close
పాపికొండల్లో పగిలిన గుండెలు

విహార యాత్రలో ఘోరం
73 మందితో బయలుదేరిన  పర్యాటక బోటు బోల్తా
పర్యాటకులు 64 మంది.. సిబ్బంది 9 మంది
8 మంది దుర్మరణం,  26 మంది సురక్షితం
గల్లంతైన 39 మంది  కోసం  ముమ్మర గాలింపు
పడవ ప్రమాదం జరిగిన సమయం: ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలు

తెలంగాణ వారే అధికం
హైదరాబాద్‌ నుంచి 22 మంది యాత్రికులు
వీరిలో ఒకరి మృతి...  8 మంది గల్లంతు
వరంగల్‌ నుంచి వెళ్లిన 14 మందిలో ఇద్దరి దుర్మరణం
ఇద్దరు మంచిర్యాల ఇంజినీర్ల ఆచూకీ లేదు

ఈనాడు- కాకినాడ, ఈనాడు డిజిటల్‌-రాజమహేంద్రవరం

పాపికొండల్లో తెలుగు గుండెలు పగిలాయి. నవ్వులు, కేరింతలతో వినోద]భరితంగా సాగుతున్న విహార యాత్ర.. విషాద యాత్ర అయింది. ఒక్కసారిగా కుదుపుతో గోదావరిలో బోటు మునిగిపోయింది. ఏమయ్యిందో అర్థమయ్యేలోపు నదిలో పర్యాటకులు చెల్లాచెదురయ్యారు. ఆదివారం ఉదయం 73మందితో వెళ్తున్న పర్యాటక బోటు నదిలో బోల్తాపడటంతో అందులో ఉన్న 8 మంది  మరణించగా.. 26మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 39 మంది ఆచూకీ కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి.

పాపికొండల యాత్రలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన పర్యాటకులు గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి చెందడం, ఆచూకీ తెలియకుండా పోవడం కలచి వేసింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద గోదావరి అత్యంత లోతైన ప్రాంతం. ఇక్కడ నది కేవలం 300 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. పైగా  సుడులు తిరుగుతూ  ప్రమాదభరితంగా ఉంటుంది. దీంతో ఏ సరంగి అయినా తూటికుంట వైపునుంచే ముందుకు వెళతాడు. కానీ పర్యాటకుల బోటు కచ్చులూరు వైపుగా వెళ్లటంతో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ప్రవాహం అధికంగా ఉండటంతో బోటు ముందుకు వెళ్లడం కష్టతరమైంది. ఇంజిను వేగాన్ని కూడా పెంచటంతో  స్టీరింగ్‌కు ఉన్న తీగతెగిపోయింది. ఆ తర్వాత  ఇంజిన్‌ కూడా ఆగిపోయింది. సుడులు అధికంగా ఉండటం వల్ల ఒక్కసారిగా బోటు మునిగి పైకి లేచి అంతలోనే మళ్లీ మునిగిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

అప్పటికే కచ్చులూరు ఆవల పశ్చిమగోదావరి జిల్లా తూటిగుంటకు చెందిన కొంత మంది యువకులు చేపలు పడుతున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించి స్థానిక వీఆర్‌ఏ అంజయ్యకు, పోలవరం తహసీల్దార్‌కు సమాచారం అందించారు. కచ్చులూరుకు చెందిన కొంత మంది  సహాయక చర్యల్లో పాల్గొన్నారు. లైఫ్‌జాకెట్లు ధరించి నీటిలో తెలియాడుతున్న 26 మందిని రక్షించారు. మరో ముగ్గురిని రక్షించినా అప్పటికే ప్రాణం పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇద్దరు సరంగులు సహా 8మంది దుర్మరణం
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. ఇందులో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. బోటు నడుపుతున్న ఇద్దరు సరంగులు చనిపోయారు. ఇద్దరికీ ఈత వచ్చినా ప్రాణాలను దక్కించుకోలేకపోయారు.

తక్షణ సహాయక చర్యలు
ఈ వార్త తెలిసిన వెంటనే  తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఇతర కీలకశాఖల యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. సహాయక చర్యల కోసం రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్‌ను పంపారు. విశాఖ జిల్లా కలెక్టర్‌ నేవీతో మాట్లాడి డోర్నయిర్‌ యుద్ధ విమానంలో సిబ్బందితోపాటు పడవలు, గజ ఈతగాళ్లను పంపించారు. విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 30 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రెండింటిని పంపి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచార వ్యవస్థ సమర్థంగా లేకపోవడంతో జిల్లా కేంద్రం నుంచి వైర్‌లెస్‌సెట్లను సిబ్బందిని రంపచోడవరం పంపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు రంపచోడవరం ఆసుపత్రికి వెళ్లి ప్రమాద బాధితులను పరామర్శించారు.

ఉగ్ర గోదారిలో
గోదావరిలో గత రెండు నెలలుగా వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో బోట్ల రాకపోకలపై నిషేధం విధించారు. తాజాగా వరద ప్రవాహం తగ్గడంతో పర్యాటక బోట్లు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. పోలవరం పరిధిలోని కాఫర్‌ డ్యామ్‌ నుంచి పాపి కొండల వరకు గోదావరి ప్రమాదకరంగా ఉంది. సుడులు అధికంగా ఉన్నాయి. సాధారణంగా బోటునడిపే వారికి వడి, సుడి జాడలు తెలుస్తాయని, వరదలు, ఇతర పర్యావరణ కారణాల వల్లగానీ గోదావరి దశ దిశల్లో తేడాలుంటే సరంగులు ఇట్టే గుర్తిస్తారని చెబుతున్నారు. రాయల్‌వశిష్ఠబోటును స్థానికేతరులయిన నూకరాజు, తామరాజు అనే డ్రైవర్లు నడిపారు. ఈ మార్గానికి ఇద్దరూ కొత్తవారు కావటంతో అవగాహన లేకపోయిందని చెబుతున్నారు. ఈ బోటును యజమాని 2016 నుంచి తిప్పుతున్నట్లు సమాచారం.

బోటుకు అనుమతి ఉందా?
ఎనిమిది మంది సిబ్బందితోపాటు, 68 మంది ప్రయాణికులు వెళ్లే సామర్థ్యం ఈ బోటుకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి పోర్ట్‌ ద్వారా ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ అనుమతి ఈ ఏడాది నవంబర్‌ వరకు ఉన్నట్లు కాకినాడ పోర్టు అధికారి ధర్మశాస్త్ర తెలిపారు. నదిలో రాకపోకల అనుమతులు జలవనరులశాఖ ఇవ్వాల్సి ఉందన్నారు. గోదావరి ఉద్ధృతి నేపథ్యంలో పర్యాటక బోట్ల రాకపోకలకు జలవనరుల శాఖ అనుమతిలేదని, దీన్ని ఉల్లంఘించి బోటు నడిపారని జలవనరుల శాఖ ధవళేశ్వరం హెడ్‌ వర్క్స్‌ కార్యనిర్వాహక ఇంజినీరు మోహనరావు వెల్లడించారు.
* బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణ విశాఖజిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి.

బాధాకరమైన సంఘటన

‘‘ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు జరిగిన బోటు ప్రమాదం అతి బాధాకరమైన ఘటన. మృతులకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను’’
- ప్రధాని మోదీ (తెలుగులో ట్వీట్‌ చేశారు)

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు: జగన్‌
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
తక్షణమే అన్ని బోటు సర్వీసుల రద్దు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సంఘటన స్థలంలో అన్ని రకాల సహాయక చర్యలు అందించవలసిందిగా జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డికి సూచించారు. తక్షణమే అన్ని బోటు సర్వీసులను రద్దుచేయాలని ఆదేశించారు. అనుమతులు లేని బోట్లపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మృతులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్నారు. రాజమహేంద్రవరంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో సమీక్షించారు.

పలువురి దిగ్భ్రాంతి
ఈనాడు డిజిటల్‌, అమరావతి:అమరావతిఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.