close

ప్రధానాంశాలు

తప్పుల్లేకుండా పరీక్షలు, ఫలితాలు

అంచెలంచెలుగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ శాఖ నూతన మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలు, ఫలితాల్లో తప్పుల్లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల శ్రేయస్సుకు పాటుపడటమే తన లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. తొలిసారి రాష్ట్ర మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన గంగుల.. తనకు అప్పగించిన శాఖలను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పగించిన బాధ్యతలను విశ్వాసంతో నెరవేరుస్తానని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులైన సత్యవతి రాఠోడ్‌ తెలిపారు.
 

ముగ్గురు మంత్రులు మంగళవారం ఈనాడు ముఖాముఖిల్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

అంచెలంచెలుగా విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తా

సబితా ఇంద్రారెడ్డి

నాణ్యమైన మానవ వనరులు, తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీపడటం గురించి ముఖ్యమంత్రి తరచూ చెబుతుంటారు. ఆ దిశగా మీ కార్యాచరణ ఏమిటి?
ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాల్సి వస్తోంది. వారికి నాణ్యమైన విద్య అందించకపోతే నష్టపోతారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 500కిపైగా గురుకులాలు నెలకొల్పారు. ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలకు పోటీఉండేది.. ఇప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.లక్ష వరకు ఖర్చుపెడుతున్నాం.  ఇలాంటి చర్యలతో మన విద్యార్థులు ప్రపంచస్థాయిలో ఏ దేశం వారితోనైనా పోటీపడతారు. ఆ లక్ష్యంతోనే పనిచేస్తా. విద్య నాణ్యత పెంచేందుకు మరిన్ని చర్యలపై కసరత్తు చేస్తాం.

విద్యాశాఖలో సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?
రెండు రోజులుగా ఎంతో మంది నా వద్దకు వచ్చి సమస్యలు చెబుతున్నారు. వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకునేందుకు అధ్యయనం చేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తూ.. అంచెలంచెలుగా విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తా. బుధవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నా. కేజీబీవీల్లో ఇంటర్‌ ప్రారంభించడం శుభపరిణామం.

అక్షరాస్యతపరంగా రాష్ట్ర స్థానాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేస్తారు
ఇప్పటితరంలో బడి ఈడు పిల్లలు అందరూ చదువుకుంటున్నారు. విద్యా శాఖ ఏటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థులు తమ కుటుంబసభ్యులకు చదువు నేర్పే కార్యక్రమానికి ఇటీవలే విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇది కేవలం తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మలకు పరిమితం చేయకుండా కుటుంబసభ్యుల్లో నిరక్షరాస్యులు ఎవరున్నా వారికి నేర్పేలా చర్యలు చేపడతాం.

ఇంటర్‌ మూల్యాంకనం, ఫలితాల్లో తప్పులు దొర్లాయి. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఇలాంటి వాటిపై మీ ప్రణాళిక ఏమిటి?
ఇంటర్మీడియట్‌ అనే కాదు.. ఏ పరీక్ష మూల్యాంకనం, ఫలితాల్లో కూడా తప్పులు జరగొద్దు. అందుకు అధికారులతో చర్చించి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం.

బోధనా సిబ్బంది, ఉపకులపతుల ఖాళీలను భర్తీ చేయడం లేదన్న విమర్శలపై ఏమంటారు?
పాఠశాలల్లో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే దాదాపు 2 వేల మందికి పోస్టింగ్‌ ఇచ్చారు. మిగతావి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఎంఈవోల ఖాళీల భర్తీకి, ఉపాధ్యాయుల పదోన్నతులకు న్యాయపరమైన సమస్యలున్నాయని చెబుతున్నారు. ఉపకులపతుల నియామకానికి అన్వేషణ కమిటీలు నియమించాల్సి ఉంది.

బీసీల మోములో వెలుగులతోనే సంతోషం

పౌరసరఫరాల శాఖను మొదటి స్థానంలో నిలుపుతా గంగుల కమలాకర్‌ మంత్రి పదవి రావడంపై ఎలాంటి అనుభూతి పొందుతున్నారు?
మాటల్లో చెప్పలేని అనుభూతి నాది. ఈ పదవి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన కానుక. సీఎంకు నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే స్థాయిలో బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తా. ప్రజలకు జవాబుదారీగా ఉండే పాలన అందించేందుకు కృషి చేస్తా.

బీసీల సంక్షేమానికి ఎలాంటి ప్రాధాన్యమిస్తారు?
నేను బీసీ బిడ్డను. నాకు కేటాయించిన శాఖ నిజంగా సంతృప్తినిచ్చింది. బీసీల ప్రతినిధిగా.. రెండుసార్లు కొర్పొరేటర్‌గా, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను గెలిపించారు. బీసీల సంక్షేమానికి ఎన్నో పథకాల్ని కేసీఆర్‌ అమలు చేశారు. బీసీల మోములో అసలైన నవ్వుని చూసినప్పుడే నాకు నిజమైన సంతోషం.

పౌరసరఫరాల శాఖలో ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు..?
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలో పేదలకు బియ్యం పంపిణీలో  పారదర్శకమైన మార్పు కనిపిస్తోంది. పేదలకు చెందాల్సిన సొమ్ము సక్రమంగా వారికి అందేలా నా బాధ్యతని పక్కాగా నిర్వహిస్తా. ఎక్కడా అవినీతికి తావులేకుండా పర్యవేక్షణ పెంచుతా. శాఖను నంబరు వన్‌గా నిలబెట్టేలా చొరవ చూపిస్తా.

పార్టీలో మున్ముందు మీ పాత్ర ఎలా ఉండనుంది? మంత్రిగా మీ లక్ష్యాలు ఏమిటి?
తెరాసలో క్రియాశీల కార్యకర్తగా నా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నా. ఇకపైనా పార్టీలో సమష్టి నిర్ణయాలతో ముందుకు వెళతాం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నలుగురికి మంత్రి పదవులు వచ్చాయి. జిల్లాపై సీఎంకి ఉన్న అభిమానాన్ని నిలబెట్టేలా, ప్రజలకు మేలు చేసే సేవల్ని అందిస్తాం. నాది రాజకీయ కుటుంబం కాదు. కేవలం ప్రజల్లో ఉండే నాయకుడిగా నన్ను చూసి.. నాపై ఉన్న నమ్మకంతో కేసీఆర్‌ మంత్రి పదవి ఇచ్చారు. ప్రజలు మెచ్చేలా.. సీఎంకి నచ్చేలా నా పదవికి న్యాయం చేస్తా.

ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలతో ఎలాంటి సంబంధాలుంటాయి.

కార్పొరేటర్‌గా గెలిచినప్పుడు ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నానో.. ఎమ్మెల్యే అయ్యాకా అలాగే ఉన్నా. నేడు మంత్రిగా మారినా ‘ఈ మనిషి మారడు’ అనేలా ప్రజలతో కలిసిపోయి సేవ చేస్తా. సీఎం కేసీఆర్‌ నాకు డిక్షనరీలాంటి వ్యక్తి. ఆయనను చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నా. సీఎం చెప్పినట్లు ‘ఎంత ఎదిగినా.. ఒదిగినట్లు ఉండాలె’ అనే విషయాన్ని కచ్చితంగా ఆచరణలో చూపిస్తా.

గిరిజన బిడ్డగా కష్టాలన్నీ తెలుసు

ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తా సత్యవతి రాఠోడ్‌

మంత్రివర్గంలో తొలిసారిగా అవకాశం దక్కడంపై మీ అభిప్రాయం?
చాలా సంతోషంగా ఉంది. గిరిజన మహిళనైన నాకు కేసీఆర్‌ చక్కటి అవకాశం ఇచ్చారు. ఇందుకు సహకరించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు. రాజకీయాల్లో ఉన్న వారు ఒకసారి మంత్రి కావాలని అనుకుంటారు.. నాకూ ఆ ఆశ ఉండేది. ఇంత త్వరగా అది నెరవేరుతుందని అనుకోలేదు. ఈ పదవి సాధించేందుకు అనేక లాబీయింగ్‌లు ఉంటాయి. కానీ, అలాంటివేమీ లేకుండా పదవి ఇవ్వడం కేసీఆర్‌తోనే సాధ్యమైంది.
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల, ప్రజల అభివృద్ధి,

సంక్షేమం కోసం ఎలా కృషిచేస్తారు?
ఒక గిరిజన బిడ్డగా, మహిళగా ఆ సమస్యలన్నీ నాకు తెలుసు. ముఖ్యమంత్రి సహకారంతో కష్టపడి పనిచేసి ప్రభుత్వ పథకాలు గిరిజనులకు చేరేలా చూస్తాను. కొత్తగా ఏం చేస్తే వాళ్ల సమస్యలు ఇంకా త్వరగా పరిష్కారం అవుతాయో ఓ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తా. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తా. ఐటీడీఏలు ఆశించినంతగా ఎందుకు పని చేయలేకపోతున్నాయో తెలుసుకుని వాటి పరిపుష్టిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతా.

మీకు అప్పగించిన స్త్రీ,శిశు సంక్షేమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు?
రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళా సంతోషంగా, సుఖంగా ఉండాలని ఆలోచించే నాయకుడు కేసీఆర్‌. దానికి తగ్గట్లు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అవన్నీ అమలు చేస్తూనే ఇంకా వాటిని బలోపేతం చేసేవిధంగా పనిచేస్తాను. మహిళల సమస్యలు పరిష్కరించే విధంగా మెరుగైన మార్పుకోసం ప్రయత్నిస్తా.

అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు?
రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఖాళీలు ఉంటే గుర్తిస్తాం. ఇప్పటికే ఆ కేంద్రాలను, పాఠశాలలను అనుసంధానం చేసి నర్సరీ అక్కడే ప్రారంభించాలనే ప్రయత్నం జరుగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలు స్వయం సమృద్ధి సాధించేలా చూస్తా.

నేటికీ ఆడపిల్ల పుడుతుందని తెలిసి కొందరు భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు కదా..?
మా అమ్మానాన్నలకు మేం నలుగురం ఆడ పిల్లలం. అలా వారు భావించిఉంటే ప్రస్తుతం మేం ఇక్కడ ఉండేవాళ్లమే కాదు. అవకాశాలు కల్పిస్తే మగపిల్లల కంటే మెరుగ్గా ఆడపిల్లలు రాణిస్తారు. కష్టపడి చదువుతారు. కుటుంబాన్ని నిర్వహించుకోగలుగుతారు. సీఎం కేసీఆర్‌.. ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి పథకాలు ప్రవేశపెట్టారు.

- ఈనాడు, హైదరాబాద్‌ - ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.