close

తాజా వార్తలు

మళ్లీ రాజపక్స ఏలుబడి!

న సోదరుల్లా రాజకీయ నాయకుణ్ని కానని, అసలు రాజకీయాల్లోకి వస్తానో రానో చెప్పలేనని 2017 మార్చిలో ప్రకటించిన గోటబాయ రాజపక్స, పట్టుమని మూడేళ్లు తిరక్కుండానే శ్రీలంక అధ్యక్షుడిగా పట్టాభిషిక్తులయ్యారు. మొన్న 16వ తేదీనాటి ఎన్నికల్లో 52శాతం పైగా ఓట్లతో శ్రీలంక ఏడో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జయకేతనం ఎగరేసి అత్యున్నత పీఠం అధిష్ఠించిన మొట్టమొదటి మిలిటరీ మాజీ అధికారిగా చరిత్ర సృష్టించారు! కోటీ 60లక్షల మంది ఓటర్లుగల శ్రీలంకలో అత్యధికంగా 83.7 శాతం పోలింగ్‌ జరిగిన ఎన్నికలివి. ఏప్రిల్‌ నాటి వరస బాంబుదాడులతో దేశభద్రత ప్రమాదంలో పడిందన్న భావన మెజారిటీ వర్గమైన సింహళీయుల్లో ప్రబలగా, రాజపక్స కుటుంబీకుల చేతికి మళ్ళీ అధ్యక్ష పదవీ పగ్గాలు చిక్కితే అణచివేత తీవ్రతరమవుతుందన్న భయాందోళనలు తమిళ, ముస్లిం మైనారిటీల్లో పొటమరించాయి. కాబట్టే తమిళులు, ముస్లిములు మెజారిటీగా ఉన్న ఉత్తర తూర్పు పరగణాల్లో అధికార పక్ష అభ్యర్థి సజిత్‌ ప్రేమదాసకు 80 శాతందాకా ఓట్లు పోలయ్యాయి. అయితేనేం, సింహళీయుల క్రియాశీల ఓటే నిర్ణాయకాంశమై గోటబాయకు అధ్యక్ష పీఠం కట్టబెట్టింది. 2005 నుంచి దశాబ్ద కాలంపాటు దేశాన్నేలిన మహింద రాజపక్స సోదరుడిగానే కాదు, ఎల్‌టీటీఈని సమూలంగా మట్టుపెట్టడంలో నాటి రక్షణ కార్యదర్శిగా కర్కశంగా వ్యవహరించిన గోటబాయను సింహళ సమాజం ఒక ‘హీరో’గా సమాదరిస్తోంది. ఈస్టర్‌ బాంబు దాడుల నేపథ్యంలో ప్రచ్ఛన్న ముష్కర మూకల పనిపట్టి దేశాన్ని సుభద్రంగా కాచుకోగల నాయకుణ్ని జనవాహిని గోటబాయలో చూసింది. సింహళీయుల ఓటే తనను గెలిపించినప్పటికీ శ్రీలంక పునర్నిర్మాణంలో తనతో కూడిరావలసిందిగా మైనారిటీ వర్గాలను గోటబాయ కోరుతున్నారు. దేశభద్రత, ఆర్థిక స్వస్థతలే ఎన్నికల్లో కీలక ప్రచారాంశాలు కాగా, ఆ రెండింటినీ గాడిన పెట్టడం కొత్త అధ్యక్షుడి పాలన దక్షతకు పెనుసవాలు కానుంది. చైనా వైపు రాజపక్స కుటుంబీకుల మొగ్గు ముంజేతి కంకణం కావడంతో శ్రీలంకతో స్నేహసేతువు నిర్మాణంలో ఇండియా జాగ్రత్తగా ముందడుగేయాలి!

కన్నీటి చుక్క ఆకృతిలో ఉండే ద్వీప దేశమైన శ్రీలంకకు సంక్షోభాల ఆటుపోట్లు ఎప్పుడూ ఉన్నవే. తమిళ పులుల ఉగ్రవాదంతో ఎగసిన అంతర్యుద్ధం దశాబ్దాల తరబడి దేశాన్నే కన్నీటి కాష్ఠంగా మార్చేసింది. మానవ హక్కుల్ని కాలరాసి, దాదాపు లక్షమందిని ఊచకోత కోసి, ఎల్‌టీటీఈని నామరూపాల్లేకుండా చేసి 2010లో మరోసారి అధ్యక్ష పీఠం అధివసించిన మహింద రాజపక్స- ప్రధానంగా చేసిన పనులు రెండు. దేశాధ్యక్షుడిగా తన స్థానాన్ని శాశ్వతం చేసుకొనే క్రమంలో రాజ్యాంగ సవరణలకు తెగించడం, బీజింగ్‌ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచి హంబన్‌తోట లాంటి కీలక నౌకాస్థావరాల్ని చైనాకు అప్పగించడం! తనకు ఎదురే లేదనుకొంటూ 2015 నాటి ఎన్నికల బరిలోకి దిగిన మహిందకు తలబొప్పి కట్టించిన ప్రజాతీర్పు- మైత్రీపాల సిరిసేన నెత్తిన పాలుపోసింది. ప్రధాని రణిల్‌ విక్రమ్‌సింఘె పార్టీతో సుపరిపాలన కూటమి కట్టి, జోడెడ్లుగా ప్రగతిబాటలో దేశాన్ని పరుగుపెట్టిస్తామని మైత్రీపాల ఎన్నిచెప్పినా- మూడున్నరేళ్లకే రెండు పార్టీలూ ఎడమొగం పెడమొగమయ్యాయి. నిరుడీ రోజుల్లో తీవ్రతరమైన రాజ్యాంగ సంక్షోభానికి సుప్రీం తీర్పు తగు పరిష్కారం చూపినా, ఎంతో ముందుగానే అందిన ఉగ్రవాద దాడుల సమాచారాన్ని నిఘా సంస్థలు పెడచెవిన పెట్టేంతగా ప్రభుత్వంలో ఉదాసీనత ప్రబలింది. పర్యవసానంగా ఈస్టర్‌ పర్వదినం నాడు జరిగిన భయానక బాంబుదాడుల్లో 269మంది అభాగ్యులు బలైపోవడం యావత్‌ శ్రీలంకనూ నైరాశ్యంలో ముంచేసింది. అంతర్గత భద్రతకు భరోసా ఇవ్వగలిగే బలమైన నేతకోసం జరిగిన తాజా ఎన్నిక గోటబాయ విజయాన్ని నల్లేరు మీద బండి నడకగా మార్చేసింది. కేంద్రీకృత అధికారానికి కొమ్ముకాసే గోటబాయ రాజపక్స పరిపాలన తన సోదరుడి ఏలుబడికి భిన్నంగా ఉండే అవకాశం లేదు. దేశ ప్రధానిగా మహింద రాజపక్స కొలువు తీరడం కేవలం లాంఛనమేనంటున్న వార్తాకథనాలు- శ్రీలంకలో నయా అధ్యాయానికి ముందు మాటలు!

ఎల్‌టీటీఈ పీచమణిచాక సర్వం సహాధ్యక్షుడిగా మహింద రాజపక్స ఏలుబడిలో వ్యక్తిస్వేచ్ఛకు తూట్లుపడ్డాయి; అవినీతి బంధుప్రీతి నిరంకుశత్వాలు చెలరేగిపోయాయి. అదే సమయంలో దేశార్థిక, మానవాభివృద్ధి సూచీలు పైకి ఎగబాకడం, సగటున ఏడున్నర శాతం ఆర్థికాభివృద్ధి నమోదు, నిరుద్యోగిత నాలుగు శాతానికి దిగిరావడం, రాజకీయ సుస్థిరత పాదుకొనడం శ్రీలంక ప్రగతిని పరుగులు పెట్టించాయి. 2016లో నాలుగున్నర శాతంగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి నిరుడు 2.7 శాతానికి, ఈ ఏడాది ఒకటిన్నర శాతానికి కుంగిపోతోంది. ఈస్టర్‌ బాంబుదాడుల తరవాత పర్యాటకం పడకేయడం, 6,950 కోట్ల డాలర్లుగా లెక్కతేలుతున్న రుణాలు జీడీపీలో 78 శాతానికి చేరడం ఆర్థిక సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. అందులో సగం విదేశీ అప్పులే. చైనా ఇచ్చే మౌలిక సదుపాయాల పరికల్పన రుణాల ఊబిలో శ్రీలంక సైతం కూరుకుపోతోందన్నదీ కళ్లకు కడుతున్న వాస్తవమే. ఇండియా చుట్టూ గొలుసుకట్టుగా తన స్థావరాల్ని సువ్యవస్థితం చేసుకొంటూ వస్తున్న బీజింగుకు గోటబాయ ఉత్థానం ఎంతో ఉత్తేజం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. రాజపక్స కుటుంబమంటే భారత సర్కారుకు గిట్టదన్న అపప్రథను తుడిచిపెట్టేలా, శ్రీలంకతో గట్టి మైత్రీబంధం పెనవడేలా ఇండియా దౌత్యనీతి కొత్తపుంతలు తొక్కాలి. భారత్‌తో స్నేహబాంధవ్యానికి అగ్ర ప్రాధాన్యమిస్తామని ఎన్నికల ప్రణాళికలో గోటబాయ వాగ్దానం చేశారు. ‘భారత్‌ మా బంధువు. చైనా మిత్రదేశం’ అన్న పాటే కొత్త పాలకుడి నోటా పల్లవిస్తున్న దశలో- చైనా చొరబాట్లకు వీల్లేని విధంగా మైత్రీబంధాన్ని బలోపేతం చేసుకోవడంపై మోదీ సర్కారు దృష్టి సారించాలిప్పుడు!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.