close

తాజా వార్తలు

ఉతికి ఆరేశారు

ఆఖరి టీ20లో వెస్టిండీస్‌ చిత్తు
చితకబాదిన కోహ్లి, రాహుల్‌, రోహిత్‌
సిరీస్‌ 2-1తో భారత్‌ వశం

ముంబయి


ఆహా.. ఏమి బ్యాటింగ్‌! వాంఖడే మోతెక్కిపోయింది. ఫోర్లు, సిక్స్‌లు.. ఫోర్లు, సిక్స్‌లు. స్వేచ్ఛగా.. యథేచ్ఛగా బాదుడే బాదుడు. బౌలర్లపై కాస్తయినా కనికరం లేకుండా ఆకాశమే హద్దుగా ఆ ముగ్గురు చెలరేగిపోతుంటే చూసేందుకు అభిమానులకు రెండు కళ్లూ చాల్లేదు. వినోదమే వినోదం.

ఆఖరి దెబ్బ మనదే. కోహ్లి, రాహుల్‌, రోహిత్‌ విధ్వంసక   విన్యాసాలతో పరుగుల వరద పారించిన టీమ్‌ ఇండియా ఆఖరి టీ20లో వెస్టిండీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. బంతితో తేలిపోయిన కరీబియన్‌ జట్టు బ్యాటుతోనూ పోరాడలేకపోయింది.


బ్యాటుతో, బంతితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్‌ బుధవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో 67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. కేఎల్‌ రాహుల్‌ (91; 56 బంతుల్లో 9×4, 4×6), రోహిత్‌ శర్మ (71; 34 బంతుల్లో 6×4, 5×6), విరాట్‌ కోహ్లి (70 నాటౌట్‌; 29 బంతుల్లో 4×4, 7×6) చెలరేగడంతో మొదట భారత్‌ 3 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్‌ 8 వికెట్లకు 173 పరుగులే చేయగలిగింది. దీపక్‌ చాహర్‌ (2/20), షమి (2/25), భువనేశ్వర్‌ (2/41), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/45) విండీస్‌ను దెబ్బతీశారు. పొలార్డ్‌ (68; 39 బంతుల్లో 5×5, 6×6), హెట్‌మయర్‌ (41; 24 బంతుల్లో 1×4, 5×6) మాత్రమే రాణించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-1తో గెలుచుకుంది. రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కగా.. కోహ్లి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును అందుకున్నాడు.

మెరుపులే మెరుపులే..: సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌, వెస్టిండీస్‌లు ఛేదనలోనే నెగ్గాయి. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన విండీస్‌ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన వాంఖడేలో ఎంతటి స్కోరుకైనా గ్యారెంటీ లేదు. కాబట్టి కావాల్సింది చాలా పెద్ద స్కోరే. అలాంటి స్థితిలో కొండంత స్కోరుకు బాట వేసింది రోహిత్‌, రాహుల్‌ జోడీ. కంటి నిండా వినోదాన్ని పంచుతూ ఓ వైపు రోహిత్‌.. ఇంకో వైపు రాహుల్‌ పోటీపోటీగా, కసిగా ఫోర్లు, సిక్స్‌లతో విండీస్‌ బౌలింగ్‌ను ఉతికారేస్తుంటే కిక్కిరిసిన వాంఖడే ఉర్రూతలూగిపోయింది. హర్షాతిరేకాలతో దద్దరిల్లిపోయింది. విండీస్‌ బౌలింగ్‌ దాడిని కాట్రెల్‌ ఆరంభించగా.. రెండో బంతినే ఎక్స్‌ట్రా కవర్‌లో బౌండరీ దాటించడం ద్వారా ఉద్దేశాన్ని చాటి చెప్పాడు రోహిత్‌. అతడి తర్వాతి ఓవర్‌ను సిక్స్‌తో స్వాగతించిన రోహిత్‌.. మరో రెండు ఫోర్లు కూడా బాదాడు. ఈ మధ్యలో హోల్డర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాది దూకుడు మొదలెట్టాడు రాహుల్‌. వీళ్ల జోరుతో పవర్‌ ప్లే ముగిసే సమయానికి భారత్‌ 72/0తో నిలిచింది. పియర్‌ బంతిని మోకాలిపై వంగుతూ రోహిత్‌ అమాంతం స్టాండ్స్‌లోకి పంపిన తీరు అభిమానులను మంత్ర ముగ్దుల్ని చేసింది. విలియమ్స్‌ బౌలింగ్‌లో రాహుల్‌ వరుసగా 4, 6, 4తో అలరించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ షార్ట్‌ బంతిని అతడు అప్పర్‌ కట్‌తో థర్డ్‌మన్‌లో సిక్స్‌గా మలిచిన తీరును చూసితీరాల్సిందే. పియర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ వరుసగా 6, 6, 4 బాదేయడంతో స్కోరు 8వ ఓవర్లోనే వంద దాటింది. ఇద్దరూ జోరు కొనసాగించడంతో 11 ఓవర్లలో భారత్‌ 132/0తో నిలిచింది. కానీ వరుస ఓవర్లలో రోహిత్‌, పంత్‌లను విలియమ్స్‌, పొలార్డ్‌ ఔట్‌ చేయడంతో విండీస్‌ ఊపిరిపీల్చుకుంది. కానీ పెనం మీద నుంచి పోయ్యిలో పడబోతున్నామని ఊహంచలేకపోయింది.

కోహ్లి వీరవిహారం: విండీస్‌ ఆనందాన్ని కాసేపయినా నిలవనీయలేదు విరాట్‌ కోహ్లి. వస్తూనే టాప్‌ గేర్‌లో బ్యాటింగ్‌ ఆరంభించిన అతడు కళ్లు చెదిరే షాట్లతో విధ్వంసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. అప్పటికా దాకా రెచ్చిపోయిన రాహుల్‌ కాస్త శాంతించగా.. కోహ్లి యథేచ్చగా బ్యాట్‌ ఝుళిపించాడు. 21 బంతుల్లోనే అర్ధశతకం చేశాడంటే విరాట్‌ ఎలా విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. వాల్ష్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్స్‌తో మొదలైంది అతడి పరుగుల వరద. వెంటనే హోల్డర్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4తో రెచ్చిపోయాడు. రాహుల్‌ కూడా ఓ సిక్స్‌ బాదడంతో ఆ ఓవర్లో 22 పరుగులొచ్చాయి. ఇద్దరూ చెరో సిక్స్‌ కొట్టడంతో విలియమ్స్‌ వేసిన 18వ ఓవర్లో 17 పరుగులొచ్చాయి. కోహ్లి అదే ఊపులో పొలార్డ్‌పై భీకర దాడి చేశాడు. మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో అతడు వేసిన 19వ ఓవర్లో ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా బేస్‌బాల్‌ తరహా షాట్‌తో ఆ ఓవర్లో అతడు కొట్టిన తొలి సిక్స్‌ అమోఘం. సెంచరీ కోసం నిరీక్షించిన రాహుల్‌ చివరికి దాన్ని అందుకోకుండానే తన అద్భుత ఇన్నింగ్స్‌ను ముగించాడు. కాట్రెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో అతడు నిష్క్రమించగా.. ఆఖరి బంతికి కోహ్లి స్లాగ్‌ స్వీప్‌తో బౌలర్‌ తల మీదుగా బంతిని స్టాండ్స్‌లో పడేసి స్కోరును 240కి చేర్చాడు. కోహ్లి-రాహుల్‌ జోడీ మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించింది.

తడబడిన విండీస్‌: లక్ష్య ఛేదనలో విండీస్‌ ఏ దశలోనూ పోటీలో లేదు. రెండో ఓవర్లో కింగ్‌ను భువనేశ్వర్‌ ఔట్‌ చేయగా.. తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్‌ సిమన్స్‌ను షమి వెనక్కి పంపాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన దీపక్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌తో పూరన్‌ను ఖాతా కూడా తెరవనివ్వలేదు. 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును పొలార్డ్‌, హెట్‌మయర్‌ ఆదుకున్నారు. దీంతో విండీస్‌ 9.2 ఓవర్లలో 91/3తో నిలిచింది. కానీ కుల్‌దీప్‌ మాయ చేశాడు. హెట్‌మయర్‌, హోల్డర్‌ (8)లను అతడు వరుస ఓవర్లలో ఔట్‌ చేయడంతో విండీస్‌ 103/5కు పరిమితమై ఓటమి దిశగా సాగింది. పొలార్డ్‌ దూకుడు కొనసాగించినా సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. చివరి ఆరు ఓవర్లలో 117 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు ఓటమి ఖాయమైపోయింది. భువనేశ్వర్‌ ఓవర్లో పొలార్డ్‌ వరుసగా 6, 4, 4 కొట్టి విండీస్‌ను కాస్త సంతోష పెట్టాడు. కానీ అదే ఓవర్లో అతడు ఔటయ్యాక ఆ జట్టు ఓటమి లాంఛనమే అయింది.


ఒకరిని మించి ఒకరు..

విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌.. ముగ్గురూ ముగ్గురే! ప్రతిభలో ఎవరికి వాళ్లే సాటి! తమదైన రోజు ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రత్యర్థుల్ని పోటీలోనే లేకుండా చేయగల సమర్థులు. మైదానం నలుమూలలా షాట్లతో పరుగుల వరద పారించగల నైపుణ్యం వీరి సొంతం. ఒంటి చేత్తో మ్యాచ్‌ గెలిపించగల సామర్థ్యం ఉన్న ఈ ముగ్గురూ ఒకేసారి చెలరేగితే ఎలా ఉంటుందో బుధవారం చూశారు అభిమానులు. తమ నైపుణ్యాన్నంతా చూపిస్తూ.. శక్తినంతా ప్రయోగిస్తూ కరీబియన్‌ బౌలర్లపై విరుచుకుపడింది ఈ బ్యాటింగ్‌ త్రయం. అభిమానులకు మహదానందాన్ని కలిగిస్తూ అద్భుత బ్యాటింగ్‌ విన్యాసాలతో అలరించింది. ఈ ముగ్గురిలో ఎవరిది మేటి ఇన్నింగ్స్‌.. ఎవరి షాట్లు ఎక్కువ అలరించాయి.. విజయంలో ఎవరి పాత్ర ఎక్కువ అంటే చెప్పడం కష్టమే! ఎవరి శైలిలో వాళ్లు హద్దుల్లేని విధ్వంసం సాగించారు. కోహ్లి మిడ్‌వికెట్‌లో, కవర్స్‌లో కొట్టిన సిక్సర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పర్‌ కట్‌ సహా రాహుల్‌ ఆడిన షాట్లన్నీ చూడముచ్చటైనవే. ఇక సొగసరి రోహిత్‌ ఆడిన షాట్ల నుంచి ఏదో ఒకటి ఎంచుకోవడం అంటే కష్టమే. సిరీస్‌ ఫలితాన్ని నిర్దేశించే మ్యాచ్‌ కావడం, గత రెండు మ్యాచ్‌ల్లోనూ వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోవడం, ఆ జట్టు నిండా హిట్టర్లే ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్‌ స్వర్గధామమైన వాంఖడెలో ఎంత స్కోరైనా సురక్షితం కాదన్న అంచనాతో ఈ ముగ్గురూ ఏ దశలోనూ జోరు తగ్గించకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఎక్కువగా గ్రౌండ్‌ షాట్లే ఆడే కోహ్లి.. పదే పదే సిక్సర్లకే ప్రయత్నించడం.. కేవలం 29 బంతుల్లోనే 70 పరుగులు చేయడం.. భారత్‌ ఈ మ్యాచ్‌కు ఎలాంటి దృక్పథంతో బ్యాటింగ్‌ చేసిందో చెప్పడానికి ఉదాహరణ. భారత ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాలను మినహాయిస్తే పరుగులన్నీ ఈ ముగ్గురివే కావడం.. ముగ్గురూ కలిపి 16 సిక్సర్లు బాదడం.. బౌండరీల ద్వారానే 172 పరుగులు రాబట్టడం విశేషం. ఏదేమైనా జట్టులోని ముగ్గురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అద్భుత బ్యాటింగ్‌ విన్యాసాలకు వేదికగా నిలిచిన ఈ మ్యాచ్‌ అభిమానులకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. 


స్కోరు వివరాలు

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) వాల్ష్‌ (బి) విలియమ్స్‌ 71; రాహుల్‌ (సి) పూరన్‌ (బి) కాట్రెల్‌ 91; రిషబ్‌ పంత్‌ (సి) హోల్డర్‌ (బి) పొలార్డ్‌ 0; విరాట్‌ కోహ్లి నాటౌట్‌ 70; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 240; వికెట్ల పతనం: 1-135, 2-138,  3-233; బౌలింగ్‌: కాట్రెల్‌ 4-0-40-1; హోల్డర్‌ 4-0-54-0; పియర్‌ 2-0-35-0; విలియమ్స్‌ 4-0-37-1; వాల్ష్‌ 4-0-38-0; పొలార్డ్‌ 2-0-33-1.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: సిమన్స్‌ (సి) అయ్యర్‌ (బి) షమి 7; కింగ్‌ (సి) రాహుల్‌ (బి) భువనేశ్వర్‌ 5; హెట్‌మయర్‌ (సి) రాహుల్‌ (బి) కుల్‌దీప్‌ 41; పూరన్‌ (సి) దూబె (బి) చాహర్‌ 0; పొలార్డ్‌ (సి) జడేజా (బి) భువనేశ్వర్‌ 68; హోల్డర్‌ (సి) మనీష్‌ పాండే (బి) కుల్‌దీప్‌ 8; వాల్ష్‌ (బి) షమి 11; పియర్‌ (సి) జడేజా (బి) చాహర్‌ 6; విలియమ్స్‌ నాటౌట్‌ 13; కాట్రెల్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173; వికెట్ల పతనం: 1-12, 2-17, 3-17, 4-91, 5-103, 6-141, 7-152, 8-169; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-20-2; భువనేశ్వర్‌ 4-0-41-2; షమి 4-0-25-2; దూబె 3-0-32-0; కుల్‌దీప్‌ యాదవ్‌ 4-0-45-2; వాషింగ్టన్‌ సుందర్‌ 1-0-5-0.


1 ఓ టీ20 మ్యాచ్‌లో ముగ్గురు బ్యాట్స్‌మన్‌ 70 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి.


1064 భారత్‌లో కోహ్లి టీ20 పరుగులు. స్వదేశంలో వెయ్యికిపైగా పరుగులు చేసిన మూడో క్రికెటర్‌ అతడు. గప్తిల్‌ (1430), కొలిన్‌ మన్రో (1000) ముందున్నారు.


 404  అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌ సిక్సర్లు. 400కు పైగా సిక్సర్లు కొట్టిన భారత తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అత్యధిక సిక్సర్ల రికార్డు గేల్‌ (534) పేరిట ఉంది. అఫ్రిది (476) రెండో స్థానంలో ఉన్నాడు. 


ఆమెకు ఇదే కానుక

‘‘ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. మా వివాహ రెండో వార్షికోత్సవం రోజున మంచి ఇన్నింగ్స్‌ ఆడాను. ఓపెనర్ల ధనాధన్‌ బ్యాటింగ్‌ వల్ల భిన్నమైన ఆట ఆడే అవకాశం నాకు లభించింది. భారీ షాట్‌లు ఆడతాను, మద్దతివ్వాలని రాహుల్‌ను కోరాను. ప్రత్యేక రోజున ప్రత్యేక ఇన్నింగ్స్‌ ఆడాను. అనుష్కకు నా కానుక ఇది’’

- విరాట్‌ కోహ్లి
Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.