close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహింద రాజపక్స ఘన విజయం

శ్రీలంక ప్రధానిగా నాలుగోసారి

కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో రాజపక్స కుటుంబం మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ దేశ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఆ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడిచే శ్రీలంక పీపుల్స్‌ పార్టీ(ఎస్‌ఎల్‌పీపీ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం స్థానాల్లో మూడింట రెండువంతులు ఆ పార్టీకే దక్కాయి. 225 స్థానాలున్న పార్లమెంటులో ప్రధాన మంత్రి మహింద రాజపక్స నేతృత్వంలోని ఎస్‌ఎల్‌పీపీ, దాని మిత్రపక్షాలు 150 స్థానాల్లో విజయ ఢంకా మోగించాయి. ఎస్‌ఎల్‌పీపీకి సొంతంగా 145 స్థానాలు దక్కటం విశేషం. పోలైన 68 లక్షల ఓట్లలో 59.9శాతం ఈ పార్టీకే లభించాయి. తన అఖండ విజయం పట్ల అభినందనలు చెబుతూ ఫోన్‌ చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీకీ మహింద రాజపక్స కతృజ్ఞతలు తెలిపారు. ఉత్తర కొలంబో శివారులోని ప్రసిద్ధ బౌద్ధ ఆలయం కెలనియాలో ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో రాజపక్స ప్రధాన మంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రస్తుత ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్‌ విక్రమసింగేకు చెందిన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యుఎన్‌పీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విక్రమ సింగే కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ పార్టీ ఒక్క స్థానం మాత్రమే లభించింది. యూఎన్‌పీ నుంచి చీలిపోయి సమగి జన బళవేగయా (ఎస్‌జేబీ)ని ఏర్పాటు చేసుకున్న సాజిత్‌ ప్రేమదాసా...ముస్లిం పార్టీతో కలిసి పోటీ చేసి 55 స్థానాలను గెలుచుకున్నారు. పార్లమెంటులో ప్రధాన విపక్ష నేతగా నిలవనున్నారు. తమిళులకు ప్రాతినిధ్యం వహించే పార్టీ టీఎన్‌ఏ ప్రాబల్యం 10 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 16 స్థానాలను గెలుచుకుంది. మార్క్సిస్ట్‌ జనతా విముక్తి పెరమున(జీవీపీ) గెలుచుకున్న సీట్లు గతంలో ఉన్న ఆరు నుంచి మూడుకు తగ్గిపోయాయి.


పడిలేచిన కెరటం..రాజపక్స

రెండు దశాబ్దాలుగా రాజపక్స కుటుంబం శ్రీలంక రాజకీయాల్లో ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. మహింద రాజపక్స 2005-15 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఎస్‌ఎల్‌పీపీ వ్యవస్థాపకుడు బసిల్‌ రాజపక్స.. ప్రధాని మహింద రాజపక్స సోదరులే. గత ఏడాది నవంబరులో గొటబయ శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

మహింద రాజపక్స రాజకీయ ప్రస్థానం తొలిదశలో ఆటుపోటులకు గురైంది. 24 ఏళ్ల వయసులో పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన 1977లో ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 1989లో తిరిగి పార్లమెంటులో అడుగుపెట్టే వరకూ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. అప్పటి అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ ప్రభుత్వంలో కార్మిక, మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో ప్రధాన మంత్రిగా తొలి సారి నియమితులయ్యారు. 2005లో శ్రీలంక ఫ్రీడం పార్టీ తరఫున దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎల్టీటీఈపై ఉక్కుపాదం మోపి దానిని పూర్తి స్థాయిలో నిర్మూలించటంతో దేశవ్యాప్తంగా ఆయన ప్రతిష్ఠ ఇనుమడించింది. అదే సమయంలో తీవ్ర విమర్శలూ వచ్చాయి. 2005-15 మధ్య రెండు సార్లు అధ్యక్షపదవిని చేపట్టిన మహింద రాజపక్స....మూడోసారి కూడా ఆ పదవిలో కొనసాగేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించారు. తన సోదరులైన గొటబయ, బాసిల్‌, చమల్‌లకు కీలక పదవులు కట్టబెట్టటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ సమయంలోనే శ్రీలంక.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ఒప్పందాలను చైనాతో కుదుర్చుకుంది. తీవ్రమైన అప్పుల భారంలో కూరుకుపోయియంది. 2015లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మైత్రిపాల సిరిసేన చేతిలో మహింద రాజపక్స ఓడిపోయారు. మూడేళ్ల తర్వాత 2018 అక్టోబరులో అధ్యక్షుడు సిరిసేన... ప్రధాన మంత్రిగా ఉన్న రణిల్‌ విక్రమ సింగేను తొలగించి మహింద రాజపక్సను ఆ పదవిలో నియమించటం వివాదానికి దారితీసింది. సుప్రీంకోర్టు తీర్పుతో డిసెంబరు 15న రాజపక్స ప్రధాని పదవి నుంచి వైదొలగారు. రాజపక్స తన మద్దతుదారులతో అధికార పార్టీ నుంచి విడిపోయి తన సోదరుడు ఏర్పాటు చేసిన శ్రీలంక పీపుల్స్‌ పార్టీలో చేరారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన వరుస బాంబు దాడులు శ్రీలంక రాజకీయాలను మలుపుతిప్పాయి. ఆ తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మహింద రాజపక్స సోదరుడు గొటబయ రాజపక్స విజయం సాధించారు. తాత్కాలిక ప్రధానిగా మహింద తిరిగి నియమితులయ్యారు. తాజా ఎన్నికల్లో మహింద రాజపక్స మరోసారి విజయం సాధించారు. అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తూ, పార్లమెంటును బలోపేతం చేస్తూ గతంలో తీసుకొచ్చిన 19 రాజ్యాంగ సవరణను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్న మహింద రాజపక్సకు ....ప్రస్తుతం లభించిన భారీ ఆధిక్యంతో దానిని సాకారం చేసుకొనే అవకాశం లభించింది. అయిదే, ఇది దేశంలో నియంతృత్వానికి దారితీయవచ్చని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.