close
రాష్ట్ర అవసరాలు తీరాకే బయటకు

గోదావరి జలాల మళ్లింపుపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ప్రాజెక్టుల అవసరాలు తీరాకే గోదావరి జలాలను వేరే బేసిన్‌కు మళ్లించాలని.. ఉన్న నీళ్లు ఇక్కడి అవసరాలకే సరిపోతాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య జరిగే ఒప్పందాలు, ప్రణాళికలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమని, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోరాదని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తెలంగాణ వాటా దక్కలేదని పేర్కొంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యంలో గోదావరి నీటి మళ్లింపుపై నిర్వహించిన సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలతో ఓ నివేదికను రూపొందించి సంస్థ ఛైర్మన్‌, గౌరవ కార్యదర్శి ప్రభుత్వానికి పంపారు.

నివేదికలో ముఖ్యాంశాలు
* మొత్తం 75 శాతం నీటి లభ్యత కింద భాగస్వామ్య రాష్ట్రాల వాటా పోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు 1480 టీఎంసీలు ఉంటాయి. 2004లో వాప్కోస్‌ కన్సల్టెన్సీ సంస్థ కూడా దీనిని ధ్రువీకరించింది. ఇందులో తెలంగాణకు 950, ఆంధ్రకు 530 టీఎంసీలు ఉన్నాయి. తెలంగాణకు ఉన్న కేటాయింపుల్లో సగానికి పైగా వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
* జి4, జి5, జి6 సబ్‌ బేసిన్లలో ఉన్న ప్రాజెక్టులకు చేసిన కేటాయింపుల మేరకు నీరు రావడం లేదు. జి4 సబ్‌ బేసిన్‌లో సింగూరు, నిజాంసాగర్‌, ఘన్‌పూర్‌ ఆనకట్ట ప్రాజెక్టులున్నాయి. జి5లో శ్రీరామసాగర్‌, ఎల్లంపల్లి ఉన్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్ర చేపట్టిన నిర్మాణాల వల్ల ఈ ప్రాజెక్టులకు నీరందడం లేదు. గోదావరిలో లభ్యమయ్యే నీటిలో ప్రాణహితలో 33 శాతం, ఇంద్రావతిలో 23 శాతం ఉన్నాయి. తెలంగాణ తన నీటి కేటాయింపులు వినియోగించుకోలేకపోవడం.. పోలవరం పూర్తి కాకపోవడం వల్ల ఎక్కువ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి.
* కర్ణాటక, మహారాష్ట్రలు ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత కృష్ణా బేసిన్‌లో ఎదురైన పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. గోదావరిపై రాంపూర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని మళ్లించి ఎస్సారెస్పీ మొదటి, రెండోదశ, ఎఎంఆర్‌పి, నాగార్జునసాగర్‌, దిండి ఆయకట్టుకు సరఫరా చేయాలి. ఈ నీటిని తెలంగాణలోనే వాడాలి. ఈదృష్ట్యా గోదావరి నీటిని ఇంకో రాష్ట్రంలోని బేసిన్లకు మళ్లించడం సాధ్యం కాదు. దీనివల్ల అంతర్‌రాష్ట్ర సమస్యలు వస్తాయి.
* ఏపీ వరద జలాలను కృష్ణా బేసిన్‌కు బయటనే వినియోగిస్తుంది. అక్కడి ప్రాజెక్టులు బయటి బేసిన్‌లో ఉంటే తెలంగాణలోని ప్రాజెక్టులు బేసిన్‌లోనే ఉన్నందున నికర, మిగులు, వరద జలాలను ఈ ప్రాజెక్టులకే వాడాలి.
* పోలవరం ప్రాజెక్టు కింద ఒక టీఎంసీతో 3500 ఎకరాలు సాగయ్యేలా ప్రతిపాదించారు. ఇది చాలా ఎక్కువ. ఈ ప్రాజెక్టులో 50 శాతం నీరు ఆదా అవుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టాన్ని తగ్గించేలా చూస్తే భద్రాచలం పట్టణం, ఇతర ప్రాంతాలపైన వరదల సమయంలో బ్యాక్‌వాటర్‌ ప్రభావం తక్కువగా ఉంటుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.