close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కుర్రకారు.. ఆరంకెల హుషారు

కోడింగ్‌ నైపుణ్యం ఉంటే బీటెక్‌ విద్యార్థులకు కంపెనీల బ్రహ్మరథం
వార్షిక వేతనం రూ. 20-33 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతున్న యువత
పి.బాపనయ్య, మాసిని శ్రీనివాసరావు
ఈనాడు - హైదరాబాద్‌, అమరావతి

అయిదు అంకెల జీతం.. ఒకప్పుడు ఉద్యోగుల గురించి గొప్పగా చెప్పుకునే మాట. ఇప్పుడు పట్టుమని 22 సంవత్సరాలు కూడా లేని కొందరు బీటెక్‌ విద్యార్థులు ప్రారంభంలోనే ఆరు అంకెల వేతనాన్ని అందుకుంటున్నారు. ప్రాంగణ నియామకాల్లో ఘనమైన ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు.  ప్రముఖ ఐఐటీల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న పదుల సంఖ్యలోని విద్యార్థులు ఏకంగా రూ. 20 లక్షల నుంచి రూ. 33 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వారిలో చాలామంది ప్రభుత్వ బడుల్లో చదివిన వారే. ఈ విజయం ఎలా సాధ్యమైంది? తదితర వివరాలతో ప్రత్యేక కథనం.

సాధారణ కుటుంబాలకు చెందిన బీటెక్‌ విద్యార్థులు చదువు పూర్తయ్యిందో లేదో ఐటీ కంపెనీల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫలితంగా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మారిపోనుంది. ప్రొడక్ట్‌ కంపెనీలు కొత్త సాఫ్ట్‌వేర్లను అభివృద్ధి చేస్తాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌, ఐబీఎం లాంటి సంస్థలు అత్యంత ప్రతిభావంతులను గుర్తించి భారీ వేతనాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. రెండు మూడు సంవత్సరాలుగా కోడింగ్‌ సత్తా ఉంటేచాలు ఏ కళాశాల విద్యార్థి అయినా మంచి ఆఫర్లను అందుకుంటున్నారు. పలు కంపెనీలు నిర్వహించే కోడింగ్‌ పోటీలు మెరిట్‌ విద్యార్థులకు ఊతమిస్తున్నాయి.

 

 

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం వెంకటగిరికి చెందిన ఇతడి పేరు రిషికుమార్‌రెడ్డి. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన కుర్రాడు. కష్టపడి ఎంసెట్‌లో 4,200 ర్యాంకు పొందిన రిషి హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కళాశాలలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు. ఇటీవల అమెజాన్‌ సంస్థలో రూ.33 లక్షల వార్షిక వేతన కొలువుకు ఎంపికయ్యాడు. బీటెక్‌ మూడో ఏడాది నుంచే డేటా స్ట్రక్చర్స్‌, అల్గారిథమ్స్‌ను ఉపయోగించి ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌పై సాధన చేయడం ఆ అబ్బాయికి లాభించింది.

తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది!

ఏపీ, తెలంగాణ నుంచి రూ.20 లక్షలు, ఆపైన వార్షిక వేతనంతో ఎంపికైన వారు దాదాపు 250-300 మంది ఉంటారని అంచనా. తెలంగాణలోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతిలోనే 30 మంది, సీబీఐటీలో 20, వాసవిలో 23 మంది, నారాయణమ్మలో 20 మంది వరకు ఎంపికయ్యారు. గోకరాజు రంగరాజులో ముగ్గురు, ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి ఇద్దరు భారీ ప్యాకేజీలను అందుకున్నారు. ఇతర కళాశాలల్లో చదివిన మరికొందరూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి చెందిన కె.సాయి రిష్వంత్‌ రూ.24 లక్షలు, కాట్రగడ్డ రితిక, వెంకటసాయి నిఖిత్‌లు రూ.29.50 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌కు ఎంపికయ్యారు. కేఎల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన భానురేఖ రూ.25 లక్షలతో సర్వీస్‌నౌ కంపెనీలో ఉద్యోగం పొందారు. విశాఖలోని గాయత్రి విద్యా పరిషత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి నలుగురు రూ. 31.25 లక్షల ప్యాకేజీకి, మరొకరు రూ. 28 లక్షల వేతనానికి అమెజాన్‌లో కొలువు సంపాదించారు.

ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లోనూ..
ట్రిపుల్‌ఐటీల్లో చదువుతున్న పేద పిల్లలు కూడా ప్రాంగణ నియామకాల్లో మంచి ప్యాకేజీలను అందుకున్నారు. ఇడుపులపాయ నుంచి ముగ్గురు రూ.28 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగాలు సంపాదించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయేషా, బాలచంద్రారెడ్డి ట్రీపుల్‌ఐటీలకు ఎంపికై ఉత్తమ వేతన కొలువులు సాధించారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీ నుంచి 10 మంది విద్యార్థులు బెంగళూరులోని అనలాగ్‌ డివైజెస్‌కు రూ.20 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యారు. వీరందరూ ప్రభుత్వ బడుల్లో చదివిన పేద కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం.

సగంమంది అమ్మాయిలే
తెలుగు రాష్ట్రాల్లో ఏటా 1.50 లక్షలమంది విద్యార్థులు బీటెక్‌లో చేరుతున్నారు. వారిలో దాదాపు 40 శాతం మంది అమ్మాయిలే. భారీ వేతనంతో ఎంపికవుతున్న వారిలో మాత్రం కనీసం వీరు సగంమంది ఉంటున్నారు. ‘నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కచ్చితత్వంతో ఉంటారు. నిజాయతీగా పనిచేస్తారు. తరచూ ఉద్యోగాలు మారరని పరిశ్రమలు నమ్ముతున్నాయి. అందుకే అమ్మాయిలకు పెద్దపీట వేస్తున్నాయని’ ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు.

ఒక్కసారి కూడా తప్పని వారికే..
ఉద్యోగాల పోటీలో పాల్గొనాలంటే కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. మరికొన్ని ఉత్పత్తి తరహా ప్రముఖ కంపెనీలు 70 శాతం మార్కులు ఉంటేనే రాత పరీక్షలకు, ముఖాముఖీలకు ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉండటంతో ఇంజినీరింగ్‌లో ప్రవేశించిన వారిలో సగంమందికి లోపే ఉద్యోగాలకు పోటీపడేందుకు అర్హత పొందుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, పెగా సిస్టమ్స్‌ లాంటి పలు సంస్థలు మూడో సంవత్సరం వరకు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలని, మూడేళ్లలో ఒక్కసారి కూడా తప్పి ఉండరాదని నిబంధనలు విధిస్తుంటాయి. కనీసం ప్రథమ శ్రేణి మార్కులు సాధిస్తేనే వడపోత పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తాయి.
ముందు ఇంర్న్‌షిప్‌.. తర్వాత కొలువు భారీ వేతన ప్యాకేజీతో ఎంపిక చేసుకుంటున్న కంపెనీలు ఎక్కువ శాతం ఆరు నెలలపాటు ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. పనితీరు గమనించి ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. నెలకు రూ.30 వేల నుంచి రూ.60 వేల వేతనం అందుతుంది. తర్వాత వారికి పూర్తిస్థాయిలో కొలువులు ఇస్తున్నాయి. 70-80 శాతమే ఎంపికవుతారని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. ప్రతిభ ఆధారంగా కొందరిని మాత్రం నేరుగా ఫుల్‌టైమ్‌ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.


అత్యధిక ప్యాకేజీలకు మూడేళ్ల ప్రణాళిక
-వెంకట్‌ కాంచనపల్లి, సన్‌టెక్‌ కార్ఫ్‌ సీఈఓ

బీటెక్‌ నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌లోనే ప్రాంగణ నియామకాలు మొదలవుతాయి. అంటే మొదటి మూడేళ్లే కీలకం. నియామక స్థాయిని బట్టి కంపెనీలు 3 నుంచి 6 రౌండ్ల పరీక్షలు నిర్వహిస్తాయి. మొదటి రౌండు ఆప్టిట్యూడ్‌, ఆంగ్లం, ప్రోగ్రామింగ్‌ మీద జరుపుతారు. రెండో రౌండు నుంచి కోడింగ్‌ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. రాత పరీక్షలు పూర్తయితే ముఖాముఖీలకు షార్ట్‌ లిస్టు చేస్తాయి. ఇంటర్వ్యూవర్‌కి లాజిక్‌ ఎలా ఉందనేది ముఖ్యం. అందుకు ఏ సంవత్సరంలో ఏం నేర్చుకోవాలో ప్రణాళిక వేసుకోవాలి.
మొదటి ఏడాది: ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో సమస్య పరిష్కారశక్తి (ఆప్టిట్యూడ్‌), ఆంగ్లం (వర్బల్‌ ఎబిలిటీ)తోపాటు సీ/జావా/ఫైథాన్‌ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ల్లో ఒక దాంట్లో సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
రెండో ఏడాది: డేటా స్ట్రక్చర్స్‌పై పట్టు సాధించి కోడింగ్‌ సామర్థాయన్ని అభివృద్ధి చేసుకోవాలి. తొలుత సులభమైన ప్రాబ్లెం స్టేట్‌మెంట్లను పరిష్కరించాలి. అవకాశం ఉన్నపుడల్లా కంపెనీలు నిర్వహించే కోడింగ్‌ పోటీల్లో పాల్గొనాలి.
మూడో ఏడాది: సమస్యాత్మకమైన వాటిని పరిష్కరించే స్థాయికి ఎదగాలి. తెలిసిన వారు ఎవరైనా కంపెనీల్లో పనిచేస్తుంటే వారిని మెంటార్‌గా ఎంపిక చేసుకోవాలి. వారి సహకారంతో కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్సెస్‌, మొబైల్‌ అప్లికేషన్లు, క్లౌడ్‌ లాంటి ఏదైనా ఒక డిజిటల్‌ టెక్నాలజీలో ఒకటి రెండు ప్రాజెక్టులు చేయాలి. కోడింగ్‌ సామర్థ్యంతో బయోడేటా తయారు కాగానే ఇంటర్న్‌షిప్‌ల వేట మొదలుపెట్టాలి. గూగుల్‌, గోల్డ్‌మన్‌ శాచె, అడోబ్‌ లాంటి సంస్థలు రెండో సంవత్సరం విద్యార్థులను, మైక్రోసాఫ్ట్‌ లాంటి కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లకు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష స్టైఫండ్‌తో ఎంపిక చేసుకుంటున్నాయి. వారు ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వేతనంతో కొలువు సంపాదిస్తున్నారు.


పెద్ద ప్యాకేజీ రావాలంటే కోడింగ్‌ నైపుణ్యం ఉండాలి
-వెంకట్‌, సంచాలకులు, గాయత్రి విద్యా పరిషత్‌

‘‘ఎక్కువ ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే కోడింగ్‌ నైపుణ్యాలు ఉండాలి. కోడింగ్‌లో రెండురకాల ప్రశ్నలు ఉంటాయి. మొదటి విడతలో నార్మల్‌ కోడింగ్‌, రెండో విడతలో అడ్వాన్స్‌డ్‌ కోడింగ్‌ ఉంటాయి. అడ్వాన్స్‌డ్‌ క్వాంట్‌, రీజనింగ్‌, లాజిక్‌పై ప్రశ్నలు చేయగలిగేవారే పరీక్షల్లో రాణిస్తారు. టెక్నికల్‌ ఇంటర్వ్యూలో డిజిటల్‌ టెక్నాలజీపైనా ప్రశ్నలు ఉంటాయి. మూడో సెమిస్టర్‌ నుంచే ప్రొగ్రామింగ్‌, అడ్వాన్స్‌డ్‌ డేటా స్ట్రక్చర్స్‌పై విద్యార్థులు దృష్టిపెట్టాలి. జావా, పైథాన్‌, సీ,  సీ++ ప్రొగ్రామింగ్‌పై పట్టుండాలి. సాధారణ పరీక్షలకు చదివినట్లు ప్రాక్టీస్‌ చేస్తే సరిపోదు.’’ 


అమ్మకు సొంతూరులో ఇల్లు కట్టిస్తా
- ఆళ్ల లిఖితారెడ్డి, హైదరాబాద్‌

నాన్న చిన్నప్పుడే చనిపోయారు. సొంతూరు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం. అమ్మ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రూ.11 వేల వేతనంతో పనిచేస్తూ నన్ను, నా తమ్ముడిని చదివిస్తోంది. వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఐటీ బ్రాంచి చదువుతూ రూ. 25 లక్షల వార్షిక వేతనంతో అమెజాన్‌ సంస్థకు ఎంపికయ్యాను. నా వేతనంతో అమ్మకు సొంతూరులో ఇల్లు కట్టించాలని నా కోరిక. కొలువుకు ఎంపికయ్యానని అమ్మకు చెప్పినప్పుడు ఎంతో సంతోషించింది. ఇంజినీరింగ్‌లో చేరిన నాటినుంచి కోడింగ్‌ ఇష్టం. 

తమ్ముడిని చదివిస్తా
- కాసా లిఖితారెడ్డి, హైదరాబాద్‌

వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతిలో బీటెక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ చదువుతున్నా. నాన్న ఓ కార్ల బాడీ తయారీ పరిశ్రమలో పనిచేస్తారు. మధ్య తరగతి కుటుంబం మాది. మొదట డెలాయిట్‌లో రూ. 7.60 లక్షల ప్యాకేజీతో ఎంపికయ్యాను. నేను అంతకూడా ఆశించలేదు. తర్వాత అమెజాన్‌కు పరీక్షలు రాసి ఏకంగా రూ.24 లక్షల వేతనానికి ఎంపికయ్యాను. అమ్మా, నాన్న చాలా సంతోషించారు.తమ్ముడు ఏడో తరగతి చదువుతున్నాడు. వాడిని మొత్తం నా జీతంతోనే చదివిస్తా.

నాన్నది కిరాణాకొట్టు..
-చెన్నై గోపికృష్ణ, అనిల్‌ నీరుకొండ ఇంజినీరింగ్‌ కళాశాల, విశాఖపట్నం

‘‘విశాఖలో చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ నాన్న మమ్మల్ని చదివించారు. కుటుంబం ఆర్థికంగా స్థిరపడేందుకు మంచి ఉద్యోగం సాధించాలని కష్టపడ్డాను. కళాశాలలోనే అత్యధిక ప్యాకేజీ రూ. 29.50 లక్షలతో ఉద్యోగం లభించింది. గ్రంథాలయంలోనే ఎక్కువ గడిపేవాడిని. వేసవి సెలవుల్లో కంప్యూటర్‌ నేర్చుకునేవాడిని. ప్రొగ్రామ్‌ ల్యాంగేజ్‌పై అవగాహన ఉంటే మంచి ఉద్యోగం సాధించేందుకు అవకాశం ఉంటుంది’’ 

రూ.7 లక్షలు చాలనుకుంటే రూ.31.25 లక్షలు
- ఆతీ నాగ సాయి ఆదిత్య, గాయత్రి విద్య పరిషత్‌ కళాశాల, విశాఖపట్నం

‘‘మా సీనియర్‌కు గూగుల్‌లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అదే నాలో స్ఫూర్తి కలిగించింది. అందుకే సీఎస్‌ఈ కోర్సులో చేరా. తొలిసారి నియామక ప్రక్రియలో విజయం సాధించలేదు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ నిర్వహించిన ముఖాముఖిలో తిరస్కరణకు గురికావడం ఎంతో బాధించింది. అయినప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అమెజాన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా రూ. 31.25 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యా. కనీసం రూ. 7 లక్షల ప్యాకేజీ వస్తే చాలనుకున్నా.. కాని భారీ ప్యాకేజీ దక్కింది’’
ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు