close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గంటలో కరీంనగర్‌.. రెండు గంటల్లో విజయవాడ

హైదరాబాద్‌ నుంచి చేరవచ్చు.. ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
కొండకల్‌ రైల్‌ కోచ్‌ పరిశ్రమ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్‌
మొదటి యూనిట్‌ పూర్తికి 18 నెలల గడువు

శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: దిల్లీ-వారణాసి మధ్య నడిచే వందేభారత్‌ లాంటి హైస్పీడ్‌ రైళ్లు మరిన్ని వస్తే ఇతర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి గంటలో కరీంనగర్‌, రెండు గంటల్లో విజయవాడ, నాలుగు గంటల్లో బెంగళూరు చేరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామ శివారులో మేధా సంస్థ నిర్మించతలపెట్టిన రైల్‌ కోచ్‌ పరిశ్రమకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ 106 ఎకరాల్లో ఏర్పాటవుతుండగా 40 ఎకరాల భూములు కొండకల్‌ పరిధిలో, 66 ఎకరాలు వెల్లిమల గ్రామ పరిధిలో ఉన్నాయి. శంకుస్థాపన సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డ యుగంధర్‌రెడ్డి 1984లో స్థాపించిన మేధా సంస్థ దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం రైలు కోచ్‌లు, లోకోలు తయారు చేసే స్థాయికి ఎదగడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు.

గంటకు 160 కిలో మీటర్ల వేగంతో నడిచే వందే భారత్‌ రైలుకు సిగ్నలింగ్‌, అనేక పరికరాలు తయారు చేసిన సంస్థగా మేధాకు గుర్తింపు ఉందన్నారు. రూ.1,000 కోట్ల పెట్టుబడితో కొండకల్‌లో ఈ పరిశ్రమ రావడంతో ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుందన్నారు. రైల్‌ కోచ్‌ పరిశ్రమలో మొదటి యూనిట్‌ను 15 నుంచి 18 నెలల్లో పూర్తి చేసి ముఖ్యమంత్రితో ప్రారంభిస్తామన్నారు.

ఆరేళ్లలో ఎన్నో నూతన పరిశ్రమలు..
తెలంగాణ ఏర్పడ్డాక గత ఆరేళ్లలో ఎన్నో నూతన పరిశ్రమలు సాధించామని కేటీఆర్‌ పేర్కొన్నారు. స్థానికులకు 50 నుంచి 60 శాతం ఉద్యోగాలుకల్పిస్తే అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేయండి
కాలుష్యం తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తోందని, ఆ దిశగా మేధా సంస్థ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. కోచ్‌ పరిశ్రమ తలపెట్టిన కొండకల్‌, వెలిమల గ్రామాలను ఈ పరిశ్రమ యజమాన్యం సామాజిక బాధ్యతతో దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని సూచించారు. స్థానిక యువతలో నైపుణ్యాల పెంపునకు చేవెళ్ల, మెదక్‌ ఎంపీలు వారి నిధులతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రైల్‌ కోచ్‌ పరిశ్రమ ఎండీ కశ్యపరెడ్డికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు.

జీఓ 111ను సడలించండి: ఎమ్మెల్యే

84 గ్రామాల అభివృద్ధి పాలిట గుదిబండగా మారిన జీఓ 111ను సడలించాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మంత్రి కేటీఆర్‌ను కోరారు. జీఓ 111 కారణంగా అభివృద్ధి నిలిచిపోతోందన్నారు కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి, ఎంపీ  ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.