Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179089
            [news_title_telugu_html] => 

తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ముద్ర

[news_title_telugu] => తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ముద్ర [news_title_english] => [news_short_description] => భాజపా జాతీయ నేతల్లో కీలకంగా వెలుగొందిన అరుణ్‌ జైట్లీ తెలుగు రాష్ట్రాలపై తన ప్రత్యేక ముద్ర వేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటుకు గట్టి మద్దతు ఇస్తూనే, సీమాంధ్ర [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/tgE0lMWgGrA [news_videoinfo] => |https://www.youtube.com/embed/tgE0lMWgGrA [news_sections] => ,27,26, ) )
తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ముద్ర - EENADU
close
తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ముద్ర

తెలంగాణ ఏర్పాటుకు మద్దతు పలుకుతూనే..
సీమాంధ్ర హామీలకు చట్టబద్ధతను కోరిన జైట్లీ

ఈనాడు, దిల్లీ: భాజపా జాతీయ నేతల్లో కీలకంగా వెలుగొందిన అరుణ్‌ జైట్లీ తెలుగు రాష్ట్రాలపై తన ప్రత్యేక ముద్ర వేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటుకు గట్టి మద్దతు ఇస్తూనే, సీమాంధ్ర హామీలకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో గందరగోళ వాతావరణం మధ్య తెలంగాణ ఏర్పాటు బిల్లుపై జరిగిన చర్చలో ఆయన రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 1980 నుంచి భాజపా కోరుకుంటున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్నందుకు సంతోషంగా ఉందని, అదే సమయంలో రాష్ట్ర ఏర్పాటు ద్వారా నష్టపోతున్న సీమాంధ్రకు ఇచ్చే హామీలకు బిల్లులో స్థానం కల్పించాలన్నారు. అవసరమైతే బిల్లులో సవరణలు తీసుకురావాలని సూచించారు. 2014 ఫిబ్రవరి 18న సీమాంధ్రపై డిమాండ్లు లేకుండానే లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందగా, 20వ తేదీన రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్‌జైట్లీ తెలంగాణకు మద్దతిస్తూనే సీమాంధ్రులకు సంబంధించి ఏదో ఒక హామీ ఇవ్వాలని తెరవెనక ప్రభుత్వంపై గట్టిగా పట్టుబట్టారు. ఫలితంగానే నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బిల్లు ఆమోదం పొందే అంతిమ ఘడియల్లో ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు, పన్ను రాయితీలు, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ, రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. నాడు సభలో అరుణ్‌జైట్లీ ప్రసంగం ఇలా సాగింది..

తెలంగాణ ఏర్పాటు చారిత్రక అవసరం
‘‘తెలంగాణ ఏర్పాటు చేయబోతున్నందుకు సంతోషంగా ఉన్నాను. మా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో 1980 నుంచి, కేంద్రంలో 2006 నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దిశగా సాగుతున్న ప్రక్రియలో భాగస్వామి కావడం నాకెంతో సంతృప్తినిస్తోంది. తెలంగాణను ఏర్పాటు చేస్తున్న సమయంలోనే సీమాంధ్రులకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులనూ పరిష్కరించాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో యూపీఏ ప్రభుత్వం కసరత్తు చేసిన తీరు నన్ను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. తెలంగాణకున్న సుదీర్ఘ చరిత్రను దృష్టిలో ఉంచుకొని మేం ప్రత్యేక తెలంగాణ కోసం డిమాండ్‌ చేశాం. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ ఎన్నో పోరాటాల తర్వాత భారత్‌ యూనియన్‌లో విలీనమైంది. అందుకే మా పార్టీ దీనికి పూర్తిగా మద్దతు పలికింది.

యూపీఏ కసరత్తు చెడ్డపేరు తెస్తోంది..
వాజ్‌పేయీ హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ల పేరుతో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు.. మేం జాతీయ స్థాయిలో విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించి అందరిలో సంతోషం నింపాం. యూపీఏ ప్రభుత్వం కొత్త రాష్ట్ర ఏర్పాటు విషయంలో వ్యవహరించిన తీరు ఆందోళనకరంగా ఉంది. డిమాండ్‌ నెరవేర్చే సమయంలో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజలను సమీకృతం చేయలేకపోయారు. ప్రస్తుతం మంచికోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వంలోని మంత్రులు, అధికార పార్టీ ఎంపీలే తప్పుపడుతున్నారు. లోక్‌సభలో చాలామంది ఎంపీలను సస్పెండ్‌ చేసి, వారి పరోక్షంలో రాష్ట్రం ఏర్పాటు చేసింది. దీనివల్లే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ చేదెక్కింది. యూపీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరువల్ల మంచికోసం తలపెట్టిన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు చెడ్డపేరు వచ్చింది. కొత్త రాష్ట్ర ఏర్పాటు న్యాయబద్ధంగా, న్యాయపరీక్షకు నిలబడేలా, సరైన పద్ధతిలో జరగాలి.

రాజ్యాంగ సవరణ లేకుండా గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారాలు ఎలా?
విభజన బిల్లులోని 8వ సెక్షన్‌లో హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ప్రతిపాదించారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండటంలో మాకేమీ ఇబ్బంది లేదు. గవర్నర్‌కు శాంతిభద్రతల బాధ్యతలు అప్పగించడంపైనా సమస్య లేదు. నా భయమల్లా బిల్లు రాజ్యాంగబద్ధతపైనే. సాధారణ చట్టం ద్వారా శాంతిభద్రతల అధికారాలను గవర్నర్‌కు అప్పగించవచ్చా? లేదంటే దానికేదైనా రాజ్యాంగ సవరణ అవసరమా? అన్నదానిపైనే. గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. అలాంటప్పుడు రాజ్యాంగ సవరణ చేపట్టకుండా శాంతిభద్రతల అధికారాలను గవర్నర్‌కు బదలాయించగలరా? రాజ్యాంగ సవరణ చేసి గవర్నర్‌కు అధికారాలు అప్పగించడమే న్యాయబద్ధమైన చర్య. ఆ సవరణకూ మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నాం.

సీమాంధ్రుల హామీలకు బిల్లులో స్థానం కల్పించాలి..
సీమాంధ్ర ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సీమాంధ్ర ఆదాయానికి రక్షణ కల్పించాలి. అక్కడ చేపట్టిన సాగునీటి పథకాలకూ సంరక్షణ ఇవ్వాలి. ఆ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి. దీనిపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి. అవసరమైతే సీమాంధ్రకు ఇచ్చే హామీలను బిల్లులో పొందుపరచడానికి వీలుగా సవరణలు తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సంతృప్తికరమైన హామీ లభించకపోయినా మేం తెలంగాణ ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నాం. నేను, వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలకు బిల్లులో స్థానం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం’’ అని అరుణ్‌జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి 
ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతిపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. జైట్లీ మృతిపై సంతాపం వ్యక్తంచేశారు. ‘‘జైట్లీ అత్యంత స్ఫూర్తిదాయక వ్యక్తి. వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ ఆయన మచ్చలేని మహారాజుగా జీవించారు. ఆయనను చాలాసార్లు కలిసే అవకాశం రావడం నా అదృష్టం’’ అని కేటీఆర్‌ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, తదితరులు జైట్లీ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. 

గవర్నర్‌ సంతాపం 
దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని, జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని గవర్నర్‌ నరసింహన్‌ సంతాప సందేశంలో పేర్కొన్నారు. 

జగన్‌, చంద్రబాబు...
ఈనాడు డిజిటల్‌, అమరావతి: అరుణ్‌ జైట్లీ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన గొప్ప వక్త, మేధావి అంటూ కొనియాడారు. అరుణ్‌ జైట్లీ మృతి దేశానికే తీరని లోటని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.


 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.