close

ప్రధానాంశాలు

ప్రాణాలే ముఖ్యం

అందువల్లే కఠిన నిర్ణయాలు
లాక్‌డౌన్‌ను ఒక్కసారిగా ఎత్తివేయం
ఇది సామాజిక అత్యయిక స్థితి
వైరస్‌ వేగాన్ని నియంత్రించగల అతి కొద్ది దేశాల్లో భారత్‌
అందరూ అండగా నిలవడం ప్రజాస్వామ్య గొప్పతనం
పార్లమెంటులో విపక్ష నేతలతో సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్య
దేశం యావత్తూ కలసికట్టుగా ఉందన్న నేతలు

మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనే దేశం తన పని విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి ప్రాణాన్నీ కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. ప్రపంచం మొత్తం కొవిడ్‌-19 నుంచి పెను సవాల్‌ ఎదుర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితులు మానవ చరిత్రలో సరికొత్త యుగానికి నాంది పలుకుతున్నాయి.
కరోనాకు ముందు జీవితం, ఆ తర్వాత జీవితం ఒకేలా ఉండబోవు.
మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కేంద్రంతో కలిసి పనిచేయడం అభినందనీయం. భీకర యుద్ధంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు సమైక్యంగా పాల్గొంటున్నాయి. దేశం నిర్మాణాత్మక, సకారాత్మక రాజకీయాలను చూడగలుగుతోంది. ప్రతి పౌరుడూ విశ్వాసం, క్రమశిక్షణ, అంకితభావంతో తనవంతు కృషి చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందే వేగాన్ని నియంత్రించగలిగిన కొద్ది దేశాల్లో భారత్‌ ఒకటి.

- ప్రధాని నరేంద్రమోదీ

ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు సామాజిక అత్యయిక పరిస్థితి (సోషల్‌ ఎమర్జెన్సీ)ని తలపిస్తున్నాయని, విధిలేక కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నిరంతర నిఘా ఉంచాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. చాలా రాష్ట్రాలు, జిల్లా పరిపాలన యంత్రాంగాలు ప్రస్తుత లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరుతున్నాయన్నారు. లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తివేయలేమని, దీనిపై ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నానని చెప్పారు. ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్లమెంటు ఉభయ సభల్లోని వివిధ పక్షాల నేతలతో మాట్లాడారు. ప్రస్తుత సంక్లిష్ట సమయంలో అందరూ తనకు అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది మన ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటుతోందని పేర్కొన్నారు.  వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశం మొత్తం ఆయనకు అండగా ఉందని భరోసా ఇచ్చారు. సిబ్బంది మనోస్థైర్యాన్ని పెంచడం, కరోనా పరీక్షలు విస్తృతం చేయడం గురించి మాట్లాడారు. మహమ్మారిపై దేశం సమర్థంగా పోరాటం చేయడానికి తీసుకోవాల్సిన విధానాల గురించి అభిప్రాయాలు వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ పొడిగింపు, దానిని ఎత్తేసిన తర్వాత దశలవారీగా తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు చేశారు. వైద్యారోగ్య సిబ్బందికి పరికరాల కొరత లేకుండా చూడాలని, పార్లమెంటు నూతన భవన నిర్మాణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కొందరు సూచించారు. విలువైన సలహాలిచ్చి, క్షేత్రస్థాయి పరిస్థితులు గురించి చెప్పారంటూ వారందరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలవడం దేశ ప్రజాస్వామ్య పునాదుల బలాన్ని, సహకారపూర్వక సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తినీ చాటిచెబుతోందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌, థావర్‌చంద్‌ గహ్లోత్‌, ప్రహ్లాద్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌ పొడిగింపుపై 11న సీఎంలతో చర్చ
లాక్‌డౌన్‌ పొడిగింపు వంటి అంశాలపై ప్రధాని మోదీ ఈ నెల 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కరోనాపై సీఎంలతో ఆయన మాట్లాడనుండడం ఇది మూడోసారి. లాక్‌డౌన్‌ పొడిగించాలని వినతులు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం     ఏర్పడింది.

‘ఆరోగ్య సేతు’ను డౌన్‌లోడ్‌ చేసుకోండి
కరోనాపై ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడానికి ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజల్ని కోరారు. వ్యాధికి గురయ్యే అవకాశం ఎంతవరకు ఉందో ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగినా ఆ సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు తెలిపి వారిని అప్రమత్తం చేయవచ్చు. మహమ్మారిపై పోరులో ఈ యాప్‌ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాకు ఎలాంటి అభినందనలూ వద్దు
దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానికి అభినందనలు తెలుపుతూ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అందరూ నిలబడి ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టాలంటూ జరుగుతున్న ప్రచారంపై మోదీ స్పందించారు. ఇది దురుద్దేశంతో కూడిన ప్రచారమని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తనను వివాదంలో ఇరికించడానికి జరుగుతున్న ప్రయత్నమంటూ హిందీలో ట్వీట్‌ చేశారు. ‘‘మోదీపై నిజంగా ప్రేమ ఉంటే కనీసం లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు ఓ పేద కుటుంబం బాధ్యతలు తీసుకోండి. ఇంతకన్నా గౌరవం మరొకటి ఉండదు’’అని స్పష్టం చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.