close

ప్రధానాంశాలు

కమిషనరేట్ల దిశ మారింది

అతివల రక్షణకు తక్షణ చర్యలు
నిఘా కట్టుదిట్టం..   అసాంఘిక శక్తులపై కఠిన వైఖరి
మూడు కమిషనరేట్ల పోలీసుల ప్రత్యేక కార్యాచరణ
శిథిల భవనాలపై దృష్టి.. అనధికారిక పార్కింగ్‌ల ఎత్తివేత

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: దిశ ఘటన రాజధాని పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల దిశను మార్చింది. అక్కడి పోలీసులు ప్రధానంగా మహిళ భద్రతపై తక్షణ చర్యలు చేపట్టడం ప్రారంభించారు. రాజధాని పరిధిలోని అసాంఘిక శక్తులపై దృష్టి పెట్టారు. కీలకమైన రహదారుల్లో వాహనాలు నిలిచే ప్రాంతాలపైనే కాకుండా సంబంధిత డ్రైవర్ల గురించి ఆరా తీస్తున్నారు. అర్ధరాత్రి మహిళలపై దాడులు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నారు. కీలకమైన జంక్షన్లలో విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మహిళల భద్రత     కోసం వినియోగిస్తున్న బృందాల సంఖ్యను కూడా అధికారులు పెంచారు.

హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో...
మహానగరం పరిధిలో అనేక శిథిల భవనాలు, అసాంఘిక శక్తులు తిరిగే ప్రాంతాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇక్కడ మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు జరిగినా పోలీసులు పెద్దగా స్పందించలేదు. దిశ ఘటన నేపథ్యంలో ఈ భవనాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి కొన్నిచోట్ల రాత్రిపూట పోలీసు సిబ్బందిని నియమిస్తున్నారు.
* వావ్‌(ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌) పేరుతో కొద్దినెలల కిందట మహిళా పోలీసులతో టీములను ఏర్పాటుచేశారు. ఇద్దరి మహిళా కానిస్టేబుళ్లకు ఒక ద్విచక్రవాహనం ఇచ్చి ఆయా అనుమానిత ప్రాంతాల్లో పర్యటించే ఏర్పాటు చేశారు. సంబంధిత ప్రాంతంలో మహిళలపై ఎలాంటి వేధింపులు జరిగినా తక్షణం వీరు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరికొన్ని ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా ఈ తరహా బృందాలను పంపిస్తున్నారు. షీ టీమ్స్‌నుకూడా బలోపేతం చేసి ఈ మహిళా నేరాలుసంఖ్య తగ్గించేలా ప్రయత్నిస్తున్నారు.
* హైదరాబాద్‌లో 2.5 లక్షల క్యాబ్‌లు, ఆటోలు ఉన్నాయి. వీటి డ్రైవర్లపై దృష్టి పెట్టారు. గురువారం క్యాబ్‌ కంపెనీ యజమానులను పిలిపించి మాట్లాడారు. మహిళకు సంబంధించి ఎలాంటి సంఘటన జరిగినా మీరే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

రాచకొండ కమిషనరేట్‌...
* రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో తిరిగే వేలాది క్యాబ్‌లను పోలీసులు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ కారు వెనుక డ్రైవర్‌తో పాటు అన్ని వివరాలతో క్యూఆర్‌ కోడ్‌ను అంటించారు. దీన్ని ఫొటో తీసి పోలీసులకు పంపిస్తే అన్ని జాగ్రత్తలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. 15 వేల ఆటోల రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేశారు.
* ఒక్కో కళాశాలలోకి పోలీసులు వెళ్లి ఇద్దరు విద్యార్థులకు మహిళా భద్రత సైబర్‌ నేరాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. కళాశాలలో మిగిలిన విద్యార్థినులకు వీరితో శిక్షణ ఇప్పిస్తున్నారు.
* ప్రైవేటు వాహనాల డ్రైవర్లను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చే ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. బస్సులు ఇతరత్రా వాహనాలు ఆగే ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేశారు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌...
* తమ పరిధిలోకి వచ్చే బాహ్య వలయ రహదారిపై దృష్టి సారించారు. అనుమతి లేని ప్రాంతాల్లో బస్సులు.. లారీలు అక్రమంగా పార్కింగ్‌ చేయకుండా అడ్డుకోవడం ప్రారంభించారు. పలువురు లారీ, బస్సు డ్రైవర్లను మణికొండ పోలీసు స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. కోకాపేట ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ దగ్గర అక్రమ పార్కింగ్‌ను తొలగించారు.
* మూడు కమిషనరేట్ల పరిధిలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో స్థానిక సంస్థల సహకారంతో లైటింగ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.