close
హోదా ఇవ్వాల్సిందే

ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్‌
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభ
ప్యాకేజీ వద్దే వద్దని స్పష్టీకరణ

ఏపీ ఆర్థికంగా, ద్రవ్యపరంగా కోల్పోయిన వాటిని పూరించేందుకు.. అభివృద్ధి పథంలో నిలిపేందుకు.. ప్రత్యేక హోదా తప్పనిసరి. దీనివల్ల అత్యంత ప్రాధాన్యత ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఐదు నక్షత్రాల హోటళ్లు, తయారీ పరిశ్రమలు, ఐటీ సేవలు, అత్యుత్తమ విద్యా సంస్థలు వస్తాయి.

- ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ గట్టిగా గళమెత్తింది. ప్యాకేజీ వద్దే వద్దని తేల్చి చెప్పింది. హోదా ఇవ్వాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన మంగళవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులంతా ఆమోదించారు. మండలిలోనూ ఇదే తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని అభివృద్ధి పథôలో నడిపేందుకు సంజీవని అయిన ప్రత్యేక హోదా తప్పనిసరి. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఇస్తున్న గ్రాంట్ల తలసరి రూ.5,573 ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న తలసరి రూ.3,428 మాత్రమే. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఆదాయ పన్ను, జీఎస్‌టీల మినహాయింపు, ఇతర రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందిస్తున్నందువల్ల హోదాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలన్నా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దారితీసే పారిశ్రామికాభివృద్ధి జరగాలన్నా ప్రత్యేక హోదాతో వచ్చే ప్రోత్సాహకాలు కీలకం. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి గత ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుతూ ఇదే అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసింది. ఆ ప్యాకేజీ వద్దని, హోదా కావాలని మా ప్రభుత్వం తరఫున తీర్మానాన్ని ప్రవేశ పెడుతున్నా’ అని జగన్‌ ప్రకటించారు. జాప్యం లేకుండా హోదాను ఇవ్వాల్సిందిగా 5కోట్ల రాష్ట్ర ప్రజల తరఫున కేంద్రాన్ని కోరుతున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

దుర్మార్గంగా విభజించారు...
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ప్రజల అభిప్రాయాలను ఖాతరు చేయకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించారు. ఇలాంటి విభజనతో కొత్త ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా నష్టం జరుగుతుందని తెలిసినా ఆనాటి కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు నడిచింది. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దకపోగా మరింత పెరగడానికి కారణమైంది. అందువల్లే ఇంతటి పోరాటం చేయాల్సి వస్తోంది’ అని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. విభజన ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 59 శాతం జనాభాను, అప్పు- చెల్లింపు బాధ్యతలను వారసత్వంగా పొందాం. ఆదాయం కేవలం 47 శాతం మాత్రమే. ఆదాయాన్నీ, ఉద్యోగాల్ని ఇచ్చే రాజధాని నగరం లేకుండా అతి తక్కువ మౌలిక సదుపాయాలతో మానవ, ఆర్థిక అభివృద్ధి సూచికల్లో వెనుకబడి వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోయాం’ అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

శాసనసభ నిరవధిక వాయిదా
ఏపీ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ప్రత్యేక హోదా కోరుతూ శాసనమండలిలో తీర్మానం చేసిన అనంతరం నిరవధిక వాయిదా పడింది.

ఏపీ ఉపసభాపతిగా కోన రఘుపతి

శాసనసభ ఉపసభాపతిగా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఉపసభాపతిగా ఎన్నికైనట్లు సభాపతి తమ్మినేని సీతారాం మంగళవారం శాసనసభలో ప్రకటించారు. అనంతరం సభానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తదితరులు రఘుపతిని సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.