ఆరుగురు అధికారులకు ఆర్నెల్ల జైలు

ప్రధానాంశాలు

ఆరుగురు అధికారులకు ఆర్నెల్ల జైలు

 కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు

ఇందులో ఐఏఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లు కూడా..

ఈనాడు, హైదరాబాద్‌: కోర్టు ధిక్కరణ కింద ఇద్దరు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌లతో సహా ఆరుగురు అధికారులకు ఆర్నెల్ల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇందులో ఐఏఎస్‌ అధికారులు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతకుమారి, రంగారెడ్డి కలెక్టర్‌ డి.అమోయ్‌ కుమార్‌; ఐఎఫ్‌ఎస్‌ అధికారులైన పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, రంగారెడ్డి జిల్లా సీసీఎఫ్‌ సునితతో పాటు అదనపు కలెక్టర్‌, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ అధికారి ఎస్‌.తిరుపతిరావు, రంగారెడ్డి జిల్లా అటవీ అధికారి జానకిరాం ఉన్నారు.

ఇదీ నేపథ్యం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని సర్వే నం.222/1 నుంచి 222/20 వరకు ఉన్న 383 ఎకరాల భూమిని రిజర్వు ఫారెస్ట్‌గా మార్చాలన్న ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని, ఆ భూమిని మినహాయించాలంటూ 2008 జనవరిలో ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ అధికారి.. రంగారెడ్డి కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ భూమి యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా భూమిని వారికి అప్పగించాలంటూ 2009 డిసెంబరులో న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని అమలు చేయలేదని మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ మరో 9 మంది కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ విచారణ చేపట్టారు.

కౌంటరులో భూసేకరణ ప్రతిపాదన ఉందిగా?

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ... ‘‘జులై 22న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతకుమారి, జిల్లా అటవీ అధికారి వ్యక్తిగతంగా హాజరయ్యారు. వారి కౌంటరులో భూసేకరణ ప్రతిపాదనలను అంగీకరించడంతోపాటు పరిహారం కింద రూ.1.14 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు’’ అని వివరించారు. 2009లో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవడంగానీ, పరిహారం చెల్లించడంగానీ చేయలేదని, ఇది కోర్టు ధిక్కరణ కింద శిక్షార్హమేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కోర్టు ధిక్కరణ కింద ప్రతివాదులకు 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని