close
మేత ఏది? గొర్రె మేసింది! గొర్రె ఏది? వలస వెళ్లింది!

గొర్రెల అభివృద్ధి పథకంలో కొనుగోల్‌మాల్‌
కరీంనగర్‌ జిల్లాలో అనుమతి లేకుండా రూ.7.50 కోట్ల విలువైన గొర్రెల కొనుగోలు
అందులో 85 శాతం జీవాల జాడ లేదు
నిధుల కోసం లేఖ రాయడంతో విషయం వెలుగులోకి
అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి కలెక్టర్‌ లేఖ
ఈనాడు - హైదరాబాద్‌

ఆవు బొమ్మ వేయాల్సిందిగా ఓ చిత్ర లేఖనం మాస్టారు తరగతి గదిలోని విద్యార్థికి సూచిస్తాడు. కాసేపటి తర్వాత సదరు విద్యార్థి తాను గీసిన కాగితాన్ని మాస్టారుకు ఇస్తాడు. అది ఖాళీగా ఉండటంతో ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. ‘ఆవు ఏదిరా అంటూ’ బెత్తమెత్తుతాడు. ‘‘నేను వేశానండీ..మీరు చూసే సరికి మేతకు వెళ్లినట్టుంది’’ అని సమాధానమివ్వడంతో మాస్టారు కోపం నషాళానికంటుతుంది. అయినా తమాయించుకుని ‘మరి మేత ఏదిరా’ అని ప్రశ్నించగా ‘ఆవు తినేసినట్టుందండీ’ అనే సమాధానం రావడంతో అవాక్కవడం ఆయన వంతవుతుంది. ఇది ఓ సినిమాలో సన్నివేశం. ఎంతో ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం వాస్తవ పరిస్థితి అచ్చు గుద్దినట్టు ఇలాగే ఉంది. కరీంనగర్‌ జిల్లాలో ఈ పథకంలో అవకతవకలు జరిగాయనే అనుమానంతో విచారణకు వెళ్లిన అధికారులకు దాదాపు ఇదే అనుభవం ఎదురైంది.

గొర్రెల పెంపకం దారులకు మరింత ఆదాయం సమకూర్చడం, మాంసం ఎగుమతులు పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గొర్రెల అభివృద్ధి పథకం అమలు చేస్తోంది. ఈ పథకంలో ఒక్కో యూనిట్‌ కింద 21 గొర్రెలను లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తోంది. ఒక్కో యూనిట్‌ విలువను రూ.1.25 లక్షలుగా నిర్ధారించారు. నిబంధనల మేరకు నిధులు విడుదల చేసిన తర్వాతే జీవాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కరీంనగర్‌ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. పోనీ గొర్రెలైనా ఉన్నాయా? అంటే అదీ లేదు.

600 యూనిట్లు కొన్నాం..నిధులివ్వండి
ఈ పథకంలో భాగంగా ఒక్క యూనిట్‌ కొనుగోలు చేయాలన్నా ముందస్తుగా కలెక్టరు నుంచి అనుమతి తీసుకోవాలి. గొర్రెల రవాణా, దాణా కోసం కేటాయించిన నిధులు వినియోగించాలన్నా అనుమతి తప్పనిసరి. కరీంనగర్‌ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా 12,600(ఆరు వందల యూనిట్లు) గొర్రెలు కొనుగోలు చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేయాల్సిందిగా కలెక్టర్‌కు లేఖ రాయటంతో ఆయన అవాక్కయ్యారు. రూ.7.50 కోట్ల విలువైన యూనిట్లను అనుమతి లేకుండా ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది? అంత సొమ్ము ఎక్కడిది? నిజంగా కొనుగోలు చేశారా? లేదా? ఆ పేరుతో సొమ్ములు దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారా? అని తెలుసుకునేందుకు కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

80 శాతం క్షేత్ర స్థాయిలో లేవు
విచారణలో భాగంగా గొర్రెలు అందుకున్న లబ్ధిదారుల ఇళ్లకు అధికారులు వెళ్లారు. పంపిణీ చేసిన సంఖ్యకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి పొంతన లేకపోవటంతో కంగుతిన్నారు. జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన గొర్రెల్లో 80 శాతం లబ్ధిదారుల వద్ద లేవని విచారణలో తేల్చారు. ఆ గొర్రెలు ఏమయ్యాయిని తాము ప్రశ్నించగా ‘వలస వెళ్లాయని లబ్ధిదారులు చెప్పారని’ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. మొత్తంగా పంపిణీ చేసిన గొర్రెల్లో 17.5 శాతం మాత్రమే లబ్ధిదారుల వద్ద ఉన్నాయని, 2.5 శాతాన్ని తామే విక్రయించినట్లు లబ్ధిదారులు అంగీకరించారని నివేదికలో పొందుపరిచారు. ఉన్న గొర్రెల చెవులకు వేసిన బిళ్లలు(ట్యాగ్స్‌) లేవని గుర్తించినట్టు పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో గుర్తించిన మీదట బాధ్యుడైన పశుసంవర్ధక శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ నవాజ్‌ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో నిర్వహించిన దర్యాప్తు తాలూకూ నివేదికను కూడా ఆయన లేఖకు జతచేసినట్టు, చెల్లింపులను నిలుపుదల చేయాలని లేఖలో కోరినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్‌ నుంచి పక్షం రోజుల క్రితమే నివేదిక అందినా ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సాహసం చేయకపోవటం పశుసంవర్ధక శాఖలో చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారికి ఓ మంత్రి అండదండలున్నాయని, ఆ ధైర్యంతోనే సదరు అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. చర్యల సంగతటుంచి ఆయన నయానాభయానా నిధులు విడుదల చేయించుకునే దిశగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.