ఆ ఒక్క సంతకమే దూరం

ప్రధానాంశాలు

ఆ ఒక్క సంతకమే దూరం

రిజిస్ట్రేషన్‌ పూర్తయినా హక్కుల చిక్కు

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి ప్రారంభానికి ముందు నిలిచిపోయిన మ్యుటేషన్లు యజమానులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పాత రిజిస్ట్రేషన్‌ విధానంలో రిజిస్ట్రేషన్‌ పూర్తయి.. మ్యుటేషన్‌ కాకుండా హక్కుల కోసం ఎదురుచూస్తున్న వారు అనేక మంది అవస్థలు పడుతున్నారు. కేవలం తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం పూర్తికాక కొందరికి పాసుపుస్తకాలు అందడం లేదు. మరికొందరికి ధరణి పోర్టల్లో భూ విస్తీర్ణం కనిపించక అయోమయానికి గురవుతున్నారు. గతేడాది నవంబరు రెండో తేదీన ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించాక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్‌కు మారాయి. అంతకు ముందు సబ్‌ రిజిస్ట్రార్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు, తహసీల్దార్‌ ద్వారా మ్యుటేషన్‌ పూర్తయ్యేది.

కట్టంగూరు మండలంలో ఇలా...

బాల నర్సయ్యకు ఇద్దరు కొడుకులు. ఆయన తనకున్న భూమిలో చెరి 1.36 ఎకరాలను గిఫ్ట్‌ డీడ్‌ కింద పంచారు. పెద్ద కొడుకుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ అయింది. తర్వాత తహసీల్దార్‌ కార్యాలయంలో మ్యుటేషన్‌ ప్రక్రియలో డిజిటల్‌ సంతకం వరకు వచ్చి దస్త్రం ఆగిపోయింది. తండ్రి ఖాతా నుంచి 1.36 ఎకరాల భూమి కూడా రద్దయింది. పాసుపుస్తకం అందడంలేదని కొద్ది రోజులు తిరిగిన ఆయన ధరణి పోర్టల్‌ రావడంతో మరోమారు మ్యుటేషన్‌కు దరఖాస్తు చేశారు. తర్వాత మ్యుటేషన్‌ పూర్తయి పాసుపుస్తకం అందింది. ఇంకా 1.36 ఎకరాలు ఉండాలి. ఇంతలో చిన్నకొడుకు తండ్రి ఖాతాను పరిశీలించగా మిగిలిన భూమి కనిపించలేదు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో వెలుగులోకి వచ్చిన డిజిటల్‌ సంతకాల సమస్య ఇది. ఇలాంటివే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

మూడు లక్షలకుపైగా పెండింగ్‌ మ్యుటేషన్లు

రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చింది. తహసీల్దార్లకు భూ యాజమాన్య హక్కులు, పాసుపుస్తకాల జారీ అధికారాలు తొలగించింది. గతేడాది మార్చి ఆఖరు నుంచి కరోనాతో రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించగా మ్యుటేషన్లు కూడా పెద్ద ఎత్తున పెండింగ్‌లో పడ్డాయి. కొన్ని డిజిటల్‌ సంతకాల వరకు వచ్చి ఆగిపోయాయి. దాదాపు మూడు లక్షలకు పైగా పెండింగ్‌ మ్యుటేషన్లు ఉన్నట్లు అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెండింగ్‌ మ్యుటేషన్ల బాధితులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూశాఖ సూచించింది. ఏడు నెలల కాలంలో 1,48,445 దరఖాస్తులు అందగా 1,47,875 పరిష్కరించారు. అయితే ధరణి పోర్టల్లో సర్వే నంబర్లు, ఖాతాలు కనిపిస్తున్న భూములకు సంబంధించిన దరఖాస్తులను మాత్రమే పోర్టల్‌ స్వీకరిస్తోంది. ఖాతాల నుంచి భూ విస్తీర్ణం కోత పడిన, డిజిటల్‌ సంతకం వరకు వచ్చి నిలిచిపోయిన వ్యవహారాలకు సంబంధించి ఎవరిని సంప్రదించాలో అర్థం కావడం లేదని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని రకమైన భూ సమస్యలకు ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మూడు నెలల క్రితం ఇచ్చిన ఐచ్ఛికంలో తాము నమోదు చేసినా పరిష్కారం కావడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని