close

తాజా వార్తలు

కుళ్లిన ముక్క...ఊరించే కూరగా!

 మసాలా దట్టించి మాయ చేస్తున్న హోటళ్లు
 ఫ్రిజ్‌ల్లో రోజుల తరబడి పాచిన కూరలు
 స్విగ్గీ, జొమాటోలకు  నాసిరకం ఆహారం
ఈనాడు, హైదరాబాద్‌:

మరిగే నూనెలో మురిగిన ముక్కలేసి మసాలా దట్టించి మాయ చేస్తున్నాయి హోటళ్లు.

చక్కదిద్దాల్సిన వారు చుక్కతెగినట్లు వచ్చి జరిమానాలతో చేతులు దులుపుకొంటున్నారు.

రూ.లక్షల్లో లాభాలకు మరిగిన నిర్వాహకులు రూ.వేలల్లో జరిమానాలు చెల్లించేసి..

అదే ఆహారాన్ని శీతలపెట్టెల్లో పెట్టి ఏ రోజుకారోజు వేడి చేసి వడ్డించేస్తున్నారు.

మురుగు కూపాల్లా వంటగదులు.. రోజులుగా కడగని పాత్రలు.. శుభ్రత తెలియని వ్యక్తులతో నిర్వహిస్తున్న హోటళ్ల వ్యాపారం

మూడు బిర్యానీలు.. ఆరు కబాబుల్లా సాగుతోంది. ప్రజలకు అనారోగ్యం పంచుతోంది.

నగరంలో ప్రముఖంగా చెప్పుకొంటోన్న ప్యారడైజ్‌, బ్లూ ఫాక్స్‌ వంటి హోటళ్లూ మిగిలిన, కుళ్లిన పదార్థాలను వేయించి వినియోగదారులకు రకరకాల పేర్లతో వడిస్తున్నాయి. ఇవన్నీ తెలిసినా జరిమానాలతో హడావుడి చేయడం వరకే బల్దియా పరిమితమవుతోంది. అడిగితే.. ‘కోటి మంది నివసిస్తున్న ప్రాంతంలో ఒక్కరంటే.. ఒక్క ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌నూ కేటాయించలేదు’ అని జీహెచ్‌ఎంసీ చేతులెత్తేస్తోంది.

తనిఖీలు చేయాలి..
ఏడాదికోసారి జరిమానాల పేరుతో హడావుడి చేస్తోన్న అధికారులు.. ముడుపులు తీసుకుని మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలున్నాయి. క్రమం తప్పకుండా తనిఖీ చేసి, జరిమానాల విధింపులో పారదర్శకత పెరగాల్సి ఉంది. తనిఖీలు హోటళ్లకు ధ్రువీకరణ వరకే పరిమితం కాకుండా స్వచ్ఛత, అగ్నిమాపక చర్యలు, మురుగునీటి వసతి, వ్యర్థాల నిర్వహణ, తదితర అంశాల దృష్టి సారించాల్సి ఉంది.

రోజూ 20 ఫిర్యాదులు..
జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా విభాగంలో ప్రస్తుతం ముగ్గురు అధికారులున్నారు. వారిలో ఒకరు అసిస్టెంట్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు. ఉపకమిషనర్‌ హోదాలోని మరో అధికారికి బల్దియా ఆహార తనిఖీల బాధ్యతలు ఇచ్చింది. ఇంత పెద్ద నగరం నుంచి రోజుకు ఆహారంపై 15 నుంచి 20 ఫిర్యాదులు వస్తుంటే.. ఉన్న నలుగురు అధికారులు విని ఊరుకుంటున్నారు. ‘ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలకు వెళ్లాల్సి ఉన్నా తామే రోజుకు రెండు, మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నామని, ఏడాదిలో సుమారు 70 కేసులు నమోదు చేస్తున్నామని, 18 కేసుల్లో జైలు శిక్ష, జరిమానా పడిందని’ అధికారులు గుర్తుచేస్తున్నారు.

ప్యారడైజ్‌లోనూ అపరిశుభ్రతే..
ప్యారడైజ్‌ హోటళ్లోనూ అపరిశుభ్రత తాండవిస్తోందని, నిల్వ చేసిన ఆహార పదార్థాలు, రక్షణ చర్యలు సరిగా లేవని జీహెచ్‌ఎంసీ సహాయ వైద్యాధికారి, గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి తాజా తనిఖీల్లో గుర్తించారు. చికెన్‌ 65, ఇతరత్రా వంటకాల్లో రుచి, రంగు కోసం రసాయనాలను కలుపుతున్నారని, వంట మనుషులు శుచి పాటించట్లేదని తేల్చి రూ.1లక్ష జరిమానా విధించారు.
* ప్యారడైజ్‌ కూడలిలోని జెంజెం రెస్టారెంట్‌కు సైతం అపరిశుభ్రతను చక్కదిద్దుకోవాలని హెచ్చరిస్తూ రూ.15వేలు జరిమానా వేశారు.
* ఎంజీరోడ్డులోని సూపర్‌ స్టార్‌ హోటల్‌కు రూ.5వేలు, సరూర్‌నగర్‌లోని కేఫ్‌ బహర్‌ హోటల్‌కు రూ.లక్ష విధించారు.

తనిఖీల్లో గుర్తించిన లోపాలు..
* ప్రతి చోటా వంటగదులను సరిగా నిర్వహించడం లేదు.
* దాదాపు ప్రతిచోటా ఫ్రిజ్‌ల్లో మూడు, నాలుగు రోజుల చికెన్‌, మటన్‌ కూరలు ఉంచారు.
* బొద్దింకలు, బూజు, గోడలపై పేరుకుపోయి ఉంది.
* ఆహార పదార్థాలు, క్రిమికీటకాల మధ్య, చెమట వంటపాత్రల్లో కారుతున్నా పట్టించుకోవడం లేదు.
* కూరల్లో పడుతోన్న తలవెంట్రుకలనూ అలాగే వదిల్తేన్నారు.
* ప్రమాదకర రసాయనాలు వాడే వంటకాలకు పిల్లలు, యువత దూరంగా ఉండాలని ఉన్నతాధికారి సుదర్శన్‌రెడ్డి వివరించారు.

స్విగ్గీ, జొమాటోలపై రోజూ 5 ఫిర్యాదులు..
కూర్చున్నచోటుకే కోరిన ఆహారం తీసుకొస్తున్న స్విగ్గీ, జొమాటోలపై జీహెచ్‌ఎంసీకి రోజుకు 3 నుంచి 5 ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌లో పేరున్న హోటళ్లను సందర్శించిన గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌రెడ్డికి ఎదురైన అనుభవం ఆయన మాటల్లోనే..‘ఫిర్యాదుల మేరకు ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పేరున్న రెండు రెస్టారెంట్లను సందర్శించాం. మేం ఎవరో చెప్పకుండా పరిశీలించాం. స్విగ్గీ, జొమాటో ప్రతినిధులు అక్కడికి రాగానే.. నిర్వాహకులు స్విగ్గీకి బిర్యానీ ప్యాక్‌ చెయ్‌ అంటున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులమంటూ సిబ్బందిని ప్రశ్నించాం. ఆన్‌లైన్‌ ఆర్డర్లకు వేరే రకం బిర్యానీ, ఆహార పదార్థాలను ఇస్తామని చెప్పాడు. వాళ్లు తక్కువ ధర ఇస్తారని, దానికి తగ్గట్లు మిగిలిన బిర్యానీ, అతిగా మాడిపోయిన చికెన్‌ ముక్కలు, రుచిగా లేని, సరిగా ఉడకని ఆహార పదార్థాలు, వృథా కూరలను పంపిస్తామని చెప్పాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.