close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పది పరీక్షలు వాయిదా

రద్దుకే అవకాశాలు ఎక్కువ!
త్వరలో ప్రభుత్వ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. అలా చేస్తే సమస్యలు రావొచ్చని భావించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ పరీక్షలను నిర్వహించాలా? లేక అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వాలా అన్నది ముఖ్యమంత్రి వద్ద ఆది లేదా సోమవారం జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయానికి రానున్నారు. అయితే పరీక్షల రద్దుకే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యాశాఖ అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. పరీక్షలను రద్దు చేసి అంతర్గత మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రితో చర్చించిన సీఎస్‌
హైకోర్టు ఆదేశాలు వెలువడిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. అంతకుముందు ఆయన ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డితో మాట్లాడినట్లు సమాచారం. ఈక్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పదో తరగతి పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి ముఖ్యమంత్రి వద్ద సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.

వాయిదాకు కారణాలు ఇవీ...
* టెన్త్‌ పరీక్షలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి నిర్వహిస్తే ఉపయోగం లేదు. అందరికీ పరీక్షలు పూర్తయితేనే ఇంటర్‌, బాసర ఆర్‌జీయూకేటీ, పాలిటెక్నిక్‌ తదితర ప్రవేశాలకు వీలవుతుంది.
* జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించకుండా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవమంటే...వారికి ఒక్కసారే అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు రాసే వాళ్లు పరీక్ష ఫెయిలయితే సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వీలవుతుంది. ఇలా కొందరికి రెండు సార్లు, మరికొందరికి ఒకసారే పరీక్ష రాసే అవకాశం ఇస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయి. ఒకవేళ జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారికి మరోసారి పరీక్ష నిర్వహించాలంటే బాగా ఆలస్యమవుతుంది. మళ్లీ జవాబుపత్రాల మూల్యాంకనం, ఫలితాల విడుదల తదితర వాటి వల్ల విద్యా సంవత్సరం ఆగమాగమవుతుంది.
* కొందరికి పరీక్షలు నిర్వహించి... మరికొందరికి తర్వాత అంటే విద్యార్థుల్లోనూ మానసిక ఆందోళనలు తలెత్తే అవకాశం ఉంది. పరీక్షలు రాయలేని వారు ఒత్తిడికి గురవుతారు. పరీక్షలు రాసిన వారు కెరీర్‌లో ముందుకు వెళతారని, ముందుగా ఇంటర్‌లో ప్రవేశాలు పొందుతారని భావించే అవకాశం ఉంది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని రాష్ట్రం మొత్తం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


పరీక్షల్లేకుండా గ్రేడ్లు ఇవ్వాలంటే...

ఈనాడు, హైదరాబాద్‌: టెన్త్‌ పరీక్షలు నిర్వహించకుండా అంతర్గత మార్కులు ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తమ మార్గంగా కనిపిస్తోందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పంజాబ్‌ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసినందున అక్కడ గ్రేడ్లు ఎలా ఇస్తున్నారో తెలుసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

అంతర్గత మార్కుల విధానంలో..
* విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పేరిట ఏడాదిలో నాలుగు పరీక్షలు (ఎఫ్‌ఏ-1, 2, 3, 4) నిర్వహిస్తారు. ఒక్కో పరీక్షను 20 మార్కులకు పెట్టినా మొత్తాన్ని 5 మార్కులకు కుదిస్తారు. ఇంకా ప్రాజెక్టు వర్క్‌కు 5, అసైన్‌మెంట్‌కు 5, రాతపనికి 5 మార్కులు ఉంటాయి. మొత్తం 20కి ఎన్ని అంతర్గత మార్కులు వచ్చాయో లెక్కిస్తారు. అలా ఒక్కో సబ్జెక్టులో అంతర్గత మార్కులు 20 ఉంటే మిగిలిన 80 మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఇది ఏటా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఒక్కో సబ్జక్టులో 20గా ఉన్న అంతర్గత మార్కుల్నే 100కి పెంచి గ్రేడ్లు ఇవ్వాలనేది ఒక యోచన.

మరో పద్ధతిలో అయితే...
* సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1(ఎస్‌ఏ-1)లో వచ్చిన మార్కులు ఆధారంగా చేసుకొని గ్రేడ్లు ఇవ్వొచ్చని కొందరు సూచిస్తున్నారు. వాటిని ఆయా పాఠశాలల నుంచి 15 రోజుల్లో తెప్పించుకొని ఫలితాలు ఇవ్వొచ్చని పేర్కొంటున్నారు. ఇది తలనొప్పి కావొచ్చని... ఎస్‌ఏ-1లో 50 శాతానికి మించి మార్కులు రావనే భిన్నమైన వాదనా వినవస్తోంది. ప్రీ ఫైనల్‌నూ పరిగణనలోకి తీసుకోవచ్చని కొందరు సూచిస్తున్నారు. అయితే ఆ పరీక్షలకు గైర్హాజరయ్యేవారి శాతం కూడా ఎక్కువగానే ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ఎక్కువమంది విద్యానిపుణులు అంతర్గత మార్కుల విధానమే మేలంటున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.