close

ప్రధానాంశాలు

మీ గెలుపు.. మా బాధ్యత!

తెరాస అభ్యర్థుల కోసం శ్రమిస్తున్న మంత్రులు
కాంగ్రెస్‌, భాజపా ముఖ్యనేతలూ ఎన్నికల క్షేత్రంలోనే..
వేడెక్కుతున్న ‘పుర’సంగ్రామం

ఈనాడు, హైదరాబాద్‌: పురపాలక ఎన్నికలు పార్టీల ముఖ్యనేతలకు సవాల్‌గా మారాయి. అధికార పార్టీలో మంత్రులు, ప్రతిపక్షాల్లో ముఖ్య నాయకులు తమకు బాధ్యతలు అప్పగించిన స్థానాల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. స్థానికంగా పట్టు జారిపోకూడదని అభ్యర్థుల ఎంపిక నుంచి అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ప్రచారం గడువు దగ్గర పడుతుండటంతో పలుచోట్ల ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.


తెరాస.. ముమ్మరంగా అమాత్యుల ప్రచారం

రాష్ట్రంలోని 120 పురపాలక సంఘాలు, పది నగరపాలక సంస్థల్లో ఇప్పటికే 76 వార్డులు, 3 డివిజన్లను ఏకగ్రీవంగా దక్కించుకున్న తెరాస.. ప్రతి పురపాలక సంఘంపై పక్కా కార్యాచరణతో ముందుకెళ్తోంది. గెలుపు బాధ్యతను ఆ పార్టీ మంత్రులకు అప్పగించింది. దీంతో అమాత్యులు వారి పరిధిలోని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
* సిరిసిల్లలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ తెరాస తరఫున రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల బాధ్యతను తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, ఉమ్మడి జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌లు పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు.
* మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని పలుచోట్ల ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీకి ప్రస్తుతం ఎన్నికలు లేకపోవడంతో ఆయన ఉమ్మడి జిల్లాలోని ఇతర స్థానాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు.
* వరంగల్‌ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌లు ప్రచారంలో పాల్గొంటున్నారు. సత్యవతి రాఠోడ్‌ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, వైరాలపైనా దృష్టిపెట్టారు.
* ఖమ్మం జిల్లాలో మంత్రి అజయ్‌కుమార్‌, నల్గొండ జిల్లాలో జగదీశ్‌రెడ్డి ప్రచారంలో పాల్గొంటూ తెరాస తరఫున పర్యవేక్షిస్తున్నారు.
* మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్నగర్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ ఇతర స్థానాలను పర్యవేక్షిస్తున్నారు. మరో మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తితోపాటు ఇతర మున్సిపాలిటీల ప్రచారంలో పాల్గొంటున్నారు.
* మంత్రి ప్రశాంత్‌రెడ్డి బీమ్‌గల్‌, నిజామాబాద్‌ జిల్లాలోని ఇతర పురపాలక సంఘాల బాధ్యత తీసుకున్నారు. నిర్మల్‌లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారంలో పాల్గొంటూ ఇతర పురపాలక సంఘాలను పర్యవేక్షిస్తున్నారు.
* మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీలు రంగారెడ్డి జిల్లాలో తెరాస అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.


కాంగ్రెస్‌.. ఎవరి పరిధిలో వారు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత కె.జానారెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ, కొండా విశ్వేశ్వర్‌రెడి,్డ జగ్గారెడ్డి వారివారి పరిధిలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల బాధ్యతలను పూర్తిగా స్థానిక నేతలకే అప్పగించినా.. పీసీసీ వారి మధ్య సమన్వయం చేస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసిన హస్తం పార్టీ స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది.


భాజపా.. పట్టున్న జిల్లాల్లో కార్యాచరణ

కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలతోపాటు వివిధ పురపాలక సంఘాల్లో ఎన్నికలను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌లు ఈ రెండు జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రమిస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌లు రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రచారం చేస్తున్నారు.
* ఎంఐఎం పది పురపాలక సంఘాలు లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తమ అభ్యర్థుల తరఫున పలుచోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.