క్యాన్సర్‌ రోగులకు మరింత నిర్దిష్ట చికిత్సలు

ప్రధానాంశాలు

క్యాన్సర్‌ రోగులకు మరింత నిర్దిష్ట చికిత్సలు

కొత్త విధానాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికా శాస్త్రవేత్తలు మెరుగైన విధానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం.. రోగుల డీఎన్‌ఏలో క్యాన్సర్‌ కారక జన్యులోపం ఎక్కడుందన్నదాన్ని బట్టి అనువైన చికిత్సను వైద్యులు నిర్ధరిస్తున్నారు. కొత్త విధానం దీనికి భిన్నంగా ఉంటుంది. ఇందులో సంబంధిత జన్యులోపం వల్ల ప్రొటీన్‌ నిర్మాణం, పనితీరులో వచ్చే మార్పుల ప్రకారం రోగులను వర్గాలుగా విభజిస్తారు. దీనివల్ల రోగి అవసరాలకు తగ్గట్టు మరింత నిర్దిష్టమైన మందులను వైద్యులు ఇవ్వడానికి వీలవుతుంది. టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఎండీ ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ నిపుణులు ఈ పరిశోధన చేశారు.

కణంలోని డీఎన్‌ఏ తన ప్రతిరూపాన్ని తయారుచేసుకునే సమయంలో ఉత్పరివర్తనలు (మ్యుటేషన్‌లు) తలెత్తుతాయి. ఇవి ఒక విధంగా లోపాలే. సాధారణంగా అవి హానికరం కావు. కణంలోని లోపాలను పసిగట్టే యంత్రాంగం వీటిని గుర్తిస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ యంత్రాంగం విఫలమవుతుంది. అరుదైన సందర్భాల్లో ఈ ఉత్పరివర్తనలు.. డీఎన్‌ఏలోని ఆంకోజీన్స్‌ అనే భాగాల్లో ఏర్పడుతుంటాయి. వృద్ధి, కణజాల మరమ్మతులకు ఈ ఆంకోజీన్స్‌ అవసరం. కొన్నిసార్లు ఉత్పరివర్తనల వల్ల అపరిమిత వృద్ధికి సంబంధించిన సంకేతాన్ని ఇవి ఇస్తాయి. దీనివల్ల క్యాన్సర్‌ ఏర్పడవచ్చు.


సురక్షితంగా..

లక్షిత చికిత్స ద్వారా క్యాన్సర్‌ కణాలను చంపేయవచ్చు. ఇవి నిర్దిష్టంగా.. ఉత్పరివర్తనకు లోనైన ఆంకోజీన్స్‌ వల్ల ఉత్పత్తయిన లోపభూయిష్ట ప్రొటీన్లకు అతక్కుంటాయి. తద్వారా అపరిమిత వృద్ధి సంకేతం వెలువడకుండా నిలువరిస్తాయి. ఈ లక్షిత ఔషధాలు నిర్దిష్టంగా క్యాన్సర్‌ ప్రొటీన్‌కు మాత్రమే అతుక్కోవడం వల్ల ఇతర కణాలకు చాలా వరకూ హాని జరగదు. ఇందుకు భిన్నంగా.. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీ చికిత్స విభజనకు లోనయ్యే అన్ని క్రియాశీల కణాలపై దాడి చేస్తాయి. అందులో వెంట్రుకల కుదుళ్లకు సంబంధించిన కణాలు, శరీరంలో ఇతర భాగాల్లోనివి ఉంటాయి.

లక్షిత చికిత్సలను మరింత నిర్దిష్టంగా తీర్చిదిద్దడానికి శాస్త్రవేత్తలు.. ఉత్పరివర్తనల వల్ల ప్రొటీన్లలో తలెత్తే భౌతిక మార్పులపై అధ్యయనం చేస్తున్నారు. కచ్చితంగా ఈ మార్పులను ఎంచుకొని, వాటికి అతుక్కునేలా ఔషధాలను రూపొందిస్తున్నారు. ప్రొటీన్‌లో అనేక భాగాల్లో ఉత్పరివర్తనలు రావొచ్చు. అందువల్ల బహుళ లక్షిత చికిత్సలు అవసరం. రోగుల్లో ఉన్న నిర్దిష్ట ఉత్పరివర్తనలకు అనుగుణంగా చికిత్సలను వైద్యుడు గుర్తించడం ఎలా అనే సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికి సమాధానం కనుగొనేందుకు టెక్సాస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో ఉన్న ఈజీఎఫ్‌ఆర్‌ అనే ఒక ఆంకోజీన్‌పై దృష్టి పెట్టారు. ఇందులో వచ్చే అనేక రకాల ఉత్పరివర్తనల వల్ల క్యాన్సర్లు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ రకం క్యాన్సర్‌ ఉన్నవారికి.. డీఎన్‌ఏలోని ఉత్పరివర్తన రకం, అది తలెత్తిన ప్రదేశం ఆధారంగానే చికిత్సలు ఇస్తున్నారు. మ్యుటేషన్ల వల్ల ప్రొటీన్ల ఆకృతి మారిపోతుందని, ఫలితంగా ఔషధాలు వాటితో చర్య జరిపే తీరులోనూ మార్పు వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈజీఎఫ్‌ఆర్‌ ప్రొటీన్లలో ఉత్పరివర్తనకు లోనైన ప్రొటీన్ల ఆకృతులను పరిశీలించిన శాస్త్రవేత్తలు వాటిని రెండు భిన్న రకాలుగా వర్గీకరించారు. నిర్దిష్టంగా వాటిపై పనిచేసే ఔషధాలను ఇవ్వడంవల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

- హ్యూస్టన్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని