
తాజా వార్తలు
కరోనా వ్యాక్సిన్ కౌంట్‌డౌన్ మొదలైనట్టేనా..?
ఇంటర్నెట్ డెస్క్ : కరోనా వ్యాక్సిన్ కౌంట్‌డౌన్ మొదలైనట్టేనా? ఒకటి రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందా?ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. పలు దిగ్గజ ఔషధ సంస్థలు పోటీపడి మరీ అత్యంత వేగంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తూ టీకా పనితనాన్ని పరీక్షిస్తున్నాయి. వీలైనంత త్వరగా విరుగుడు అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాయి. దేశీయంగాను, అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకా పరీక్షలు కీలకమైన మూడోదశకు చేరుకోవటం ఆసక్తి కలిగిస్తున్న పరిణామం.
ఆశగా ఎదురుచూస్తున్న ప్రపంచం..
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ప్రపంచమంతా ఇదే చర్చ. తొమ్మిది నెలలుగా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయటం కోసం అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తునే ఉన్నాయి. కాస్తో కూస్తో ప్రభావం తగ్గినా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో మహమ్మారిని పూర్తిగా అంతం చేసే అస్త్రం కోసం నిరీక్షిస్తోంది అంతర్జాతీయ సమాజం. అందుకు ఒకే ఒక మార్గం వ్యాక్సిన్ తయారీ.
భారత్ బయోటెక్ టీకాపై ఆసక్తి...
విరుగుడును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా సంస్థలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిల్లో కొన్ని దశల వారీగా ప్రయోగాలు పూర్తిచేసుకుంటూ, సత్ఫలితాలను సాధిస్తూ ముందంజలో ఉన్నాయి. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకా ఇందులో ఒకటి. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు దశల క్లినికల్ పరీక్షలు పూర్తికాగా.. ప్రస్తుతం మూడోదశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అందరి దృష్టి ఈ టీకా పైనే ఉంది. దేశీయంగా టీకా తయారీ ప్రయోగాల్లో భారత్ బయోటెక్ మొదటి నుంచీ క్రియాశీలకంగా ఉంది. అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తోంది. స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ పురోగతిని పరిశీలించేందుకు ఆసక్తి కనబరిచారు. అందులో భాగంగా హైదరాబాద్ నగర శివార్లలోని జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్‌ను సందర్శించారు. టీకా అభివృద్ధి గురించి శాస్త్రవేత్తలతో చర్చించారు.
సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా...
టీకాకు సంబంధించి మూడోదశ పరీక్షలు పూర్తయిన వెంటనే ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత తక్కువ ఖర్చులో టీకాను అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. భారత్ బయోటెక్‌తో పాటు పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందిస్తున్న టీకా డిసెంబర్ కల్లా సిద్ధమవ్వచ్చని తెలుస్తోంది. ఇటీవల ఆ సంస్థ సీఈవో ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేశారు. వచ్చే ఏడాది రెండు లేదా మూడో త్రైమాసికానికి పదికోట్ల డోసులు అందుబాటులోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. టీకా అందుబాటులోకి వచ్చే సరైన సమయం, యూకేలో నిర్వహిస్తున్న ట్రయల్స్, బీసీజీఏ ఆమోదం వీటిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. డిసెంబర్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకుని వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఆ సమయానికి యూకేలోనూ ట్రయల్స్ పూర్తవుతాయి. వ్యాక్సిన్ రెండు డోసులుగా ఇస్తారని, ఒక్కో డోసుకు మధ్య 28 రోజుల గడువు ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాతో ఎస్ఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో త్వరితగతిన టీకాను అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇటీవల ఆస్ట్రాజెనెకా తయారు చేస్తున్న టీకా పరీక్షలు 90శాతం సత్ఫలితాలు ఇచ్చాయని ప్రకటించినా, తరువాత అందులో కొన్ని పొరపాట్లు జరిగాయని వివరణ ఇచ్చింది.
భారత్ బయోటెక్‌తో కలిపి దేశంలో ఐదు సంస్థలు టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ పరీక్షలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా టీకా మూడో దశ పరీక్షలు సీరమ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తోంది. జైడస్ క్యాడిలా హెల్త్ సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవిడ్ కూడా రెండో దశ పరీక్షలు పూర్తి చేసుకుంది. ఇవే కాకుండా రష్యా అభివృద్ధి చేస్తున్న స్పుత్నక్వి వ్యాక్సిన్ పరీక్షలను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ నిర్వహిస్తోంది. దేశీయ ఈ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆర్డీఐఎఫ్తో స్పుత్నిక్-వీ తయారీకి ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. తద్వారా ఏడాదికి పదికోట్ల డోసుల తయారీని చేపట్టనున్నట్లు తెలిపింది. 2021 ఆరంభంలో వ్యాక్సిన్ తయారీ ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆర్డీఐఎఫ్ పేర్కొంది. హైదరాబాద్‌లోని మరో సంస్థ బయోలాజికల్-ఇకి చెందిన టీకా మొదటి, రెండోదశ ప్రయోగాల్లో ఉంది.
‘‘ ప్రపంచ వ్యాప్తంగా 150 నుంచి 200 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిల్లో 50 వరకు హ్యూమన్ ట్రయల్స్ దశకు వచ్చాయి. రాబోయే రెండు,మూడు నెలల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని టీకాలు ఆయా దేశాలలోని నియంత్రణ సంస్థల అనుమతులు పొందే దశకు చేరాయి’’ అని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగాను అనేక కంపెనీలు వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు పోటీ పడుతున్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్ టీకాపై అందరూ దృష్టిసారించారు. తమ వ్యాక్సిన్ 90శాతం సురక్షితమని ఇటీవలే ఆ సంస్థ ప్రకటించింది. అమెరికాలో మోడెర్నా తయారు చేస్తున్న వ్యాక్సిన్ 95 శాతం రక్షణ కల్పిస్తుందని ట్రయల్స్ ప్రారంభ ఫలితాల్లో తేలింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
