close

తాజా వార్తలు

Updated : 27/09/2020 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూత

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రిటైర్డ్‌ మేజర్‌ జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్‌ 25న దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఉదయం తీవ్ర గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా సోకలేదని వైద్యులు నిర్ధరించారు. 1938 జనవరి 3న రాజస్థాన్‌లోని జసోల్‌లో జన్మించిన ఆయన సైన్యంలో వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారు. పదవీ విరమణ అనంతరం భాజపాలో చేరి 1980 నుంచి 2014 వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. గొప్ప పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐదుసార్లు రాజ్యసభ, నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1998-99 మధ్య ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. వాజ్‌పేయీ హయాంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. 1999లో నేపాల్‌ నుంచి భారత్‌ వస్తున్న ఎయిరిండియా విమానాన్ని తాలిబన్లు హైజాక్‌ చేసి అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించగా ఉగ్రవాదులతో జశ్వంత్‌ సింగ్‌ చర్చలు జరిపి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

జశ్వంత్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సైనికుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. ‘‘మానవేంద్ర సింగ్‌తో మాట్లాడి జశ్వంత్‌ సింగ్‌ హఠాన్మరణం పట్ల నా సంతాపం తెలియజేశాను. గత ఆరేళ్లుగా ఆయన తన అనారోగ్యంపై ధైర్యంగా పోరాడారు. రాజకీయాలు, సమాజంపై ప్రత్యేక దృక్ఫథం కలిగిన నేతగా ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులు. ఆయనతో జరిపిన సంభాషణలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భాజపా బలోపేతానికి ఎంతో కృషి చేశారు. తొలుత సైనికుడిగా, తర్వాత రాజకీయ నాయకుడిగా దేశానికి సేవలందించారు. అటల్‌జీ హయాంలో కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక, రక్షణ, విదేశాంగ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. అలాంటి వ్యక్తి మరణం తీవ్రంగా బాధిస్తోంది.  ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి.’’ అని జశ్వంత్‌ సింగ్‌తో ఉన్న అనుబంధాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు. 

‘‘భాజపా సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ మరణం తీవ్రంగా కలచివేసింది. రక్షణ మంత్రి సహా వివిధ హోదాల్లో దేశానికి ఎనలేని సేవలందించారు. గొప్ప నేతగా, పార్లమెంటేరియన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అద్భుతమైన మేధో సామర్థ్యాలు, దేశానికి అందించిన ఎనలేని సేవలు ఆయన్ని గొప్ప నేతగా నిలబెడతాయి. ఈ విచారకరమైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా సంతాపం. ఓం శాంతి’’-రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర రక్షణమంత్రి 

‘‘సీనియర్ నాయకుడు, అటల్‌జీ మంత్రివర్గంలో మంత్రిగా చేసిన జశ్వంత్ సింగ్‌ మరణం విచారకరం. ఆయన లేని లోటు తీర్చలేనిది. ప్రభుత్వం, వివిధ సంస్థల్లో నిబద్ధతతో పనిచేసిన ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’- అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

‘‘జశ్వంత్‌ సింగ్‌ మరణ వార్త తీవ్ర ఆవేదనను కలిగించింది. ప్రభుత్వంలో ఉన్నా.. లేకపోయినా.. జీవితాంతం దేశం కోసమే పనిచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’- అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ ముఖ్యమంత్రి


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.