close

ప్రధానాంశాలు

కరోనా హాట్‌స్పాట్లు 10

కేంద్రం ప్రకటన
24 గంటల్లో 386 కొత్త కేసులు
తబ్లీగీ ద్వారానే 152

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులకు 10 ప్రాంతాలు హాట్‌స్పాట్లుగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ కేసులు ఆరు రాష్ట్రాల్లోని ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయని లెక్క తేల్చింది. మరోపక్క- 24 గంటల వ్యవధిలోనే 386 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. హజ్రత్‌ నిజాముద్దీన్‌లో జరిగిన మతపరమైన సమ్మేళనానికి హాజరైన తబ్లీగీ జమాత్‌ ప్రతినిధుల వల్లనే వైరస్‌ వ్యాప్తి అమాంతం పెరిగినట్లు తేలడంతో వారి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరమయింది. ఇప్పటివరకు 6,000 మందిని గుర్తించి, సుమారు 5,000 మందిని క్వారంటైన్‌కు తరలించారు. తెలంగాణ, గుజరాత్‌, తమిళనాడు సహా వేర్వేరు రాష్ట్రాల్లోని మరో 2,000 మంది కోసం గాలిస్తున్నారు. దేశంలో కేసుల సంఖ్య 1,649కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు. తబ్లీగీ జమాత్‌ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పర్యటించడం వల్లే ఈ కేసుల సంఖ్య పెరిగినట్లు తెలిపారు. జమ్మూ-కశ్మీర్‌లో 23, అండమాన్‌ నికోబార్‌లో 9, తమిళనాడులో 65, దిల్లీలో 18, పుదుచ్చేరిలో రెండు కేసులకు ఈ పర్యటన నేపథ్యమే ఉన్నట్లు తేలిందన్నారు. తబ్లీగీ జమాత్‌కు చెందిన 1,800 మందిని దిల్లీలోని 9 ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామని, ఈ సంఖ్యలను బట్టి దేశమంతటా కేసులు పెరుగుతున్నట్లు అనుకోరాదని చెప్పారు.

వైద్య పరికరాల ధరలు 10% మించి పెంచకూడదు
ఏప్రిల్‌ 1 నుంచి 24 రకాల వైద్య పరికరాల ధరలు, నాణ్యతను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని అగర్వాల్‌ చెప్పారు. తయారీదారులెవరూ వీటి ధరలను గత 12 నెలల గరిష్ఠ చిల్లర ధర కంటే 10 శాతానికి మించి పెంచడానికి వీల్లేదన్నారు. కొవిడ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ఎలాంటి అనుమానాలున్నా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి, ఎయిమ్స్‌ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్‌ మాట్లాడుతూ
సాంకేతిక సమస్యలపై ప్రశ్నలను  technicalquery.covid19@gov.in  కి ఈ-మెయిల్‌ ద్వారా పంపవచ్చని తెలిపారు.

ఏ రాష్ట్రంలో ఎక్కడ?
దిల్లీ
1. పశ్చిమ నిజాముద్దీన్‌: తబ్లీగీ కార్యకలాపాలతో ఇది దేశంలోనే కీలక హాట్‌స్పాట్‌గా మారింది.
2. దిల్షాద్‌ గార్డెన్‌: ఈశాన్య దిల్లీలోని ప్రాంతమిది.  సౌదీ అరేబియాకు వెళ్లివచ్చిన ఒక మహిళ కరోనాతో చనిపోవడంతో ఈ ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. ఆమెకు చికిత్స చేసిన ఒక మొహల్లా వైద్యునికీ వైరస్‌ సోకింది. రోజూ వందలాది మందికి చికిత్స చేసే ఆ వైద్యుని వల్ల ఆయన భార్యకూ కరోనా వచ్చింది.
రాజస్థాన్‌
3. భిల్వారా: రాజస్థాన్‌లోని 83 కరోనాకేసుల్లో 26 ఈ ఒక్క ప్రాంతం నుంచే వచ్చాయి. ఇక్కడ ఇద్దరు కరోనా తరహా లక్షణాలతో చనిపోయినా దానికి కారణాలు వేరని అధికారులు అంటున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌
4. నోయిడా: దిల్లీని ఆనుకుని పశ్చిమ యూపీలో ఉన్న గౌతమబుద్ధ నగర్‌లో 48 కేసులున్నాయి. ఇన్ని కేసులు మరే జిల్లాలోనూ లేవు. నోయిడాలో 2046 మందిని వైద్య పరిశీలనలో ఉంచారు.
5. మేరఠ్‌: యూపీలో కేసుల పరంగా రెండో స్థానంలో ఉంది. 19మందికి పాజిటివ్‌ వచ్చింది. బుధవారం 72 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించారు.
మహారాష్ట్ర
6. ముంబయి: ప్రయోగశాలలకు పంపిన నమూనాల్లో ఎక్కువ మందిలో కరోనా కనిపిస్తుండడంతో కొలివాడ, గోరేగావ్‌ ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా ప్రకటించారు.
7. పుణె: మహారాష్ట్రలో పుణెలో ఇప్పటివరకు దాదాపు 50 మంది కరోనా బారిన పడ్డారు. 2216 మంది వైద్య పరిశీలనలో ఉన్నారు.
గుజరాత్
8. అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని 73 కేసుల్లో 23 ఈ ఒక్క జిల్లాలో, అందులో అహ్మదాబాద్‌ నగరంలోనే ఉన్నాయి. వీరిలో ముగ్గురు చనిపోయారు.
కేరళ
9. కాసరగోడ్‌: దేశంలోనే ఎక్కువ ప్రభావిత జిల్లాల్లో ఒకటి. 99 కేసులున్నాయి.
10. పథనంథిట్ట: ఇక్కడ కేసులు ఐదే అయినా 7254 మంది పరిశీలనలో ఉన్నారు.


తమిళనాట ఒకేరోజు 110 మందికి
మొత్తం బాధితుల సంఖ్య 235

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాడులో బుధవారం 110 మందికి కరోనా నిర్ధారించినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేశ్‌ వెల్లడించారు. దీంతో వ్యాధి బారిన పడినవారి సంఖ్య 235కు చేరింది. దిల్లీ మతపరమైన కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 1500 మంది వెళ్లారు.


కర్ణాటకలో 9 కొత్త కేసులు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటకలో బుధవారం ఒక్కరోజే తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి. మైసూరులో నలుగురు, బెంగళూరులో ఐదుగురికి వ్యాధి సోకింది. తాజా నివేదికలతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 110కి చేరింది. దిల్లీ సమావేశానికి కర్ణాటక నుంచి 300 మంది హాజరైనట్లు హోంమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.