close

తాజా వార్తలు

దద్దరిల్లిన దిల్లీ  

పోలీసు కేంద్ర కార్యాలయం వద్ద అర్ధరాత్రి దాటాక వేల మంది ప్రదర్శన
అంతకు ముందు నిరసనల్లో 4 బస్సుల దహనం
జేఎంఐ వర్సిటీ వద్ద ఉద్రిక్తత
60 మందికి గాయాలు
యూపీలోని ఏఎంయూకు పాకిన సెగ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆదివారం చేపట్టిన నిరసనలతో దేశ రాజధాని దద్దరిల్లింది. ఆగ్నేయ దిల్లీలోని న్యూఫ్రెండ్స్‌ కాలనీలో జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులు, స్థానికులు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి, ఉద్రిక్తతకు దారి తీసింది. రాత్రి పొద్దుపోయేవరకు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణల్లో 60 మంది గాయపడ్డారు. ఉదయం నుంచి కొనసాగిన ఘటనల్లో భాగంగా ఆందోళనకారులు తొలుత నాలుగు బస్సులకు నిప్పంటించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేయాల్సి వచ్చింది. ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి జామియానగర్‌ వద్ద పోలీసులు లాఠీలు ఝళిపించి, బాష్పవాయువు ప్రయోగించారు.

శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపై పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించారని విద్యార్థులు ఆరోపించారు. హింసకు తాము కారణం కాదని.. కొందరు స్థానికులే బస్సులకు నిప్పంటించి గందరగోళం సృష్టించారని వారు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్దకు వేలాది మంది చేరుకుని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు.

స్తంభించిపోయిన ట్రాఫిక్‌
హింసాత్మక ఘటనల నేపథ్యంలో మథుర రోడ్‌ సహా జేఎంఐకి దారితీసే మార్గాల్లో వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోయాయి. అటు మెట్రో స్టేషన్ల మూసివేత, ఇటు ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నిరసనకారులు శాంతియుతంగా మెలగాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. హింసకు పాల్పడి జేఎంఐ ప్రాంగణంలో తలదాచుకున్నవారిని గుర్తించడానికంటూ పోలీసులు విశ్వవిద్యాలయంలో ప్రవేశించారు. విద్యాసంస్థలోకి పోలీసులు రావడాన్ని జేఎంఐ వర్గాలు తప్పుపట్టాయి. ఈ ఘటనల్ని నిరసిస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆగ్నేయ దిల్లీలోని పాఠశాలల్ని సోమవారం మూసివేయనున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఏఎంయూలోనూ...
దిల్లీ ఘటనల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లోనూ ఆదివారం రాత్రి పొద్దుపోయాక నిరసనలు ఎగిశాయి. దిల్లీలోని జేఎంఐ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ఏఎంయూ విద్యార్థులు ఘర్షణకు దిగారు. పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. జనవరి 5 వరకు వర్సిటీని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

*  పశ్చిమ బెంగాల్‌లో ‘పౌర’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చోటుచేసుకున్నాయి. ఇవి కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఆక్రా రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు.. టికెట్‌ కౌంటర్‌లోకి దూసుకెళ్లి డబ్బు దోచుకెళ్లారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది.  సీఎం మమతా బెనర్జీ సోమవారం నుంచి స్వయంగా ర్యాలీల్లో పాల్గొననున్నారు. పూర్వ బర్ధమాన్‌ జిల్లాలో ఓ మహిళ(36) ఆత్మహత్య చేసుకున్నారు.

*  గువాహటిలో పోలీసు కాల్పుల్లో మృతిచెందినవారి సంఖ్య నాలుగుకు పెరిగింది. తూటా గాయాలకు చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఒకరు, ఆదివారం ఉదయం మరొకరు మరణించారని అధికారులు తెలిపారు. కర్ఫ్యూను రాత్రుళ్లు కొనసాగిస్తున్నారు.


దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తాం: భాజపా

పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకుగాను దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ప్రకటించారు. ముస్లింలకు వ్యతిరేకంగా చట్టంలో నిబంధనలేవీ లేవని.. ఈ విషయాన్ని తమ పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తారని తెలిపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.