close
ఆర్టీసీ అభిప్రాయం తీసుకున్నారా?

పర్మిట్ల జారీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
కేబినెట్‌ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు
      దాన్ని వెల్లడించకపోవడంతోనే అపార్థాలని వ్యాఖ్య
సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు కేబినెట్‌ తీర్మానం ఇచ్చిన ఏజీ
వెల్లడించరాదంటూ అభ్యర్థన
విచారణ 18కి వాయిదా
ఈనాడు - హైదరాబాద్‌

పర్మిట్ల జారీకి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు చట్ట ప్రకారం ఆర్టీసీ అభిప్రాయం తీసుకున్నారా అంటూ ప్రభుత్వాన్ని గురువారం హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీకి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే ముందు ఆర్టీసీకి నోటీసు ఇచ్చి అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. మంత్రిమండలి నిర్ణయాన్ని సవాలు చేయకూడదన్న నిబంధనలు లేవని తెలిపింది. మంత్రిమండలి తీర్మానాలను వెల్లడించకపోవడంతో ప్రజలు అపార్థాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ప్రైవేటీకరణలో భాగంగా 5,100 పర్మిట్లు జారీ చేయాలంటూ మంత్రిమండలి తీర్మానించడాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి విచారణ చేపట్టారు. మంత్రిమండలి తీర్మానాన్ని సీల్డ్‌కవర్‌లో ధర్మాసనానికి అడ్వొకేట్‌ జనరల్‌ అందజేశారు. ఇందులో పిటిషనర్‌ కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చడంపై ఎలాంటి అభ్యంతరంలేదని సహాయ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావు తెలిపారు. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌లో అడిగిన అభ్యర్థన సరిగా లేదన్నారు. మంత్రిమండలి నిర్ణయాన్ని అడుగుతున్నారని, ఇంకా నిర్ణయం తుది దశకు చేరుకోలేదని తెలిపారు. మోటారు వాహనాల చట్టం కింద గెజిట్‌ జారీ చేయాల్సి ఉందన్నారు. ఆపైన జీవో జారీ చేశాకే మంత్రిమండలి నిర్ణయం పూర్తయినట్లన్నారు. జీవో ద్వారా అన్ని విషయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.

ఎందుకింత రహస్యం?
మంత్రిమండలి నిర్ణయం అందుబాటులో లేనపుడు పిటిషనర్‌ అంతకుమించి ఏం చేయగలరని ధర్మాసనం ప్రశ్నించింది. మంత్రిమండలి నిర్ణయాన్ని ఎందుకింత రహస్యంగా ఉంచుతున్నారంది. పత్రికల్లో వచ్చిన విషయాలు తప్ప మాకూ ఏమీ తెలియదని కోర్టు వ్యాఖ్యానించింది. కేబినెట్‌ నిర్ణయాన్ని సవాలు చేయరాదన్న ఏజీ వాదనతో ధర్మాసనం విభేదిస్తూ సవాలు చేయవచ్చని పేర్కొంది. ఎర్రమంజిల్‌ వ్యవహారంలో మంత్రిమండలి నిర్ణయాన్ని ఇదే కోర్టు రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. అయితే సమాచార హక్కు కింద కొన్ని రక్షణలున్నాయని ఏజీ చెప్పారు. ఈ నిబంధనలకు పరిమితులున్నాయని, ఏ పత్రాల ఆధారంగా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందో ఆ పత్రాలు ఇవ్వకూడదని మాత్రమే సమాచార హక్కు చట్టంలో ఉందని ధర్మాసనం పేర్కొంది. పర్మిట్ల జారీ వ్యవహారంలో ప్రభుత్వానికి రవాణా చట్టంలోని సెక్షన్‌ 67(3), 102 కింద కొన్ని అధికారాలున్నాయని ఏజీ చెప్పారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కేబినెట్‌ నిర్ణయాన్ని చూడండి, మీరు చెబుతున్న సెక్షన్‌ 102కు అది వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. దీని ప్రకారం ప్రభుత్వానికి మార్పులు చేసే అధికారం ఉందని, అయితే ముందుగా ఆర్టీసీకి నోటీసులు ఇవ్వాల్సి ఉందంది. దానికి భిన్నంగా ఆర్టీఏ అభిప్రాయాన్ని అడిగారంది. ఏజీ జోక్యం చేసుకుంటూ ఆర్టీసీకి నోటీసులు ఇచ్చే వ్యవహారాన్ని ఆర్టీఏ చూసుకుంటుందనగా ధర్మాసనం స్పందిస్తూ ఈ చట్టం కింద ఆర్టీఏకు ఎలాంటి అధికారం లేదని, ప్రభుత్వానికి మాత్రమే ఉందని పేర్కొంది. ప్రస్తుతం మీ తీరు గుర్రానికంటే బండిని ముందుపెట్టినట్లుందని వ్యాఖ్యానించింది. ఏజీ సమాధానమిస్తూ ఆర్టీఏ అంటే ప్రభుత్వమేనని, ఇక్కడ మధ్యంతర ఉత్తర్వులు ఉండటంతో ఆర్టీసీకి నోటీసు ఇవ్వలేదన్నారు.

మైక్‌ ఆఫ్‌ చేసి..
కేబినెట్‌ నిర్ణయాన్ని బయటికి వెల్లడించరాదని మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఏజీనుద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. మేం నిర్ణయాన్ని చదివితే మీడియా వెల్లడిస్తుందని, మైక్‌లను నిలిపివేస్తామని మీరే వచ్చి చెప్పాలని ధర్మాసనం సూచించింది. దీంతో ఏజీతో పాటు రవాణశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా ధర్మాసనం వద్దకు వెళ్లి మంత్రి మండలి నిర్ణయాన్ని వివరించారు.

అభ్యర్థనను సవరించాలి
ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారని, దాన్ని నియంత్రించాలంటూ మీ అభ్యర్థన ఉందని, దాన్ని సవరిస్తూ పిటిషన్‌ దాఖలు చేయాలంటూ పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. పిటిషన్‌లోని అభ్యర్థనను మార్చడానికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంగీకరిస్తూ అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. దీనికి అనుమతిస్తూ తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.

1035 అద్దె బస్సులకు అనుమతి ఇచ్చాం
 హైకోర్టుకు తెలిపిన అధికారులు

ఆర్టీసీలో అద్దెప్రాతిపదికన 1035 బస్సులు నడపడానికి సంబంధించిన టెండరు ప్రక్రియ పూర్తయిందని ఆర్టీసీ గురువారం హైకోర్టుకు తెలియజేసింది. ఆర్టీసీలో అద్దెప్రాతిపదికన బస్సులు నడపటానికి జారీ చేసిన టెండరు నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మిక్‌ సంఘ్‌ తరఫున ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి విచారణ చేపట్టారు.  టెండరు నోటిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిందని, అక్టోబరు 23న కేటాయింపు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు తెలిపారు.దీంతో మూడో వ్యక్తి ప్రయోజనాలూ ఈ పిటిషన్‌తో ముడిపడి ఉన్నాయన్నారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను  18వ తేదీకి వాయిదా వేసింది.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.