close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
30 వరకు రాత్రి కర్ఫ్యూ

రాత్రి 9 - ఉదయం 5 గంటల మధ్య నిషేధాజ్ఞలు
  అత్యవసర సేవలకు మినహాయింపు
  దుకాణాలు, బార్లు రాత్రి 8 వరకే
  తెలంగాణ సర్కారు ఉత్తర్వుల జారీ
  సినిమాహాళ్ల స్వచ్ఛంద బంద్‌కు యాజమాన్యాల నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఈనెల 30 వరకు కొనసాగనుంది. వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లకు రాత్రి 8 వరకే అనుమతి ఉంటుందని.. ఆ తర్వాత వాటిని తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, రోగనిర్ధారణ కేంద్రాలు, ప్రయోగశాలలతో పాటు అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. మీడియా, పెట్రోలు బంక్‌లు, ఐటీ సేవలకు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. కోల్డ్‌ స్టోరేజ్‌లు, విద్యుత్‌ సేవల వంటివి యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. స్థానిక, అంతరరాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. ప్రయాణాలకు ఎలాంటి ప్రత్యేకమైన పాసులు అవసరం లేదని పేర్కొంది. మే 1 తర్వాత పరిస్థితులను సమీక్షించి కర్ఫ్యూపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.

వీటికి మినహాయింపు
ఆసుపత్రులు, మందుల దుకాణాలు, రోగనిర్ధారణ కేంద్రాలు, ప్రయోగశాలలు, నిత్యావసర సరకుల దుకాణాలు, ఔషధాల రవాణా ఇతర అత్యవసర సేవలు, పెట్రోలు బంకులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్‌ పంపులు, విద్యుత్‌ సరఫరా సేవలు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా, టెలికాం, ఇంటర్నెట్‌ సేవలు, కోల్డ్‌ స్టోరేజీలు, గోదాంలు యథాతథంగా ఉంటాయి. ఐటీతో పాటు ఐటీ అనుబంధ సేవలకు, ఈ కామర్స్‌ యాప్స్‌ ద్వారా జరిగే ఆహార పదార్థాల పంపిణీ, ప్రైవేట్‌ సెక్యూరిటీ సర్వీసు, నిరంతరం పనిచేసే ప్రొడక్షన్‌ యూనిట్లకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది.
ప్రయాణికులు టికెట్‌ చూపిస్తే సరి
* రాష్ట్రాల మధ్య ప్రయాణాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్ల నుంచి ఇళ్లకు చేరుకునే ప్రయాణికులు, ఇళ్ల నుంచి బస్‌, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులు విధిగా టికెట్‌ చూపించాలి.
* డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్‌, ఇతర ఆస్పత్రి సిబ్బంది, గర్భిణులు, వైద్యసహాయం తప్పనిసరిగా అవసరమైన రోగులకు, బ్రాడ్‌ కాస్టింగ్‌, కేబుల్‌ సేవలకు మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
* ఇతర రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలో జిల్లాల మధ్య అన్ని రకాల వస్తువుల రవాణా, వేరే రాష్ట్రాలకు వెళ్లే సరకు రవాణా వాహనాలకు పాసులు అవసరం లేదు.
గుర్తింపు కార్డులు చూపాల్సిందే
* కర్ఫ్యూ వేళ పౌరులు బయట తిరగడం నిషేధం.
* మినహాయింపునిచ్చిన సంస్థల్లో పనిచేసేవారు, ప్రభుత్వాధికారులు, పుర, పంచాయతీ ఉద్యోగులు తప్పక గుర్తింపు కార్డును చూపి రాకపోకలు సాగించవచ్చు.
* అనుమతించిన సేవల్లో ఉన్నవారు రాత్రిపూట ప్రజా రవాణా వాహనాలు, ఆటోలు, ప్రైవేటు ట్యాక్సీలు వాడుకోవచ్చు.
రాత్రి 8 వరకే థియేటర్లు
ఈనెల 30 వరకు కర్ఫ్యూ దృష్ట్యా సినిమా థియేటర్లను రాత్రి 8 గంటల లోపు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మల్టీప్లెక్స్‌లలో సినిమా సినిమాకు వేర్వేరు సమయాల్లో విరామం ఉండేలా చూసుకోవాలి’ అని ఉత్తర్వులు జారీచేసింది. అయితే ‘వకీల్‌సాబ్‌’ సినిమా ఆడుతున్న థియేటర్లు తప్ప మిగతా అన్ని సినిమాహాళ్లనూ బుధవారం నుంచి స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు థియేటర్‌ యాజమాన్యాల సంఘం ప్రకటించింది.
దురుసుగా ప్రవర్తించకండి: డీజీపీ ఆదేశాలు
కరోనా కట్టడిలో భాగంగా రాత్రి కర్ఫ్యూను పటిష్ఠంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో ప్రజలతో ఎంతమాత్రం దురుసుగా ప్రవర్తించవద్దని అధికారులు, సిబ్బందికి హితవు పలికారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. దుకాణాలు, వ్యాపార సంస్థలను రాత్రి 8 గంటలకల్లా మూసివేసేలా చూడాలన్నారు. సరకు రవాణా వాహనాలను ఆపకూడదని తెలిపారు. కర్ఫ్యూపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేయాలని డీజీపీ పిలుపునిచ్చారు. ఇందుకోసం వివిధ సంఘాలు, సంస్థలకు చెందిన ప్రముఖుల సహకారం తీసుకోవాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు గోవింద్‌సింగ్‌, జితేందర్‌, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్‌ రవీంద్ర, రాజేష్‌కుమార్‌, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు