చిక్కుల్లో.. హక్కులు

ప్రధానాంశాలు

చిక్కుల్లో.. హక్కులు

3 లక్షల హెక్టార్ల భూమిపై తేలని వివాదాలు

ఏళ్లుగా పోరాడుతున్న బాధితులు

వందలమందిపై కేసులు..

అందరి చూపు మంత్రివర్గ ఉపసంఘం వైపే

ఈనాడు, హైదరాబాద్‌, నల్గొండ

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

ఈటీవీ, ఖమ్మం

పచ్చని అడవుల్లో భూమిపై హక్కుల కోసం ఎడతెగని పోరాటం సాగుతోంది. అటవీశాఖ సిబ్బంది, గిరిజనులు పరస్పర దాడులు చేసుకుంటున్నారు. అడవిపై తమదే హక్కు అని గిరిజనులు, అటవీ భూముల్లో సాగు చెల్లదంటూ అటవీ అధికారులు ఒకరినొకరు అడ్డుకుంటున్నారు. అటవీ భూముల సమస్య ఇలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం తేలకపోవడం మరికొన్ని వివాదాలకు కారణమవుతోంది. 2006లో ప్రభుత్వం జారీ చేసిన పట్టాలు ఉన్నప్పటికీ తమను సాగు చేసుకోనివ్వడం లేదని కొన్నిచోట్ల గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పోడు హక్కుల పోరాటం అటవీశాఖ, గిరిజనుల మధ్య యుద్ధంలా మారింది. ఈ సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఒక దఫా సమావేశం కూడా పూర్తయింది. ఇప్పటికైనా సమస్య పరిష్కారమైతే అదే పదివేలని ఆదివాసీలు ఆశిస్తున్నారు.


ఆదివాసీల వేడుకోలు

హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాల్లో గిరిజనులు జీవిస్తున్నారు. మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 26.96 లక్షల చదరపు కిలోమీటర్లు. వాటిలో 3 లక్షల హెక్టార్లు ఆక్రమణకు గురైనట్లు అంచనా. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలని గిరిజనులు కోరడంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం 2006లో దరఖాస్తులు స్వీకరించింది. 94,778 మంది గిరిజనులకు 8,08,179 లక్షల ఎకరాల మేర హక్కు పత్రాలు జారీ చేయగా, 2.54 లక్షల దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. హక్కు పత్రాలు పొందినవారిలోనూ కొందరు అగ్నిప్రమాదాలు, చెదల సమస్యలతో పత్రాలను కోల్పోయారు. ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హరితహారం లక్ష్యం కింద మొక్కలు నాటేందుకు అటవీశాఖ పోడు భూములను గుర్తించి వెనక్కు తీసుకుంటోంది. ఈ సందర్భంగా జిల్లాల్లో పరస్పర దాడులు, ఘర్షణలు జరుగుతున్నాయి. అడవిని నమ్ముకుని జీవించే తమ పొట్ట కొట్టొద్దని గిరిజనులు వేడుకుంటున్నారు.


ఏళ్ల తరబడి తేలని సరిహద్దులు

మరోవైపు అటవీ, రెవెన్యూశాఖలకు చెందిన 2.18 లక్షల ఎకరాలకు సరిహద్దులు తేలాల్సి ఉంది. 2019-20 సంవత్సరంలో రెవెన్యూ, అటవీ, భూమి కొలతలు- భూ దస్త్రాల నిర్వహణ శాఖలు ఉమ్మడిగా సరిహద్దులు తేల్చేందుకు సిద్ధమయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సర్వే ప్రారంభమైనా పూర్తి కాలేదు. ఇలాంటిచోట ఆక్రమణకు గురవుతున్న భూమి ఏ శాఖకు చెందినదనే స్పష్టత లేదు. ఈ కారణంగా కూడా ఘర్షణలు తలెత్తుతున్నాయి. అటవీ భూముల్లో కాకుండా ప్రభుత్వ భూముల్లోనే తాము సాగు చేసుకుంటున్నామని, హక్కులు కల్పించాలని కొన్ని జిల్లాల్లో గిరిజనులు కోరుతున్నారు. సర్వే పూర్తయితేగానీ ఏ విషయం తేలదని అధికారులు చెబుతున్నారు. ఇలా కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 21 వేల ఎకరాలు, మంచిర్యాలలో 20,000, మహబూబాబాద్‌లో 12,000, నల్గొండలో 33,121, నిజామాబాద్‌లో 12,000, మెదక్‌ జిల్లాలో 17,947 ఎకరాల భూమికి సరిహద్దులు తేలాల్సి ఉంది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని