close
మోదీ పాలనతో పెనుముప్పు 

ఆయన్ను పదవి నుంచి దించేయండి 
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పిలుపు

గంగావతి, సింధనూరు (కర్ణాటక), న్యూస్‌టుడే: ‘దేశానికి పొంచి ఉన్న పెను ప్రమాదం నరేంద్ర మోదీ. ఆయనను ప్రధాని పదవి నుంచి దించేద్దాం. ప్రవాసాంధ్రులు, కన్నడిగులు సహకరించాలి’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం కర్ణాటకలోని శ్రీరామనగర, సింధనూరు ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘మోదీది మాటల గారడీ. అన్నీ అబద్ధాలే చెబుతారు. మహాత్ముడు జన్మించిన ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతానికే కళంకం తెస్తున్నారు. ఆంధ్ర, కర్ణాటకకే కాదు దేశానికీ మోదీ చేసిందేమీ లేదు’ అని దుయ్యబట్టారు. 
ఆయన మాటలకు, చేతలకు పొంతనలేదు 
మోదీ మాటలు, చేతలకు పొంతన లేదని చంద్రబాబు విమర్శించారు. ‘మోదీ హయాంలో 6 శాతం ఉద్యోగాలు పోయాయి. ఈ ఐదేళ్ల్లలోనే అత్యధికంగా సైనికులు చనిపోయారు. బాలాకోట్‌ వాయు దాడులకు సంబంధించి బాలీవుడ్‌ సినిమా చూపించారు. 380 మంది ఉగ్రవాదులు చనిపోయిన విషయాన్ని ఎవరూ నిర్ధారించలేదు. గోవధ అంశం పలుచోట్ల హింసకు దారి తీసింది. రూ.2వేల నోట్లను నేను వద్దన్నా. పెద్ద నోట్లతో ఓట్లను కొనుగోలు చేసే పన్నాగం దీని వెనుక దాగి ఉంది. స్విస్‌ బ్యాంకుల నుంచి నల్లధనం తేలేదు. ఈ ఐదేళ్ల్లలో ప్రవాహంలా నల్లధనం స్విస్‌ బ్యాంకులకు తరలిపోయింది. ఆర్థిక నేరగాళ్లను విదేశాలకు పంపారు. నిజాయతీపరులు, రాజకీయ నాయకులపై కక్ష తీర్చుకుంటున్నారు. భాజపాకు ఈసారి 150 నుంచి 170 స్థానాలే గగనం అంటూ సర్వేల్లో తేలింది’ అని వివరించారు. ‘కర్ణాటకలో భాజపా ప్రభుత్వం లేదు.. అయినా ఈ ఎన్నికల్లో భాజపా రూ.వేల కోట్లు ఖర్చుపెడుతోంది. అదంతా ఎవడబ్బ సొమ్ము?’ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై పనిగట్టుకుని సీబీఐ దాడులు చేయిస్తున్నారని తప్పుబట్టారు. 
తుంగభద్ర పూడిక తీతపై భరోసా 
కర్ణాటకాంధ్రల జీవనాడి తుంగభద్ర జలాశయంలో పూడిక తీతపై చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఆంధ్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. తెలుగు జన్మభూమి, కర్మభూమి రుణం తీర్చుకోవాలని కోరారు. శ్రీరామనగర, సింధనూరు సభల్లో కన్నడలో ప్రసంగం ప్రారంభించిన బాబు తెలుగు, కన్నడిగుల అన్యోన్యతను చాటారు. ‘ఇకపై కర్ణాటకకు తరచూ వస్తా.. అవసరమనుకుంటే కన్నడ నేర్చుకుంటా..’ అని చెప్పారు. 
ఎన్టీఆర్‌కు నివాళి 
సింధనూరులో హెలికాప్టర్‌ దిగిన వెంటనే చంద్రబాబు నేరుగా సభా ప్రాంగణానికి వెళ్లకుండా స్థానిక తెలుగు మిత్రులు రూ.10 కోట్లతో నిర్మించిన ‘క్లబ్‌ కాకతీయ’ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనకు తెలుగు ఆడపడుచులు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడే దివంగత ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.