హాకీకి పతక హారతి

ప్రధానాంశాలు

హాకీకి పతక హారతి

41 ఏళ్ల తర్వాత భారత్‌కు ఒలింపిక్స్‌లో కాంస్యం 

రెజ్లర్‌ రవికి రజతం

హాకీ.. కేవలం ఆట మాత్రమే కాదు. అదో భావోద్వేగం. ప్రతి భారతీయుడి హృదయంలో ఎక్కడో ఓ చోట అది నిక్షిప్తమై ఉంటుంది. అందుకే.. ఒలింపిక్స్‌లో 8 పసిడి పతకాలతో స్వర్ణ యుగాన్ని అందించిన ఆ దిగ్గజాలను కోట్లాది మంది గుండెల్లో దాచుకున్నారు. ఆ తర్వాత 4 దశాబ్దాలుగా విశ్వ క్రీడల్లో భారత హాకీకి పతకం రాకపోతే ఆ మనసులు ఆవేదనతో నిండిపోయాయి. ఈ నిరీక్షణకు ముగింపు ఇంకెప్పుడూ అని ఆశగా ఆ కళ్లు ఎదురు చూశాయి. ఎప్పుడెప్పుడా అనుకున్న ఆ తరుణం రానే వచ్చింది. గురువారం టోక్యోలో భారత పురుషుల జట్టు కాంస్యంతో దేశానికి పండగ తెచ్చింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ హాకీలో దక్కిన ఈ పతకం భారతావనిని పులకరింపజేసింది. భారత హాకీకి సుదీర్ఘ విరామం తర్వాత పతకాభిషేకం జరగడంతో ప్రతి భారతీయుడి తనువు ఉప్పొంగిపోయింది. గల్లీ నుంచి దిల్లీ వరకూ ఎక్కడ చూసినా సంబరాలే. మరోవైపు రెజ్లింగ్‌లో రజతం సాధించిన రవి కుమార్‌ దహియా ఆ సందడిని మరింత పెంచాడు. 57 కేజీల విభాగంలో ఫైనల్‌ చేరిన అతను.. పసిడి పట్టు పట్టాలని దేశమంతా కోరుకున్నా... తుది పోరులో పోరాడి ఓడి వెండి వెలుగులు పంచాడు. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ రెజ్లింగ్‌లో పతకం రావడం విశేషం. మహిళల 53 కేజీల విభాగంలో పతకం గెలుస్తుందనే అంచనాలతో మ్యాట్‌పై అడుగుపెట్టిన మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. రెజ్లర్లు అన్షు మలిక్‌, దీపక్‌ పునియా వట్టి చేతులతోనే తిరిగి రానున్నారు. మహిళల గోల్ఫ్‌ వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో అనూహ్యంగా అదితి పతక ఆశలు కలిగిస్తోంది. రెండో రౌండ్‌ పూర్తయ్యేసరికి ఆమె ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతోంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని