వందశాతం జల విద్యుదుత్పత్తి

ప్రధానాంశాలు

వందశాతం జల విద్యుదుత్పత్తి

జెన్‌కోకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
కృష్ణా జలాలే ఇందుకు కీలకం..
ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో ఉత్పత్తి ఆపాలని ఇప్పటికే కృష్ణా బోర్డు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: నదీ జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో వంద శాతం ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ‘విద్యుదుత్పత్తి సంస్థ’(జెన్‌కో)ను ఆదేశిస్తూ ఇంధన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నదుల నుంచి నీటిని ఎత్తిపోస్తే తప్ప రాష్ట్ర రైతుల ఆకాంక్షలు నెరవేరవని, ఎత్తిపోతలకు భారీగా విద్యుత్‌ అవసరమని ఈ ఉత్తర్వుల్లో తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు సాధారణ పరిపాలన శాఖ రాసిన లేఖతో ఇంధనశాఖ ఈ ఆదేశాలు జారీచేసింది. సాధారణంగా విద్యుదుత్పత్తి పెంపు లేదా తగ్గింపు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. జెన్‌కోనే ఈ వ్యవహారాన్ని చూసుకుంటుంది. అయితే, శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తికి కృష్ణా జలాలను తెలంగాణ అధికంగా వినియోగిస్తోందని ఏపీ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేయడం.. ఉత్పత్తి ఆపాలని ఇటీవల బోర్డు తెలంగాణ జెన్‌కోకు లేఖ రాసిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జెన్‌కోకు జారీచేసిన ఆదేశాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

కృష్ణా నదిపైనే ఎక్కువ...

రాష్ట్రంలో అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం దాదాపు 2500 మెగావాట్లు ఉందని ఇంధన శాఖ తెలిపింది. ఇందులో కృష్ణా నదిపైనే 2,369 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న కేంద్రాలున్నాయి. వీటిలో శ్రీశైలం 900, నాగార్జునసాగర్‌లోని 815.6 మెగావాట్ల కేంద్రాలే కీలకం. మొత్తం అన్ని కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తే రోజుకు గరిష్ఠంగా 50 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) జల విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి జెన్‌కో ఆధ్వర్యంలో ఒకసారి రోజుకు గరిష్ఠంగా 50 ఎంయూల జల విద్యుదుత్పత్తి తెలంగాణ విద్యుత్కేంద్రాల్లో జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణాలో అధికంగా వరదలు వచ్చినప్పుడు ఒకటి, రెండు సార్లు 40 నుంచి 44 ఎంయూల జల విద్యుదుత్పత్తి జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో 50 ఎంయూల ఉత్పత్తి జరిగే అవకాశాలున్నాయి.

ఏపీ ఫిర్యాదుతో..
శ్రీశైలం ఎడమగట్టు వద్ద గల తెలంగాణ జల విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తికి అధికంగా నీటిని వాడుకుంటున్నారని ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ ఈ నెల 23న కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 8.98 టీఎంసీల వరద నీరు వస్తుంటే అందులో 34 శాతం విద్యుదుత్పత్తికి తెలంగాణ వాడుతోందని ఆ ఫిర్యాదులో తెలిపారు. నీటిమట్టం 854 అడుగులకు పెరిగేదాకా విద్యుదుత్పత్తికి నీటిని వాడుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని ఏపీ కోరింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం విద్యుత్కేంద్రంలో ఉత్పత్తిని తక్షణం నిలిపివేయాలని, నీటి విడుదలపై తాము ఇచ్చే ఆదేశాలను పాటించాలని కృష్ణా బోర్డు తెలంగాణ జెన్‌కోకు రాసిన లేఖలో సూచించింది. మరోవైపు అన్ని జల విద్యుత్కేంద్రాల్లో వంద శాతం విద్యుదుత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జెన్‌కోకు తాజాగా ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని