close
విపక్షాలది అవినీతి ఆరాటం 

అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రోత్సహించేందుకు తపిస్తున్నాయి 
మహాకూటమి  ఒక విఫల ప్రయోగం 
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీలు ఆ పార్టీతోనే కలుస్తున్నాయి 
ఏ అవినీతికీ పాల్పడకపోతే సీబీఐని అడ్డుకోవడమెందుకు? 
భాజపా జాతీయ సమ్మేళనంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

దిల్లీ: భాజపాకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ‘జాతీయ స్థాయిలో ఏర్పాటవుతున్న మహాకూటమి’ ఒక విఫల ప్రయత్నమనీ... అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని పెంచి పోషించే బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే దాని లక్ష్యమని ఆయన మండిపడ్డారు. భాజపా మాత్రం సమగ్రాభివృద్ధి దిశగా సమర్థ పరిపాలనను అందించడంపైనే గురి పెట్టుకుందన్నారు. అయోధ్యలో రామాలయ సమస్యకు పరిష్కారం కనుగొనడం కాంగ్రెస్‌ పార్టీకి సుతరామూ ఇష్టం లేదనీ, తన న్యాయవాదుల ద్వారా దీన్ని అడ్డుకుంటోందని ఆరోపించారు. శనివారమిక్కడ భాజపా జాతీయ సమ్మేళనం చివరి రోజు సదస్సులో మోదీ ప్రసంగించారు. 
‘‘భావసారూప్యతను బట్టి రాజకీయ పార్టీలు కలవడం సాధారణం. కానీ... కాంగ్రెస్‌కూ, దాని సంస్కృతికి విరుద్ధంగా పుట్టిన పార్టీలే ఇప్పుడు ఆ పార్టీతో చేతులు కలుపుతున్నాయి. ప్రధానిని కుర్చీలోంచి దించేయాలన్న ఏకైక లక్ష్యంతోనే అవి కలుస్తున్నాయి! దృఢమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే అవినీతిని అంతం చేయవచ్చని మేం భావిస్తున్నాం. విపక్షాలు మాత్రం ‘తమ దుకాణాలు’ ఎక్కడ మూతపడిపోతాయోనని భయపడుతున్నాయి. అవినీతికి వంతపాడే బలహీనమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశంతో ఒక్కటవుతున్నాయి. తమ సర్కారు వస్తే బంధువులకు మేలు చేసుకోవచ్చన్నది వాటి ఆలోచన. అందుకే వారు ‘అందరం కలుద్దాం. అందరం వికసిద్దాం’ అని చెప్పుకొంటున్నారు. 

సీబీఐని ఎందుకు అడ్డుకుంటున్నారు? 
ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు... కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు తమ అనుమతిని ఉపసంహరించుకున్నాయి. ఎందుకు? ఏ అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని భయపడుతున్నారు? నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ సర్కారు సీబీఐని వాడుకుని ఏళ్ల తరబడి వేధింపులకు గురిచేసింది. కానీ... నేనెన్నడూ దర్యాప్తు సంస్థకు అడ్డుపడలేదు. 
అవినీతి మచ్చలేని సర్కారు మాది 
దేశ చరిత్రలోనే అవినీతి అంటని తొలి సర్కారుగా మా ప్రభుత్వం నిలిచింది. అవినీతికి తావులేకుండా దేశాన్ని నడపవచ్చని భాజపా రుజువు చేసింది. ఎవరి హక్కులకూ భంగం కలుగకుండా... ఆర్థికంగా వెనుకబడిన తరగతుల యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్‌ను తీసుకొచ్చాం. 
అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం 
గత ప్రభుత్వాలు రైతులను ఓటు బ్యాంకుగానే చూశాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం తాత్కాలిక ఉపశమనాలను మాత్రమే కలిగించాయి.  మేం మాత్రం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. దీర్ఘకాలిక విధానాలను, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తున్నాం. 2020 నాటికి అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు రేయింబవళ్లు కృషి సలుపుతున్నాం. ఇప్పటికే ఉత్పత్తి ధరకు 1.5 రెట్లు సమానమైన మద్దతు ధరను అందిస్తున్నాం.’’ అని మోదీ పేర్కొన్నారు.

కుమారస్వామి ఓ గుమాస్తా

మహాకూటమి కర్ణాటకలో తన తొలి సర్కారును ఏర్పాటు చేసింది. అక్కడ ముఖ్యమంత్రి కుమారస్వామిని కాంగ్రెస్‌ పార్టీ ఓ గుమాస్తాగా వాడుకుంటోంది. ఆయన కూడా తాను ముఖ్యమంత్రినన్న విషయాన్ని మర్చిపోయి, బాధను దిగమింగే పనిలో పడిపోయారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.