close

తాజా వార్తలు

బీసీసీఐలో...ఇక దాదాగిరి

అది 2000వ సంవత్సరం.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం దెబ్బకు భారత క్రికెట్‌ కుదేలైపోయి ఉంది. కెప్టెనే ఈ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడం జట్టును కుదిపేసింది. భారత క్రికెట్‌ సమగ్రతనే ప్రశ్నార్థకం చేసి, భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తించిన సందర్భమది. దేశ క్రికెట్‌ చరిత్రలోనే అది అత్యంత క్లిష్టమైన పరిస్థితి!

అలాంటి స్థితిలో గంగూలీ జట్టు పగ్గాలందుకున్నాడు. అందరికీ అండగా నిలిచాడు. అట్టడుగు స్థాయిలో ఉన్న ఆటగాళ్ల స్థైర్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చాడు. యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చాడు. దూకుడైన తన నాయకత్వంతో జట్టు ఆలోచన విధానాన్ని మార్చాడు. అలాగే భారత క్రికెట్‌ రాతనూ మార్చేశాడు. అభిమానుల మనసులు గెలిచి అందరి దృష్టినీ ఆట వైపు మళ్లించాడు. ఇతను కెప్టెనేంటి అన్న వాళ్లతోనే కెప్టెన్‌ అంటే ఇలా ఉండాలి అనిపించాడు.

ఇప్పుడు అదే వ్యక్తి భారత క్రికెట్‌ పాలన పగ్గాలు అందుకుంటున్నాడు. అప్పటి టీమ్‌ఇండియా స్థాయిలో కాకపోయినా.. ఇప్పుడు బీసీసీఐ సైతం ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది. అతడు నెరవేర్చాల్సిన బాధ్యతలెన్నో! ఎదుర్కోవాల్సిన సవాళ్లెన్నో! అతడిపై ఆశలెన్నో!

మరి ఇప్పుడు కూడా అతను అదే నాయకత్వ పటిమను చూపిస్తాడా? అంచనాల్ని అందుకుంటాడా? అందరి ఆశలు నెరవేరుస్తాడా?

ఈనాడు క్రీడావిభాగం

2000లో గంగూలీ కెప్టెన్‌ కావడం అనూహ్యం. ఎవ్వరూ ఊహించని పరిస్థితుల్లో అతడిని ఆ పదవి వరించింది. అలా అనుకోకుండానే అతడి నాయకత్వ లక్షణాలూ బయటపడ్డాయి. కెప్టెన్‌గా అతడి ఘనతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ రోజు భారత క్రికెట్‌ అత్యున్నత స్థాయిలో ఉండటానికి అతను వేసిన పునాదే కారణం. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక కూడా గంగూలీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. చాలా త్వరగా క్రికెట్‌ పాలక రాజకీయాల్లోకి వచ్చేశాడు. తన గాడ్‌ఫాదర్‌ దాల్మియా అండతో బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)లోకి అడుగు పెట్టాడు. ఆయన మరణానంతరం క్యాబ్‌ అధ్యక్షుడూ అయ్యాడు. ఇటీవలే మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే దాదా ఇంత త్వరగా బీసీసీఐ అధ్యక్షుడవడం అనూహ్యమే. రెండు రోజుల కిందటి వరకు అతడు రేసులో లేనేలేడు. బ్రిజేష్‌ పటేల్‌ అధ్యక్షుడు అవుతాడని వార్తలు బయటికి వచ్చిన కొన్ని గంటల్లోనే పరిస్థితులు వేగంగా మారిపోయాయి. నాటకీయ రీతిలో గంగూలీ అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థి అయ్యాడు. ఒక్క రోజు తిరిగేసరికి బోర్డు అధ్యక్షుడిగా అతడి ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. అయితే ఒకప్పుడు టీమ్‌ఇండియా కెప్టెన్సీ లాగే ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష పదవి కూడా గంగూలీకి ముళ్ల కిరీటమే. అతను చక్కదిద్దాల్సిన పనులు బోర్డులో చాలానే ఉన్నాయి. 2013 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం అనంతరం సుప్రీం కోర్టు జోక్యం, లోధా కమిటీ ప్రవేశంతో బీసీసీఐలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీనివాసన్‌, అనురాగ్‌ ఠాకూర్‌ సహా ఎంతోమంది బలమైన క్రికెట్‌ పాలకులు బీసీసీఐకి దూరమయ్యారు. బోర్డు పాలన మొత్తం సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ చేతుల్లోకి వెళ్లింది. దీంతో పాలన కుంటు పడింది! బీసీసీఐ బలహీనపడింది. ఒకప్పుడు బీసీసీఐ ఎలా చెబితే అలా నడుచుకున్న ఐసీసీ.. ఇప్పుడు భారత బోర్డును ఖాతరు చేయట్లేదు. గత కొన్నేళ్లలో భారత్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఏడాదికో టీ20 ప్రపంచకప్‌, మూడేళ్లకో వన్డే ప్రపంచకప్‌ లాంటి ఐసీసీ తాజా ప్రతిపాదనలు కూడా భారత్‌కు ఇబ్బందికరమే. మరోవైపు లోధా కమిటీ సంస్కరణల్లో కొన్నిటిపై తీవ్ర అభ్యంతరాలున్నాయి.

మార్చే సాహసం చేస్తాడా?
లోధా కమిటీ సంస్కరణల్లో కొన్ని భారత క్రికెట్‌కు మంచే చేసినా.. కొన్ని క్రికెట్‌ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారాయన్న అభిప్రాయాలున్నాయి. అందులో విరుద్ధ ప్రయోజనాల అంశం ఒకటి. ఈ నిబంధన విషయంలో మరీ కచ్చితంగా, కఠినంగా వ్యవహరించడం వల్ల భారత క్రికెట్‌కు మంచి చేయాలని ఆశించే మాజీ ఆటగాళ్లకు అడ్డంకులు తప్పట్లేదు. ఉదాహరణకు రాహుల్‌ ద్రవిడ్‌ విషయమే తీసుకుంటే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్య సంస్థ అయిన ఇండియా సిమెంట్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న అతను జాతీయ క్రికెట్‌ అకాడమీ పగ్గాలందుకోవడాన్ని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ తప్పుబట్టి విచారణకు పిలిచాడు. ఈ నిబంధన వల్లే అంతకుముందు రాహుల్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటార్‌ బాధ్యతలు వదులుకోవాల్సి వచ్చింది. ఏ ప్రయోజనం ఆశించకుండా సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌ క్రికెట్‌ సలహా కమిటీలో సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే.. వారికి ఐపీఎల్‌ జట్లతో ఉన్న సంబంధాల్ని చూపించి నోటీసులు జారీ చేశాడు అంబుడ్స్‌మన్‌. కపిల్‌ దేవ్‌కూ ఈ తలనొప్పి తప్పలేదు. ఇలా ఉంటే మాజీ ఆటగాళ్లెవరూ క్రికెట్‌ వ్యవహారాల వైపు చూడరని, ఈ నిబంధనను మార్చాలని అంటున్నారు. మరోవైపు ‘తప్పనిసరి విరామం’ నిబంధన, 70 ఏళ్లు పైబడితే పదవుల్లో కొనసాగకూడదన్న షరతు వంటి వాటిపైనా అభ్యంతరాలున్నాయి. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఇలాంటి నిబంధనల్ని ఎత్తివేసే సాహసం దాదా చేస్తాడా అన్నది ఆసక్తికరం. వీటి సవరణ చేపడితే.. గంగూలీ పది నెలలకే దిగిపోవాల్సిన అవసరం కూడా ఉండదు.

65 ఏళ్లలో తొలిసారి..
ఒక మాజీ క్రికెటర్‌ పూర్తి స్థాయిలో బీసీసీఐ అధ్యక్షుడు కావడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 1954లో విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు బీసీసీఐ అధ్యక్షుడయ్యాడు. అతను భారత జట్టు మాజీ కెప్టెన్‌ కూడా. ఆ తర్వాత పూర్తి స్థాయిలో బీసీసీఐ పగ్గాలు అందుకుంటున్నది గంగూలీనే. 2014లో సునీల్‌ గావస్కర్‌, శివలాల్‌ యాదవ్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు కానీ.. వాళ్లిద్దరూ కొన్ని నెలలు తాత్కాలికంగా విధుల్లో ఉన్నారు.

అవన్నీ వదిలేస్తాడు
బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్న నేపథ్యంలో గంగూలీ క్యాబ్‌ పగ్గాలు వదిలేస్తాడు. దీంతో పాటు దిల్లీ క్యాపిటల్స్‌ మార్గదర్శి బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాడు. అలాగే క్రికెట్‌ వ్యాఖ్యానం కూడా వదిలేస్తాడు. విరుద్ధ ప్రయోజనాల సమస్య తలెత్తకుండా క్రికెట్‌ పరంగా మరే రకమైనా బాధ్యతనూ దాదా తీసుకోడు.

ఉండేది పది నెలలే
గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం అతడి అభిమానులందరికీ సంతోషాన్నిచ్చే విషయమే కానీ.. అతను పదవిలో ఉండేది పది నెలలే కావడం మాత్రం నిరాశ కలిగించే విషయం. ఇందుక్కారణం.. లోధా కమిటీ తెచ్చిన ‘తప్పనిసరి విరామం’ నిబంధనే. దీని ప్రకారం బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఎవరైనా మూడేళ్ల విరామం తీసుకోవాలి. క్రికెట్‌ పాలన వ్యవహారాలకు దూరంగా ఉండాలి. గంగూలీ అయిదేళ్లకు పైగా బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పది నెలల పదవీ కాలం పూర్తి కాగానే.. అతను అతను ఆరేళ్ల పరిమితిని దాటేస్తాడు. దీంతో గంగూలీ పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. మూడేళ్లు విరామం తీసుకుని మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ పడొచ్చు. మరి ఇంత తక్కువ వ్యవధిలో గంగూలీ అధ్యక్షుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.