close

ఆర్థిక అండ దండ ఏదీ! 

పన్నుల వాటా పెరగాలి 
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలి 
తెలంగాణ పథకాలు.. కార్యక్రమాలను పరిశీలించండి 
వాటికి అవసరమైన నిధులు ఇవ్వండి 
15వ ఆర్థిక సంఘానికి నివేదించనున్న రాష్ట్ర ప్రభుత్వం 
సమగ్ర నివేదికను రూపొందిస్తున్న అధికారులు

కొత్తగా ఏర్పాటైన తమ రాష్ట్రానికి నిధులతో కేంద్రం అండగా నిలవాలని, ఆ దిశగా సిఫారసులు చేయాలని 15వ ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఇక్కడ పలు అంశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరనుంది. వీటితో పాటు వివిధ పథకాలకు సంబంధించి సమగ్రమైన నివేదికను రాష్ట్రప్రభుత్వం తయారు చేస్తోంది. ఇందుకు ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డితో పాటు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సహా ముఖ్య అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. పథకాల రూపకల్పనలో స్వేచ్ఛ, పన్నుల వాటా పెంపు, ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు, నగర, పట్టణ స్థానిక సంస్థలకు నిధులు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు సహా వివిధ అంశాలను నివేదికలో పేర్కొంటున్నారు. 2017 నవంబరులో 15వ ఆర్థిక సంఘం ఏర్పాటైంది. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో ఆర్థిక సంఘం పర్యటించింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు.. వివిధ పార్టీలు, సంస్థలు, విభాగాల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. వాస్తవానికి ఆర్థిక సంఘం ఇప్పటికే తెలంగాణకు రావాల్సి ఉండగా శాసనసభ రద్దు, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. కాబట్టి త్వరలో రాష్ట్రానికి రానుంది. ఇలా రాష్ట్రాల నుంచి సేకరించిన అభిప్రాయాలను ఈ ఏడాది చివరిలోగా కేంద్రానికి సంఘం అందజేయనుంది. 

నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదు 
రైతు బంధు పథకానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కేంద్రం కూడా ఈ పథకం గురించి ఆలోచిస్తోంది. ఇంతటి ఉపయోగమున్న ఈ పథకానికి నిధులు కేటాయించాలి. రాష్ట్రంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మిషన్‌ భగీరథ, వ్యవసాయ రుణాల మాఫీ, రైతు బంధు, రైతులకు వ్యక్తిగత బీమా సహా అనేక ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వీటికి నిధులను కేటాయించాలి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు ప్రత్యేకంగా నిధులివ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా కేంద్రం ఇవ్వలేదు. భారీగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన నేపథ్యంలో కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు నిధులివ్వాలి. 
రాష్ట్రప్రభుత్వం నివేదించనున్న అంశాలివే 
ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ముందున్నా ఇక్కడ దృష్టి సారించాల్సిన అనేక అంశాలకు నిధులు అవసరం. హైదరాబాద్‌ సహా మూడు జిల్లాలు మాత్రం తలసరి ఆదాయంలో ముందున్నా మిగిలిన 28 జిల్లాల తలసరి ఆదాయం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, పథకాల అమలుకు తోడ్పాటునివ్వాలి. 
కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఆరోగ్యం, విద్యకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక పథకాలకే కాకుండా నేరుగా రాష్ట్రాలకు నిధులిచ్చి సొంతంగా రాష్ట్రానికి అవసరమైన పథకాలను రూపొందించుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. కేంద్ర మార్గదర్శకాలతో పథకాలు అమలు చేయడం సమస్యగా ఉంది. విద్య, ఆరోగ్యం పథకాలు కేంద్రం అమలు చేయకుండా ఆ నిధులు రాష్ట్రానికి నేరుగా అందజేయాలి. 
కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను పెంచాలి. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పన్నుల వాటాను 42 శాతంగా నిర్ణయించింది. రాష్ట్రాల అవసరాలు పెరుగుతున్న నేపథ్యం ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడానికి రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లడానికి వీలుగా పన్నుల వాటా శాతాన్ని పెంచాలి. 

ద్రవ్య నియంత్రణ, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిని పెంచాలి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మూడు శాతంగా నిర్దేశించగా రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గరిష్ఠంగా దీన్ని మరో అరశాతం పెంచుకోవడానికి కేంద్రం అనుమతిస్తుంది. ఎఫ్‌ఆర్‌బీఎం నియంత్రణతో రాష్ట్రానికి నిధులు సమకూర్చుకోవడంలో అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా పటిష్ఠమైన స్థితిలో ఉన్న రాష్ట్రంలో బడ్జెట్‌ పరిధిలో నిధులు సమకూర్చుకోవడానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలి.

-ఈనాడు, హైదరాబాద్‌

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.