close
రాజ్యాంగ సంక్షోభం రావొచ్చు

  మంత్రులు హరీశ్‌రావు, ఈటల, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మేధావులు మౌనం వీడాలి
  ఆర్టీసీని, ఆస్తులను కాపాడుకునేందుకే మా తపన
  ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

రాంనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ ఇ.అశ్వత్థామరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో మేధావుల మౌనం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన ఐకాస నాయకులు వీఎస్‌ రావు, ఎస్‌.బాబు తదితరులతో కలిసి తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కార్మికులందరూ ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌కు మేము వెన్నంటి ఉన్నాం. ఆ స్ఫూర్తితోనే కొట్లాడి ఆర్టీసీని కాపాడుకుంటాం. కేకే అంటే నీతి, నిజాయతీ ఉన్న మనిషి. ఆయన మాకు మద్దతు తెలిపినట్లే. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. నేను నియంతను, నేనే రాజును అంటే కుదరదు. ప్రజావ్యతిరేకత వస్తే ఎవరూ ఆపలేరు. ఎన్టీఆర్‌ లాంటి మహానాయకుడి ప్రభుత్వమే నాలుగు నెలల్లో కుప్పకూలింది. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం కూడా రావచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా పని చేసే మంత్రులు లేరా? మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మేధావులు మౌనం వీడాలి. మౌనం సమాజానికి మంచిది కాదు. తెలంగాణ సమాజం కోసం ఎవరైతే కదిలారో వాళ్లనే అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది. మంత్రిమండలిలో ఉద్యమ మంత్రులు(యూటీ మంత్రులు) బయట మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇంటికి వెళ్లి ఏడుస్తున్నారు. అన్నా ఇలా అయిపోతుందేమిటీ అంటూ ఫోన్లు చేస్తున్నారు. బంగారు తెలంగాణ(బీటీ) మంత్రుల పరిస్థితి షరా మామూలే. 48,500 వేల మంది కార్మికులు సమ్మె చేస్తుంటే కేవలం నాయకులే సమ్మె చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అంటున్నారు. కార్మికులందరినీ నాయకులుగా గుర్తించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు.  ప్రైవేటు బస్సుల కోసం ఈ రాష్ట్రం టెండర్లు పిలిస్తే, పక్క రాష్ట్రం అక్కడ ఆర్టీసీ కోసం బస్సులు కొనేందుకు సిద్ధమైంది. నీవు(కేసీఆర్‌) గొప్పా?, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గొప్పా? రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఆర్టీసీని, ఆస్తులను కాపాడుకునేందుకు సమ్మె చేస్తున్నాం. మీ(ముఖ్యమంత్రి) వియ్యంకుడి బంధువు, నిజామాబాద్‌ జెడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు కుమారుడు సందీప్‌కు 46 పెట్రోలు బంకులు కట్టబెట్టారు. నిజం కాదా? సమ్మెపై చర్చలకు ఆహ్వానిస్తే సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. ప్రగతిభవన్‌ గేట్లు వద్ద నిలిచి లేము. ఆత్మగౌరవంతోనే ఉన్నాం’’ అని అశ్వత్థామరెడ్డి అన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.