close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
పట్టుకోండి... క్వారంటైన్‌కు పంపండి

విదేశీ తబ్లీగీలపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
70 దేశాల నుంచి 2,000 మంది వచ్చినట్లు వెల్లడి
తబ్లీగీ కార్యకర్తలను కలిసిన వారందరినీ తక్షణమే గుర్తించాలని స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల నుంచి వచ్చిన 2 వేల మంది తబ్లీగీ జమాత్‌ (టీజే) కార్యకర్తలు ప్రస్తుతం దేశంలోని విభిన్న ప్రాంతాల్లో మతపరమైన కార్యకలాపాల్లో నిమగ్నమైనట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. వీరు దేశంలో ఏ మూలన ఉన్నా వెంటనే కనిపెట్టి క్షుణ్నంగా స్క్రీన్‌చేసి క్వారంటైన్‌ కేంద్రాలకు కానీ, ఆసుపత్రికి కానీ తరలించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇటీవల కొందరు టీజే బృంద సభ్యులను తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో, 8 మంది ఇండోనేసియా వాసుల్ని తెలంగాణలో పరీక్షించినప్పుడు కరోనా పాజిటివ్‌గా తేలారని గుర్తుచేసింది. తబ్లీగీ ప్రధాన కార్యాలయమైన దిల్లీ నిజాముద్దీన్‌ బంగ్లేవాలి మసీదులో ఉన్నవారికి ఇది సోకి ఉండొచ్చునని తెలిపింది.

మలేసియా వెళ్లి వచ్చినవారిని అత్యవసరంగా పరీక్షించాలి
‘‘భారత్‌కు చెందిన తబ్లీగీ కార్యకర్తలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు మలేసియాలోని కౌలాలంపూర్‌ మసీదులో జరిగిన మతపరమైన సమ్మేళనానికి వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఆ సమ్మేళనానికి హాజరైన పలువురికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. అందువల్ల మలేసియాకు వెళ్లి వచ్చిన వారికి అత్యవసరంగా స్క్రీనింగ్‌ జరపాలి. టూరిస్ట్‌ వీసాల మీద వచ్చిన విదేశీయుల్లో బంగ్లాదేశీయులు 493 మంది, ఇండోనేసియా వాసులు 472 మంది, మలేసియా వారు 150, థాయిలాండ్‌ వారు 142 మంది ఉన్నారు. వీరంతా ఆరునెలల పాటు దేశంలో ఉండొచ్చు. విదేశీ తబ్లీగీ కార్యకర్తలు దేశంలో ఎక్కడున్నా వెతికి పట్టుకొని వారికి పరీక్షలు జరిపి క్వారంటైన్‌ కేంద్రాలకు అవసరమైతే ఆసుపత్రులకు పంపండి. పర్యాటక వీసాల మీద వచ్చి మతపరమైన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారంతా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లుగానే పరిగణించాలి. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తబ్లీగీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు పంపిన లేఖలో పేర్కొంది. తబ్లీగీ జమాత్‌ కార్యకర్తలతో అనుసంధానమై ఉన్నవారిని కూడా వెంటనే గుర్తించాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గాబా రాష్ట్రాలను ఆదేశించారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో మాట్లాడారు. వీసా నిబంధనలు ఉల్లంఘించిన విదేశీయులతోపాటు, కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థలపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రయాణ నిషేధం తొలగే వరకు నిర్బంధ కేంద్రాల్లోనే
నిజాముద్దీన్‌ మర్కజ్‌కు హాజరైన విదేశీయులందరి వీసాలను రద్దుచేయాలని కేంద్ర హోంశాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఇకముందు ఇలా వీసా నిబంధనలు ఉల్లంఘించే విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయ విమానయానంపై నిషేధం ఎత్తేసిన మరుక్షణమే విదేశీ కార్యకర్తల్ని వెనక్కి పంపేసే అవకాశం ఉంది.

* వలస కార్మికులు ఎక్కడ కనిపించినా పూర్తి వివరాలు నమోదు చేసుకొని వారిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నగరాలలో ఎక్కడ ఉన్నా వారి పేర్లు, స్థానిక, శాశ్వత చిరునామా, మొబైల్‌ నంబర్లను సేకరించాలని పేర్కొంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.