కరోనాపై ఉద్ధృత పోరు

ప్రధానాంశాలు

కరోనాపై ఉద్ధృత పోరు

కరోనా కట్టడికి అఖిలపక్ష సమావేశాలు నిర్వహించండి
                          
అందరి సలహాలతో కార్యాచరణ                                
 11-14 తేదీల మధ్య టీకా ఉత్సవం

 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌
  మైక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్లపై ప్రత్యేక దృష్టి అవసరం
 గవర్నర్లు, ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచనలు

ఈనాడు, దిల్లీ: కరోనా నియంత్రణకు రాష్ట్రాల్లోని గవర్నర్లు, ముఖ్యమంత్రులు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అందరి సలహాలు, సూచనలు స్వీకరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తదనుగుణంగా మహమ్మారి కట్టడికి వ్యూహాలు రచించాలన్నారు. గత ఏడాదితో పోల్చితే ఇప్పుడు మన దగ్గర అపార అనుభవం, వనరులు ఉన్నాయని... నిర్లక్ష్యాన్ని వీడి, యుద్ధప్రాతిపదికన గట్టి చర్యలు చేపడితే కొవిడ్‌ నియంత్రణ పెద్ద పనేమీకాదన్నారు. పరీక్షల సంఖ్యను పెంచాలని, రాత్రిపూట విధించే కర్ఫ్యూలకు ‘కరోనా కర్ఫ్యూ’గా నామకరణం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈనెల 11-14 తేదీల మధ్య వ్యాక్సిన్‌ ఉత్సవం నిర్వహించి, అర్హులందరికీ టీకాలు అందించాలన్నారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి ముఖ్యమంత్రులతో వీడియో ద్వారా మాట్లాడారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి చాలా ఆందోళనకరంగా ఉంది. మహమ్మారిపై ఏడాదిగా పోరాడుతూ వ్యవస్థ అలసిపోయి ఉండొచ్చు. కొన్నిచోట్ల నిర్లక్ష్యం తలెత్తి ఉండొచ్చు. ప్రజల్లోనూ ఉదాసీనత పెరిగింది. ఈ లోపాలను యుద్ధప్రాతిపదికన అధిగమించాలి. మొదటిసారి కంటే ఇప్పుడు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. వృద్ధిరేటు చాలా వేగంగా ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఈసారి కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళనకరం. గత ఏడాది మనదగ్గర ల్యాబ్‌లు లేవు. మాస్కులు, పీపీఈ కిట్లు ఎక్కడ దొరుకుతాయో తెలియని పరిస్థితి ఉండేది. లాక్‌డౌన్‌ విధించి, వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. 10 లక్షల మేర ఉన్న క్రియాశీల కేసులను 1.5 లక్షలకు తగ్గించాం. ఇప్పుడు మనకు అనుభవం, సాధన సంపత్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి... కేసుల సంఖ్యను వేగంగా తగ్గించవచ్చు. మైక్రో-కంటెయిన్‌మెంట్‌ జోన్లపైనా ఎక్కువ దృష్టి సారించాలి. ‘కరోనా కర్ఫ్యూ’ పేరుతో రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేస్తే... ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. కరోనా రాత్రికే వస్తుందా? అని కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూని పాటిస్తున్నారు. దానివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి.

నిర్లక్ష్యమే కొంప ముంచుతోంది...
పరీక్షించడం, గుర్తించడం, చికిత్స అందించడం (టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌)తో పాటు... ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలి. ఇప్పుడు చాలామంది బాధితుల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించడం లేదు. దీంతో వారు సాధారణంగానే తిరుగుతున్నారు. దీనికి నిర్లక్ష్యం కూడా తోడవ్వడంతో... వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. పరీక్షలను పెంచడం ద్వారా... వైరస్‌ సోకి ప్రాథమిక దశలో ఉన్నవారిని గుర్తించడం వీలవుతుంది. తద్వారా కుటుంబాలను రక్షించుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 5% దిగువకు తెచ్చేలా ముమ్మరంగా పరీక్షలు చేపట్టాలి.

సంఖ్యతో ఆందోళన చెందొద్దు...
కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల పనితీరు బాగాలేదని, మిగతావాటి పనితీరు బాగుందనే భావన వద్దు.  సంఖ్య పెరుగుతోందని ఆందోళన చెందవద్దు. టెస్టింగ్‌ వల్ల కేసుల సంఖ్య పెరిగితే పెరగనివ్వండి. అవి బయటపడినప్పుడే ఏం చేయాలన్నది మనకు తెలుస్తుంది. 70% ఆర్టీపీసీఆర్‌ పరీక్షలే చేపట్టాలి. నమూనాలను పైపైన సేకరిస్తే ఫలితాలు ఎక్కువగా నెగెటివ్‌ వస్తాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. కొన్ని ల్యాబ్‌లు అన్నీ నెగెటివ్‌ ఫలితాలను ఇస్తుంటే, మరికొన్ని పాజిటివ్‌ ఫలితాలను ఇస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటివాటిపై దృష్టిపెట్టి పరిస్థితులను సరిదిద్దాలి. అవసరమైతే ల్యాబ్‌లను షిఫ్టులవారీగా నిర్వహించాలి. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో అందరికీ పరీక్షలు చేయాలి. జోన్ల సరిహద్దులను ఉజ్జాయింపుగా కాకుండా, చాలా స్పష్టంగా నిర్ణయించాలి. చాలా రాష్ట్రాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ బృందాలను ఏర్పాటుచేశారు. వాటి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ జారీచేసిన ఎస్‌వోపీలను కచ్చితంగా అమలుచేయాలి.
మరణాలను లోతుగా విశ్లేషించాలి...
మరణాలను కనిష్ఠ స్థాయిలో ఉంచేందుకు ప్రయత్నించాలి. ఏస్థాయిలో వైరస్‌ సోకింది? ఆసుపత్రిలో ఎప్పుడు చేరారు? ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? అన్న వివరాలను లోతుగా విశ్లేషించాలి. దిల్లీ ఎయిమ్స్‌ మంగళ, శుక్రవారాల్లో వెబినార్‌ నిర్వహిస్తోంది.  అన్ని రాష్ట్రాల ఆసుపత్రులూ దాంతో అనుసంధానమై చికిత్స ప్రొటోకాల్స్‌ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
* అంబులెన్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ లభ్యతపై నిరంతరం సమీక్షించాలి.
* ఒకేరోజు 40 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశాం. ప్రపంచ దేశాల్లో అనుసరిస్తున్న ప్రొటోకాల్‌నే మనమూ అనుసరిస్తున్నాం. కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి, ప్రస్తుత టీకాల తయారీ పెంపునకు కసరత్తు చేస్తున్నాం. టీకాలను వృథా కానివ్వొద్దు.
* ఎక్కువ కేసులున్న జిల్లాల్లో 45 ఏళ్లు దాటిన వారందరికీ 100% వ్యాక్సిన్‌ అందించాలి.
* ఈనెల 11న జ్యోతిబాఫూలే,  14న డా.బీఆర్‌ అంబేడ్కర్‌ల జయంతి. ఆ తేదీల మధ్య రాష్ట్రాల్లో టీకా ఉత్సవం నిర్వహించాలి.
* మాస్కులు ధరించడం, సురక్షిత దూరం పాటించడం వంటి జాగ్రత్తలను యువత పాటిస్తే... వారి దగ్గరకు కరోనా రాదు. కేసుల సంఖ్య కూడా తగ్గుతుంది. డిజిటల్‌ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజలకు టీకా అందిస్తోంది. దాన్ని ఉపయోగించుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారికి యువత సాయం అందించాలి. నగరాల్లోని పేదలు, వృద్ధులు, మురికివాడల వారిని వ్యాక్సిన్లు వేసేచోటుకు తీసుకురావాలి. ఇది పుణ్యకార్యం. టీకా వేయించుకున్న తర్వాత కూడా మాస్కు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. సమాజాన్ని జాగృతపరిచేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు, మతపెద్దల సేవలను ఉపయోగించుకోవాలి.


గవర్నర్‌, ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి...

గవర్నర్‌, ముఖ్యమంత్రుల ఆధ్వర్యాన రాష్ట్రాల్లో అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటుచేసి, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. వీడియో ద్వారా వారు గ్రామీణ, పట్టణ ప్రజాప్రతినిధులతో పాటు, చట్టసభల సభాపక్ష నాయకులతోనూ మాట్లాడాలి. వైరస్‌ నియంత్రణకు అందరూ కలిసి పనిచేయాలని సూచించాలి. సీఎంలకు చాలా పనులుంటాయి. కాబట్టి గవర్నర్ల నేతృత్వంలో వెబినార్‌ నిర్వహించండి. పౌరసమాజ ప్రతినిధులు, సెలెబ్రిటీలు, కళాకారులు, క్రీడాకారులతో ఒక్కోసారి ఒక్కో వెబినార్‌ నిర్వహించి అందరి సేవలనూ ఉపయోగించుకోండి. రాజకీయాలను పక్కనపెట్టి, ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ కఠిన సమయంలో ప్రజలకు సేవచేసే బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు’’ అని మోదీ పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని