close

ప్రధానాంశాలు

హైకోర్టు తరలింపు ఉంటే తెలపండి

పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: హైకోర్టును అమరావతి నుంచి తరలించే చర్యలను నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్ట ఉపసంహరణ బిల్లులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలతో కలిపి త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 26న విచారిస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈలోపు హైకోర్టు తరలింపుపై ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే తమ ముందు ప్రస్తావించొచ్చని పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశించింది. అమరావతి నుంచి హైకోర్టును తరలించే అధికారం శాసనసభ, రాష్ట్ర అధికార యంత్రాంగానికి లేదంటూ న్యాయవాది పాండురంగ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ‘హైకోర్టు తరలిస్తున్నారన్న సమాచారాన్ని మీరు ఎవరి నుంచి తెలుసుకున్నారు? మాకెలాంటి సమాచారం అందలేదు’ అని ధర్మాసనం.. పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారని న్యాయవాది బదులిచ్చారు. అవి ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలతో కలిపి త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుత వ్యాజ్యాన్ని విచారిస్తుందని పేర్కొంది. రాజధాని తరలింపు వ్యాజ్యాలతో ఈ పిటిషన్‌కు సంబంధం లేదని, ప్రత్యేకంగా విచారించాలని న్యాయవాది విన్నవించారు. ధర్మాసనం స్పందిస్తూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.. అందులో ఒకటి జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ అంది కదా అని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో వాటితోనే కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది బదులిస్తూ.. రాజధాని వ్యవహారంతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలతో కలిపి విచారిస్తే, మీ ఆలోచన విధానం మళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. ‘మా ఆలోచనను ఎవరూ మళ్లించలేరు. సూటిగా వ్యవహరిస్తాం’ అని స్పష్టం చేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.