శుభ్రం..
కరోనా నేపథ్యంలో చేతుల పరిశుభ్రతకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది. శానిటైజర్ల వినియోగమూ పెరిగిపోయింది. చేతులు తాకకుండా శానిటైజ్‌ చేసుకునే యంత్రాన్ని రూపొందించింది రచన. ‘హ్యాండ్‌ హైజీన్‌ డివైజ్‌’ను డిజైన్‌ చేసింది. ‘ఈ పరికరం ద్వారా చేతులు ఆరు స్థాయుల్లో శుభ్రమవుతాయి. అప్పటి వరకూ ఉన్న వైరస్‌లన్నీ తొలగిపోతాయి. ఇప్పటికే హైదరాబాద్‌ సహా 22 నగరాల్లోని విమానాశ్రయాల్లో ఈ పరికరాన్ని ఏర్పాటు చేశారు. కొవిడ్‌-19 పరిశోధనశాలలు, అపోలో ఆసుపత్రి శాఖలన్నింటిలోనూ దీనిని వినియోగిస్తున్నారు’ అని చెప్పుకొచ్చింది రచన.Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని