రెండో విడత రుణ మాఫీ

ప్రధానాంశాలు

రెండో విడత రుణ మాఫీ

రూ. 50 వేల లోపు రైతులకు వర్తింపు

 6 లక్షల మందికి లబ్ధి

57 ఏళ్ల వారికి తక్షణమే పింఛన్లు

ఈడబ్ల్యూఎస్‌ ఉద్యోగ నియామకాల్లో 5 ఏళ్ల సడలింపు 

అనాథల సంక్షేమంపై ఉపసంఘం

6 సూపర్‌ ఆసుపత్రుల నిర్మాణం

మంత్రిమండలి నిర్ణయాలు

ఈనాడు - హైదరాబాద్‌

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఒంటరులైపోయి తీవ్ర మానసిక వేదన ఎదుర్కొంటారు. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడి ప్రయోజకులయ్యేంత వరకు వారికి ప్రభుత్వమే అండగా నిలవాలి. గతంలో అనాథలకు బీసీ హోదా ఇవ్వడంతో పాటు వారి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం. అయినవాళ్లను కోల్పోయిన చిన్నారుల కోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలి. ప్రభుత్వ యంత్రాంగం మానవీయ కోణంలో స్పందించాలి.

- అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచన 


రాష్ట్రంలోని ఆరు లక్షలమంది అన్నదాతలకు రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు దీనిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2019 నుంచి మూడు లక్షలమంది రైతులకు రూ. 25 వేల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తాజాగా రూ. 50 వేల లోపు రుణాలను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీని ద్వారా మొత్తం తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ వర్తించినట్లవుతుందని, మిగిలిన వారికి దశలవారీగా వర్తింపజేస్తామని తెలిపారు. గిరాకీ దృష్ట్యా పత్తి సాగు పెంచాలని, రైతాంగాన్ని సమాయత్తం చేయాలని వ్యవసాయాధికారులకు మంత్రిమండలి సూచించింది. రాష్ట్రంలో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ కోటా అమలుకు తీర్మానించింది. దీని కింద విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పొందేందుకు వార్షికాదాయ పరిమితి రూ. 8 లక్షల లోపు ఉండాలని.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ధోబీ ఘాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఆదివారం ముఖ్యమంత్రి  అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది.

తక్షణమే కొత్త పింఛన్ల ప్రక్రియ

వృద్ధాప్య పింఛన్ల అర్హతను 57 సంవత్సరాలకు తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలి. కుటుంబంలో ఒక్కరికే ఇచ్చే పద్ధతినే కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్‌ బదిలీ చేయాలి. అనాథ శరణాలయాల స్థితిగతులు సమీక్షించి అనాథల సంక్షేమానికి విధాన రూపకల్పన కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. ఇందులో మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, సబితారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సభ్యులుగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల వివరాలను వైద్యశాఖ కార్యదర్శి తెప్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల పరిస్థితుల మీద సమగ్ర నివేదికను సమర్పించాలి. ఖాళీగా ఉన్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలి.


వచ్చే విద్యాసంవత్సరంలో 7 వైద్య కళాశాలలు

కొత్తగా మంజూరు చేసిన ఏడు వైద్య కళాశాలలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు నిర్మాణాలను చేపట్టాలి. అవసరమైనన్ని పడకలతో ఆసుపత్రులు సహా వసతి గృహాలు, మౌలిక సదుపాయాలను రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేయాలి. రెండుమూడేళ్లలో జిల్లాకో వైద్య కళాశాల స్థాపన లక్ష్యంగా ఇప్పటినుంచే ఏర్పాట్లు ప్రారంభించాలి.


సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు

వరంగల్‌, హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణం, టిమ్స్‌, ఎల్బీనగర్‌లోని గడ్డిఅన్నారం, అల్వాల్‌తో పాటు కొత్తగా పటాన్‌చెరులోనూ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలి.అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్కచోటనే అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. వరంగల్‌ లో ఇప్పటికే మంజూరు చేసిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను త్వరలో చేపట్టాలి.  గచ్చిబౌలితో పాటు సనత్‌ నగర్‌, ఎల్‌బీనగర్‌,  అల్వాల్‌ ఆసుపత్రులను టిమ్స్‌ పేరిట పిలవాలి. హైద్రాబాద్‌ నిమ్స్‌ ను మరింతగా అభివృద్ధి పరిచి వైద్య సేవల విస్తృతానికి  కావాల్సిన ప్రణాళికలను సిద్దం చేసి వచ్చే మంత్రిమండలి సమావేశానికి తీసుకొని రావాలి.


సాగుకు అండగా..

గత ఏడాది రికార్డు స్థాయిలో పంటల సాగుపై రైతులు, అధికారులకు అభినందనలు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఎరువులు, పురుగు మందులకు కొరత రాకుండా అధికారులు చూడాలి.


కరోనా మూడోదశపై అప్రమత్తత

కరోనా మూడోదశ హెచ్చరికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. జిల్లాలవారీగా కరోనా స్థితిగతులు, ఇరుగుపొరుగు రాష్ట్రాల పరిస్థితులు, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి రాష్ట్ర ఆసుపత్రుల వరకు సమాచారం తీసుకుంది. పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌, ఔషధాలు, రోగ నిర్ధారణ పరీక్షల సౌకర్యంపై చర్చించింది. అన్ని జిల్లాల్లో విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని, టీకాలను వేగవంతం చేయాలని, అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు మందులను సమకూర్చాలని, ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న సమస్యాత్మక ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలు పర్యటించి తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించింది. ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలను తీసుకోవాలని ప్రజలకు విజ్జప్తి చేసింది. కరోనా టీకా తీసుకున్నవాళ్లు కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని