జగన్‌ బెయిలు రద్దుకు నిరాకరణ

ప్రధానాంశాలు

జగన్‌ బెయిలు రద్దుకు నిరాకరణ

ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా...
రఘురామ పిటిషన్లను కొట్టేసిన సీబీఐ ప్రధాన కోర్టు
పిటిషన్ల బదిలీకి నిరాకరించిన తెలంగాణ హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితులైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలకు గతంలో మంజూరుచేసిన బెయిలును రద్దు చేయడానికి సీబీఐ ప్రధాన కోర్టు నిరాకరించింది. వీరి బెయిలును రద్దు చేయడానికి తగినన్ని కారణాలు లేవంది. ఈ మేరకు ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తీర్పు వాయిదా వేసిన నేపథ్యంలో రెండో నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై వాదనలు విన్న సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు బుధవారం తీర్పు వెలువరించారు. తమను ప్రభావితం చేసినట్లు ఏ ఒక్క సాక్షీ ఫిర్యాదు చేయలేదని, బెయిలు షరతులను ఉల్లంఘించినట్లు ఆధారాలు లేవని, అధికారంలో ఉన్నంత మాత్రాన సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటే సరికాదన్న జగన్‌, సాయిరెడ్డిల తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించారు. రఘురామ కృష్ణరాజు పిటిషన్లను కొట్టేస్తూ న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ రావాల్సి ఉంది.

‘సాక్షి’ది కోర్టు ధిక్కరణగా పరిగణన

ఓ వైపు విజయసాయిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై వాదనలు కొనసాగుతుండగానే జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేేశారంటూ ‘సాక్షి’ వెబ్‌ మీడియాలో ట్వీట్‌ చేయడాన్ని కోర్టు ధిక్కరణగానే సీబీఐ కోర్టు పరిగణించింది. సాక్షి ఎడిటర్‌ మురళి, సీఈవో వినయ్‌ మహేశ్వరిలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను తదుపరి చర్యల నిమిత్తం హైకోర్టుకు నివేదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పిటిషన్‌కు చెందిన మొత్తం రికార్డును హైకోర్టుకు పంపాలని సీబీఐ కోర్టు కార్యాలయానికి న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. ఈ అంశంపై ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

అపోహల కారణంగా బదిలీ చేయలేం: హైకోర్టు

ఒక కేసులో కేవలం అపోహల కారణంగా కింది కోర్టుల్లో కేసులను బదిలీ చేయడానికి కుదరదని తెలంగాణ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. సరైన కారణాలు, ఆధారాలు చూపకుండా కేసును బదిలీ చేయాలనడం సరికాదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని పేర్కొంది. అక్రమాస్తుల కేసుల్లో జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల బెయిలును రద్దుచేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ ప్రధాన కోర్టు నుంచి హైదరాబాద్‌ లేక తెలంగాణలో మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ బుధవారం తీర్పు వెలువరించారు. పిటిషనర్‌ చెబుతున్నట్లు సాక్షి వెబ్‌ మీడియాలో జగన్‌ బెయిలు పిటిషన్‌ను కొట్టేశారని చెప్పడంతోపాటు బెయిలు రద్దు పిటిషన్లపై తీర్పును వాయిదా వేసిన మర్నాడే విదేశాలకు వెళ్లడానికి విజయసాయిరెడ్డికి అనుమతించారని కారణంగా సందేహించడాన్ని తప్పుబట్టారు. ఈ ఉత్తర్వులిచ్చి 12 రోజులైందని, ఇప్పటివరకు ఆ ఉత్తర్వులను సీబీఐ గానీ, రఘురామ కృష్ణరాజు గానీ సవాలు చేయలేదన్నారు. విజయసాయిరెడ్డి బెయిలు షరతులను ఉల్లంఘించినట్లు సీబీఐ చెప్పలేదన్నారు. రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

 


హైకోర్టుకు అప్పీల్‌కు వెళతాను: రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించినందున దానిపై తాను హైకోర్టుకు అప్పీల్‌కు వెళతానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ‘విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ చేసిన వాదనలకు విరుద్ధంగా కోర్టులో ఉత్తర్వులు వచ్చి 15 రోజులైనా ఆ దర్యాప్తు సంస్థ పైకోర్టులో ఎందుకు అప్పీల్‌ చేయలేదు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి ఒకసారి కూడా కోర్టుకు హాజరుకానప్పటికీ సీబీఐ ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదో తెలియడం లేదు. కొంతమంది దాఖలు చేస్తున్న డిశ్చార్జి పిటిషన్లపై అభిప్రాయం చెప్పడానికి తమకు సమయం కావాలంటూ ఆ సంస్థ కాలయాపన చేస్తోందని’ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని