ఆచార్య శివారెడ్డికి దాశరథి పురస్కారం
close

ప్రధానాంశాలు

ఆచార్య శివారెడ్డికి దాశరథి పురస్కారం

నేడు ప్రదానం... సీఎం అభినందనలు

ఈనాడు, హైదరాబాద్‌, రవీంద్రభారతి, న్యూస్‌టుడే: దాశరథి కృష్ణమాచార్య-2021 పురస్కారానికి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సాహితీ రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని ప్రభుత్వపరంగా గుర్తించి పురస్కారంతో పాటు రూ.1,01,116 నగదును ఇస్తున్నామన్నారు. రవీంద్రభారతిలో గురువారం నిర్వహించే దాశరథి జయంత్యుత్సవాల్లో దీన్ని ప్రదానం చేస్తామన్నారు.

దాశరథికి సీఎం నివాళులు

దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనకు నివాళులర్పించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే దాశరథి స్ఫూర్తితో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. గజల్‌ రుబాయీల వంటి ఉర్దూ, పార్శీ సాహిత్య సంప్రదాయాలను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టి తెలంగాణ గంగాజమునా తెహజీబ్‌కు వారథి కట్టిన అక్షరసారథి అని కొనియాడారు. దాశరథి సాహితీ పురస్కారం ద్వారా ఏటా తెలంగాణ సాహితీమూర్తులను సత్కరించుకుంటున్నామని సీఎం గుర్తుచేశారు. ఈ ఏడాది పురస్కారానికి ఎంపికైన ఆచార్య శివారెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు.

విశేష సాహితీ సేవకుడు ఎల్లూరి

ప్రముఖ సాహితీవేత్త, కవి, విమర్శకులు, పరిశోధకులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 1945 ఏప్రిల్‌ 7న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కాలూరు గ్రామంలో నర్సమ్మ, మంతారెడ్డి దంపతులకు జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగులో బంగారు పతకాన్ని సాధించారు. సంస్కృతంలో ఎంఏ, తెలుగులో పీహెచ్‌డీ చేశారు. శివారెడ్డి పీహెచ్‌డీ పరిశోధన గ్రంథం ‘ఆంధ్ర మహాభారతంలో రస పోషణము’ పరిశోధకులకు, సిద్ధాంత, వ్యాసరచనలకు ఆదర్శంగా ఉంది.

ఎన్నో బాధ్యతలు... పురస్కారాలు

ఆచార్య శివారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతిగా రెండు పర్యాయాలు (1996-98, 2000-2002) పనిచేశారు. ఉస్మానియా వర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (తెలుగు శాఖ) ఛైర్మన్‌గా, దేశంలోని వివిధ వర్సిటీల బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో సభ్యులుగా వ్యవహరించారు.

ఆంధ్రప్రదేశ్‌ నంది ఫిలిం అవార్డుల కమిటీ (1999) జ్యూరీ సభ్యులుగా, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల కమిటీలో (1999-2001)సభ్యులుగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అయిదో ప్రపంచ మహాసభల ప్రత్యేక సంచికకు సంపాదకత్వం వహించారు. 2015-16లో తెలంగాణ దాశరథి కృష్ణమాచార్య పురస్కారాల కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జీవితం సాహిత్యం (1972) పుస్తకానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం, ‘పూలకారు’(1998)కు స్వర్ణ సాహితీ పురస్కారం, రసమయి సంస్థ ద్వారా సురవరం సాహితీ పురస్కారాలను అందుకున్నారు.


దాశరథి ఆవేశం చింతనిప్పు లాంటిది

దాశరథితో మంచి పరిచయం ఉంది. సుమారు పది, పదిహేను సార్లు ఆయనతో కలిసి వేదికలను పంచుకున్నా. ఆయన ప్రసంగాలు విన్నా. దాశరథి పద్య కవిత్వం నాకెంతో ఇష్టం. అందులో చింతనిప్పులాంటి ఆవేశం ఉంటుంది. నాకు ఇష్టమైన కవులు దాశరథి, సినారె. తెలంగాణ ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిన కవి దాశరథి. లలిత గీతాల్లో ఆయనది ప్రత్యేక ముద్ర. నన్నీ పురస్కారానికి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పురస్కార కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు.

- ఆచార్య ఎల్లూరి శివారెడ్డిTags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని