
తాజా వార్తలు
జూమ్.. చైనా కంపెనీ కాదండోయ్!
అమెరికా కంపెనీ.. నాస్డాక్లో ట్రేడ్ అవుతోందన్న ప్రతినిధి
ముంబయి: జూమ్.. లాక్డౌన్ కాలంలో కార్యాలయ అవసరాలు తీర్చుకొనేందుకు కోట్లాది మంది ఉపయోగించిన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్. సెక్యూరిటీ లోపాలున్నాయని హెచ్చరించినా ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలోనే వాడుతున్నారు. పోటీగా జియోమీట్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉన్నప్పటికీ డౌన్లులోడ్లు మరింతగా పెరిగాయి. దుందుడుకు చైనాకు బుద్ధిచెప్పేందుకు భారత ప్రభుత్వం 59 యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో దీనిపైనా అనుమానాలు వచ్చినప్పటికీ తమది ‘మేడిన్ చైనా’ యాప్ కాదని భారతీయులకు జూమ్ చెబుతోంది.
తమకు భారత్ ఎప్పటికీ అతి ముఖ్యమైన మార్కెట్‌గానే ఉంటుందని జూమ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్ విభాగం అధ్యక్షుడు వెల్చామి శంకరలింగమ్ అంటున్నారు. స్థానికులకు తాము పెద్దపీట వేస్తున్నాయని వెల్లడించారు. ‘జూమ్‌కు చైనాకు ముడిపెడుతూ అపోహలు రావడం మమ్మల్ని బాధిస్తోంది. కానీ నిజాలు వేరు. అందుకే మేం కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు.
‘తన గుర్తింపు విషయంలో జూమ్ స్పష్టంగా ఉంది. ఇది అమెరికా కంపెనీ. నాస్డాక్లో ట్రేడ్ అవుతోంది. కాలిఫోర్నియాలోని శాన్జోన్స్లో దీనిని స్థాపించారు. చాలా టెక్నాలజీ సంస్థల్లాగే మా ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. అమెరికాలోని మాతృసంస్థకే చైనాలోనూ అనుబంధ కంపెనీలు ఉన్నాయి. మున్ముందు మేం డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్స్ ఇండియాకు ఎక్కువ మద్దతు ఇవ్వనున్నాం. వారికీ జూమ్‌ను పరిచయం చేస్తాం’ అని శంకరలింగం స్పష్టం చేశారు.
కంపెనీ సీఈవో ఎరిక్ ఎస్ యువాన్ మూలాలు చైనాలో ఉండటంతో జూమ్‌ను చైనా కంపెనీగా అపోహ పడుతున్నారని, సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తున్నారని శంకరలింగం వాపోయారు.