
తాజా వార్తలు
కొత్త కేసులు.. రికవరీలు 40వేల పైనే
గత 24 గంటల్లో 41,322 కొత్త కేసులు..485 మరణాలు
దిల్లీ: భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చలికాలం ప్రవేశించడం, ప్రజలు కొవిడ్-19 నిబంధనలు సరిగా పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసులు 40వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం 41,322 వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 93,51,109కి చేరింది. ఈ మహమ్మారి కారణంగా నిన్న ఒక్కరోజే 485 మంది మరణించగా.. ఇప్పటివరకు 1,36,200 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు, క్రియాశీల కేసులు ఎప్పటిలాగే ఐదు లక్షలకు దిగువనే కొనసాతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 4,54,940గా ఉండగా.. క్రియాశీల రేటు 4.87 శాతంగా ఉంది. క్రితం రోజుతో పోల్చుకుంటే క్రియాశీల కేసులు కొద్దిమేర తగ్గడం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 41,452 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 87,59,969గా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 93.68 శాతంగా ఉంది. కాగా, నిన్న 11,57,605 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా..కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసే టీకా కోసం దేశమంతా ఎదురుచూస్తోన్న తరుణంలో శనివారం ప్రధాని మోదీ టీకా తయారీలో పాలుపంచుకొంటున్న భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జైడస్ క్యాడిలా సంస్థలను సందర్శించనున్నారు. ఇందుకోసం ఆయన ఒకేరోజు హైదరాబాద్, పుణె, ఆహ్మదాబాద్ నగరాల్లో పర్యటించనున్నారు.