close
ప్రధానోపాధ్యాయుల్లో సస్పెన్షన్‌ కలకలం

  పార్ట్‌టైమ్‌ కార్మికులకు సర్వీస్‌ ధ్రువపత్రాలు జారీ చేసిన వారు 550 మంది!
  విద్యాశాఖ ఉత్తర్వులను విరమించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సర్కారు బడుల్లో పనిచేసే పార్ట్‌టైమ్‌ కార్మికులకు (పీటీడబ్ల్యూ) సర్వీస్‌ సర్టిఫికెట్లు జారీ చేసిన వారిని సస్పెండ్‌ చేయాలని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా ప్రధానోపాధ్యాయుల్లో కలకలం స్పష్టించాయి. ఈ ఉత్తర్వులను విరమించుకోవాలని, లేదంటే ఆందోళన బాట పడతామని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో దశాబ్దాల నుంచి తక్కువ వేతనంతో పార్ట్‌టైమ్‌ కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారన్న నమ్మకంతో సర్వీసు సర్టిఫికెట్లు ఇవ్వాలని అడగడంతో కొందరు ప్రధానోపాధ్యాయలు వాటిని జారీ చేశారు. ఇలా సుమారు 550 మంది వరకు సర్వీసు ధ్రువపత్రాలిచ్చారని అంచనా. ఒక్క ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే 50 మంది ప్రధానోపాధ్యాయులు ధ్రువపత్రాలిచ్చినట్లు తెలిసింది. ఈ జిల్లాలో ప్రధానోపాధ్యాయుల సంతకాలు ఫోర్జరీ చేసి కూడా కొందరు ధ్రువపత్రాలు పొందినట్లు సమాచారం. వాటిని అందుకున్న వారిలో దాదాపు 200 మంది తమకు కనీస వేతనం ఇవ్వడం లేదని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీరించాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆ ధ్రువపత్రాలను జారీ చేసిన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అక్టోబరు 23న విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. దాంతో వారిని సస్పెండ్‌ చేయాలని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీఈఓలను, ఆర్‌జేడీలను ఆదేశించారు.

ఈ నిర్ణయం సమంజసం కాదు
సంవత్సరాల తరబడి నామమాత్రపు వేతనంతో పనిచేస్తున్న కార్మికులకు పనిచేసిన కాలానికి ధ్రువీకరణ పత్రం ఇవ్వడం ప్రధానోపాధ్యాయుల కనీస బాధ్యతని యూటీఎఫ్‌ తెలిపింది. కార్మికుల సమస్యను పట్టించుకోకుండా న్యాయస్థానాల్లో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందనే కారణంతో ధ్రువపత్రాలిచ్చిన వారిని సస్పెండ్‌ చేయాలని ఆదేశించడం సమంజసం కాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. ఏ ఒక్కరిని సస్పెండ్‌ చేసినా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఆర్‌టీఐ కింద అడిగినా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, ధ్రువపత్రాలు ఇవ్వడాన్ని ఎలా తప్పుబడతారని గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సర్దార్‌, ప్రధాన కార్యదర్శి రాజ భాను చంద్రప్రకాశ్‌ ప్రశ్నించారు. ఈ ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, టీఆర్‌టీఎఫ్‌ గౌరవ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.