close
హైదరాబాద్‌లోనూ ఐసిస్‌ ప్రకంపనలు 

2016లో భారీ విధ్వంసానికి కుట్ర 
అప్పట్లో గుట్టురట్టు చేసిన నిఘా సంస్థలు 
కొలంబో పేలుళ్ల నేపథ్యంలో నగరంపై నిఘా సంస్థల దృష్టి 
ఈనాడు - హైదరాబాద్‌

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస పేలుళ్ల నేపథ్యంలో ఐసిస్‌ సానుభూతిపరులకు అడ్డాగా మారిన హైదరాబాద్‌పై నిఘా సంస్థలు దృష్టిసారించాయి. కొలంబో తరహాలోనే 2016లో హైదరాబాద్‌లోనూ భారీ విధ్వంసం సృష్టించేందుకు పన్నిన కుట్రను అప్పట్లోనే నిఘా సంస్థలు సమర్థంగా తిప్పికొట్టగలిగాయి. అది మొదలు క్రమం తప్పకుండా నగరంలో ఐసిస్‌ అడుగుజాడలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఎ.) నగరంలోని మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కీలకమైన సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఇంకా అనేక మంది సానుభూతిపరులు ఉండవచ్చని అనుమానిస్తున్న అధికారులు కొలంబో విధ్వంసం నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు. 
ఎనిమిది మంది ముఠాగా ... 
హైదరాబాద్‌లో భారీ మారణహోమానికి 2016లోనే ఐసిస్‌ ప్రయత్నించింది. ఐసిస్‌ అనుబంధ సంస్థ ‘జుంద్‌ ఉల్‌ ఖలీఫా అల్‌ హింద్‌ ఫి బిలాద్‌’ తరఫున ఎనిమిది మంది సభ్యులు ముఠాగా ఏర్పడి నగరంలోని వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ భవనాలు, పోలీస్‌స్టేషన్లలో బాంబులు పేల్చాలని కుట్రపన్నారు. సిరియాలో ఉంటున్న ఉగ్రవాదుల ఆదేశాల మేరకు అబ్దుల్లా బిన్‌ అల్‌ అహ్మద్‌ అమోది నేతృత్వంలో ఏర్పడ్డ ఈ ముఠా బాంబుల తయారీకి ప్రత్యేకంగా సొంత ల్యాబొరెటరీనే ఏర్పాటు చేసుకుంది. హబీబ్‌ మహ్మద్‌ అనే ఐసిస్‌ సానుభూతిపరుడి ఇంటి మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ ల్యాబొరెటరీని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. అత్యంత శక్తిమంతమైన బాంబులు తయారు చేసేందుకు ఇక్కడ ప్రయోగాలు చేశారు. ఇందుకోసం యూరియా, క్లోరో-9, మిథైల్‌ ఎసిడ్రిన్‌, మిథైల్‌క్లోరైడ్‌, ఎసిటోన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, నైట్రిక్‌ యాసిడ్‌తోపాటు ఇనుప మేకులు, స్టీల్‌ బాల్సు వంటివాటిని కూడా సమకూర్చుకున్నారు. ఈ ముఠా బాంబులు పేల్చడంతోపాటు తుపాకులతోనూ కాల్పులు జరిపి మారణహోమం సృష్టించాలని తలపెట్టింది. ఇందుకు అవసరమైన ఆయుధాలు కూడా సమకూర్చుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌.ఐ.ఎ. అధికారులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. లేకపోతే అప్పట్లోనే పెను విధ్వంసం జరిగి ఉండేది. అది మొదలు క్రమం తప్పకుండా హైదరాబాద్‌లో ఐసిస్‌ సానుభూతిపరులు పట్టుబడుతూనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో అరెస్టయిన మహ్మద్‌ అబ్దుల్లా బాసిత్‌ ఒక్కడే నగరానికి చెందిన పదుల సంఖ్యలో యువకులను ఐసిస్‌ వైపు వెళ్లేలా ప్రేరేపించినట్లు గుర్తించారు. అతని అనుచరులుగా భావిస్తున్న నగరానికి చెందిన జీషాన్‌, మసూద్‌ తోహాజ్‌, షిబ్లీ బిలాల్‌లతోపాటు మహారాష్ట్రలో ఉంటున్న బాసిత్‌ రెండో భార్య మోనలను ఇప్పుడు ఎన్‌.ఐ.ఎ. అధికారులు విచారిస్తున్నారు. ఇవన్నీ బయటకు వచ్చిన పేర్లు మాత్రమే. ఇంకా అజ్ఞాతంలో అనేక మంది ఉండి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఐసిస్‌ అలజడి కాస్త చల్లబడింది. దాంతో మన దేశానికీ దీని ముప్పు తప్పినట్లేనని ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొలంబోలో మారణహోమానికి పాల్పడింది ఆ సంస్థేనని తెలియడంతో దేశ భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఐసిస్‌ సానుభూతిపరులకు అడ్డాగా మారిన హైదరాబాద్‌పై ఎన్‌.ఐ.ఎ.తోపాటు ఇతర నిఘా సంస్థలు కూడా ప్రత్యేక దృష్టి సారించాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.