UP: బాబ్బాబూ! జైల్లోనే ఉండనివ్వండి

తాజా వార్తలు

Updated : 31/05/2021 09:12 IST

UP: బాబ్బాబూ! జైల్లోనే ఉండనివ్వండి

పెరోల్‌ వద్దంటూ యూపీలో 21 మంది ఖైదీల లేఖ
కరోనా వేళ బయటికి వెళితే బతకలేమని ఆందోళన

లఖ్‌నవూ: ‘ఇల్లే కదా స్వర్గసీమ’ అని పాడుకోవడం విన్నాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆ ఖైదీలు మాత్రం బెయిలు ఇస్తాం ఇళ్లకు వెళ్లండంటే.. బాబ్బాబూ! జైల్లోనే ఉండనివ్వండంటూ ప్రాధేయపడుతున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలు కరోనా వేళ జైలు కంటే సురక్షితం, ఆరోగ్యప్రదం మరొకటి లేదంటూ.. పెరోల్‌ (తాత్కాలిక విడుదల) తమకు వద్దని ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. యూపీలోని గజియాబాద్, గౌతంబుద్ధ్‌ నగర్, మేరఠ్, మహరాజ్‌గంజ్, గోరఖ్‌పుర్, లఖ్‌నవూ జైళ్లలోని ఖైదీలు ఈ మేరకు మొరపెట్టుకున్నట్టు జైళ్ల పరిపాలన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదివారం మీడియాకు తెలిపారు. ‘ఈ పరిస్థితుల్లో బయటికి వెళితే తిండి, ఆరోగ్యానికి భరోసా ఉండదు. ఇక్కడైతే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయిస్తాం. గంట కొట్టగానే అన్నం పెడతాం. పైగా వాళ్లకిచ్చే 90 రోజుల పెరోల్‌ కాలాన్ని మళ్లీ శిక్షాకాలంలో కలుపుతాం’ అని ఆయన వివరించారు. మరిప్పుడు ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. వాళ్లు లిఖితపూర్వకంగా కోరారు కాబట్టి, ఆమోదించక తప్పదని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో జైళ్లలో సామాజిక దూరం సమస్యగా మారుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటుచేసి ఏడేళ్లలోపు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు, కేసులు విచారణలో ఉన్నవారికి పెరోల్‌ లేదా మధ్యంతర బెయిలు మంజూరు చేసే విషయం పరిశీలించాలని సుప్రీం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా యూపీలో 2,200 మందిని పెరోల్‌పైన, 9,200 మందిని మధ్యంతర బెయిలుపై విడుదల చేసినట్టు ఆనంద్‌కుమార్‌ తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని