కొవిడ్‌ దృష్ట్యా..అర్హులైన ఖైదీలను విడుదల చేయండి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ దృష్ట్యా..అర్హులైన ఖైదీలను విడుదల చేయండి

సుప్రీంకోర్టు ఆదేశం
జైళ్లలో రద్దీ తగ్గించాలంటూ ఉత్తర్వులు
ఈనాడు - దిల్లీ

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గేలా చూడాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బెయిల్‌, పెరోల్‌ రద్దు చేసిన వారితో పాటు.. బెయిల్‌, పెరోల్‌కు అర్హత ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. మరో 90 రోజుల పాటు వారికి బెయిల్‌, పెరోల్‌ ఇవ్వాలని.. ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో అవసరమైతేనే అరెస్టులు చేయాలని స్పష్టం చేసింది.

హైపవర్డ్‌ కమిటీల సిఫార్సుల ఆధారంగా..
కరోనా నేపథ్యంలో జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించుకోవాలని గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హైపవర్డ్‌ కమిటీలను ఏర్పాటు చేశాయి. వాటి సిఫార్సుల ఆధారంగా ఖైదీలను విడుదల చేశాయి. కాగా ఆ కమిటీల ఆదేశాలను మరోసారి పరిశీలించి వెంటనే అర్హులైనవారిని విడుదల చేయాలని తాజా ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. గతేడాది హైపవర్డ్‌ కమిటీలు ఏర్పాటు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తక్షణమే వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ‘‘గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సాధ్యమైనంత వరకు అరెస్టులను తగ్గించాలి. ఖైదీల విడుదలలో జాతీయ న్యాయ సేవాసంస్థ (నల్సా) రూపొందించిన మార్గదర్శకాలను పాటించాలి. అత్యవసర, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే గుర్తించి విడుదల చేయాలి. కరోనాపై మహమ్మారిపై పోరులో పారదర్శకత ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. దిల్లీ జైళ్లలో ఖైదీల సంఖ్యను వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేస్తుండటం మా దృష్టికి వచ్చింది. ఆ విధానాన్ని ఇతర రాష్ట్రాలూ అనుసరించాలి. హైపవర్డ్‌ కమిటీలు తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టుల వెబ్‌సైట్‌లలో ఉంచాలి. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు ఉన్నందున.. విడుదలైన ఖైదీలను స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన రవాణా వసతి కల్పించాలి. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీలతో పాటు జైలు సిబ్బందికి క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు చేయాలి. సిబ్బందికి, ఖైదీలకు అవసరమైన చికిత్స అందే ఏర్పాటు చేయాలి. జైళ్లలో పరిశుభ్రతను పాటించాలి. అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకొని ఖైదీల్లో కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలి. కరోనా భయంతో కొందరు ఖైదీలు వారి సామాజిక స్థితిగతుల ఆధారంగా జైళ్ల నుంచి వెళ్లడానికి సుముఖత చూపకపోవచ్చు. అలాంటి వారి అభ్యర్థనను జైలు సిబ్బంది పరిగణనలోకి తీసుకోవాలి. జైళ్లలో అవసరమైనవారికి తగిన వైద్య సదుపాయం అందేలా చూడాలి’’ అని ఉత్తర్వుల్లో ధర్మాసనం పేర్కొంది.

అనవసర అరెస్టులొద్దు..
పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత సర్వోన్నత న్యాయస్థానానికి ఉందంటూ.. పలు అంశాలను ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలీసు అధికారులు నిందితులను అనవసరంగా అరెస్ట్‌ చేయకూడదని, మేజిస్ట్రేట్లు దాన్ని ఉదాశీనంగా అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఈమేరకు పోలీసు అధికారి ఎవరైనా నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి మెజిస్ట్రేట్‌ అనుమతి కోరేటప్పుడు, ఆ వ్యక్తి అరెస్ట్‌కు గల కారణాలు, విషయాలను వెల్లడిస్తూ చెక్‌లిస్ట్‌ను కోర్టుకు సమర్పించాలి. మేజిస్ట్రేట్‌ నిబంధనల ప్రకారం పోలీసులు అందించిన నివేదికను పరిశీలించాలి. అది సంతృప్తికరంగా ఉంటేనే నిందితుడిని కస్టడీకి ఆదేశించాలి.

*ఎవరైనా నిందితుడిని అరెస్ట్‌ చేయకూడదని నిర్ణయిస్తే కేసు నమోదైన రెండు వారాల్లోపు ఆ నిర్ణయాన్ని మేజిస్ట్రేట్‌కు నివేదించాలి. ఈ కాలపరిమితిని జిల్లా ఎస్పీ ద్వారా పొడిగించవచ్చు. అయితే అందుకు కారణాలను లిఖిత పూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది. కేసు నమోదు చేసిన రెండు వారాల్లోపు నిందితుడి హాజరు కోసం నోటీసు జారీచేయాలి. నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన పోలీసు అధికారులు శాఖాపరమైన, హైకోర్టులు చేపట్టే కోర్టు ధిక్కరణ చర్యలకు బాధ్యులవుతారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు