
తాజా వార్తలు
భారత్: ఒక్కరోజే 24,850 కేసులు, 613 మరణాలు!
దేశంలో 19వేలు దాటిన కొవిడ్ మృతులు
ప్రపంచంలో మూడో స్థానానికి చేరువలో భారత్
రికార్డుస్థాయిలో నమోదవుతున్న కేసులు, మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజులుగా భారత్లో నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 24,850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా నిత్యం సంభవిస్తున్న కరోనా మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. శనివారం ఒక్కరోజే దేశంలో 613మరణాలు చోటుచేసుకోవడం మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజు గడువులో ఈ స్థాయిలో మరణాలు, కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో ఆదివారం నాటికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,73,165గా చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 19,268మంది మృత్యువాతపడ్డట్లు తెలిపింది. కరోనావైరస్ సోకినవారిలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 4లక్షల దాటడం కాస్త ఊరట కలిగించే విషయం. కాగా, మరో 2,44,814మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే దాదాపు 15వేల మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా బాధితుల రికవరీ రేటు 60శాతంగా ఉండగా మరణాల రేటు 2.9శాతంగా ఉంది.
ప్రపంచంలో మూడో స్థానానికి చేరువలో భారత్..
శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులతో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరువయ్యింది. తాజాగా కేసుల సంఖ్య 6,73,165కు చేరడంతో రష్యా(6,73,564) దగ్గరగా ఉంది. ప్రస్తుతం 28లక్షల పాజిటివ్ కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, 15లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఉన్న అమెరికా మినహా, బ్రెజిల్, రష్యాలలో నిత్యం దాదాపు 7వేల పాజిటివ్ కేసులు నమోదవుతుండగా భారత్లో మాత్రం ఆ సంఖ్య 25వేలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవీ చదవండి..
కరోనాతో చచ్చినా.. చావే!
కొవిడ్ టీకా ఈ ఏడాది సాధ్యం కాదు!